
- ఆపరేషన్ సిందూర్‌పై క్రీడా వర్గాల హర్షం
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని దేశ క్రీడాకారులు హర్షించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మొదలు యువ క్రీడాకారుల వరకు అందరూ మన సైనికుల ధైర్యాన్ని కొనియాడారు. గత నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఈ దారుణ దాడికి సమాధానంగా సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ దాడులు చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ క్రీడాకారులు సోషల్ మీడియాలో ప్రభుత్వం, సైన్యాన్ని కొనియాడుతూ పోస్టులు చేశారు. ‘మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు భయం ఉండదు. మన శక్తికి హద్దు ఉండదు. భారత రక్షణ కవచం మన ప్రజలే. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. మనమంతా ఒకే జట్టు. జై హింద్’ అని సచిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్లు సెహ్వాగ్,ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, శిఖర్ ధవన్ కూడా స్పందించారు. ‘ఎవరైనా నీపై రాయి విసిరితే పూలతో సమాధానం విసురు.
కానీ కుండీతో సహా విసరండి. జై హింద్’ అంటూ సెహ్వాగ్ తనదైన స్టయిల్లో రాశాడు. ఇండియా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా నిలబడిందని ధవన్ పేర్కొనగా.. ‘మన సైన్యం ప్రతికూల పరిస్థితులను ఒక గొప్ప విజయ ముహూర్తంగా మార్చింది. ప్రమాదం ఎదురులో వారి ధైర్యం, సాహసం అందరినీ గర్వపడేలా చేసింది. జై హింద్’ అని పేసర్ మహ్మద్ షమీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. మన దేశంలో, ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష పేర్కొంది. వరల్డ్ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ స్పందిస్తూ.. ‘మన సైనికులు కవ్వించరు. కదనరంగంలోకి దూకి శత్రువుల పని పడతారు. ఆపరేషన్ సిందూర్ మన హీరోల ధైర్యాన్ని చూపిస్తుంది’ అని పోస్ట్ చేసింది. మన సైన్యం ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతోందని, సైనికలు ధైర్యానికి, దేశభక్తికి సలాం అంటూ మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన జవాన్లు క్షస్త్రమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది.