వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు షురూ .. రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటిమట్టం

వేసవి ప్రారంభంలోనే  నీటి కష్టాలు షురూ ..  రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటిమట్టం
  • మెయింటెనెన్స్​ పట్టని మేఘా కంపెనీ
  • వనపర్తి జిల్లాకేంద్రంతో పాటు గ్రామాల్లో తప్పని తిప్పలు

వనపర్తి, వెలుగు: వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో  తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భజలాలు తగ్గి మున్సిపాలిటీలు,  గ్రామాల్లో పవర్  బోర్లలో నీళ్లు అడుగంటగా, మరోవైపు మిషన్  భగీరథ నీళ్లు అంతంతమాత్రంగానే సప్లై అవుతున్నాయి. పదేండ్ల పాటు మిషన్​ భగీరథ స్కీమ్​ను మెయింటేయిన్​ చేయాల్సిన మేఘా కంపెనీ నిర్లక్ష్యం చేస్తోందని అంటున్నారు. దీంతో నీళ్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో  సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీల పరిధిలో 392 జనావాసాలున్నాయి. వీటికి ప్రతి రోజూ కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే 50  మిలియన్  లీటర్లు (ఎంఎల్డీ) అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం 40 ఎంఎల్డీ నీరు మాత్రమే సప్లై అవుతోంది. పైప్ లైన్ లో లోపాలు, విద్యుత్ సమస్యలు, నిర్వాహణ లోపాల వల్ల కొన్ని చోట్ల నీరు ప్రతిరోజూ అందడం లేదు. వారం రోజులుగా రేవల్లి మండల కేంద్రంలో  మిషన్  భగీరథ నీళ్లు అందకపోవడంతో ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నారు.

ట్యాంకర్​ వచ్చినప్పుడు జనం నీటి కోసం ఎగబడుతున్నారు. భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామంలోని బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెచ్చుకుంటున్నామని మాజీ సర్పంచ్  శివరాం రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా ఏదో ఒక సమస్యతో మిషన్  భగీరథ నీటి సరఫరా ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క పంచాయతీ మోటార్లు తరచూ చెడిపోతున్నాయి. మోటార్ల రిపేర్లతో నీళ్ల సరఫరా నిలిచిపోతోంది. ప్రత్యేకాధికారులకు ఇంకా గ్రామాలపై పట్టు రాకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. 

రిజర్వాయర్లలో అడుగంటుతున్న నీళ్లు..

జిల్లాలోని పలు రిజర్వాయర్ల ద్వారా మిషన్  భగీరథ పథకం కింద నీటిని సప్లై చేస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు శ్రీశైలం రిజర్వాయర్  బ్యాక్  వాటర్, రామన్ పాడు రిజర్వాయర్, శంకరసమద్రం, రంగసముద్రం, గోపన్ దిన్నె రిజర్వాయర్  నుంచి పంపింగ్  చేసి 12 ఫిల్టర్  బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలోని లక్ష మంది జనాభాకు నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రతి రోజూ 75 ఎంఎల్డీలను బుగ్గపల్లి తండా పంపింగ్  స్టేషన్ లో ఫిల్టర్ చేసి సప్లై చేస్తున్నారు. అయితే వనపర్తి పట్టణంలోని పలు వార్డుల్లో ఇంకా పైప్ లైన్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది.

గతంలో వనపర్తి, మహబూబ్ నగర్,అచ్చంపేట పట్టణాలకు తాగునీటిని అందించే రామన్ పాడు కృష్ణా జలాల స్కీమ్​లను మిషన్  భగీరథ పరిధిలోకి తెచ్చారు. మిషన్  భగీరథ స్కీమ్​ పనులు చేసిన మేఘా కంపెనీ అగ్రిమెంట్​ ప్రకారం మరో ఐదేండ్లు నిర్వాహణ చేయాలి. కంపెనీ సిబ్బందితో ఈ పథకం ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. జిల్లా అధికారులు వీరిని అజమాయిషీ చేస్తూ గ్రామాలకు నీరందేలా చూస్తున్నారు. అయితే కొన్ని చోట్ల నీటి సరఫరా ఎక్కువగా, మరికొన్ని చోట్ల నీరు తక్కువగా వదలడం విమర్శలకు కారణమవుతోంది. వేసవిలో మూడు నెలలు నీటిని సప్లై చేయడం ఓ సవాలేనని అంటున్నారు.

వేసవిలో మంచి నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క గ్రామంలో నీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. పైప్ లైన్లు, మోటార్ల సమస్యలు ఉంటే జీపీ ఫండ్స్  వాడుకోవాలని స్పెషల్  ఆఫీసర్లకు సూచించారు. అయినప్పటికీ నీటి సమస్య వస్తుండడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇకనైనా జిల్లాలోని అన్నిప్రాంతాలకు నీటిని అందించడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.