తుగ్లక్ కేసీఆర్ ని చూస్తే.. నన్ను మించినోడు అనుకుంటాడు

తుగ్లక్ కేసీఆర్ ని చూస్తే.. నన్ను మించినోడు అనుకుంటాడు

సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన నూతన వ్యవసాయ విధానంకి త‌మ పార్టీ వ్యతిరేక‌మ‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ విధానంపై సమగ్ర అధ్యయనం చేయకుండా ప్రకటన చేస్తున్నారని, ఆ పాల‌సీని తాము వ్యతిరేకిస్తున్న‌ట్టు తెలిపారు. వైవిధ్యమైన పంటల పై పూర్తిగా సమగ్ర అధ్యయనం చేయాల‌ని, వ్య‌వ‌సాయ శాస్త్ర వేత్తలతో చర్చించాలని అన్నారు. బెదిరించి రైతులను వ్యవసాయం చేయించాలనుకోవడం సరికాదని చెప్పారు ఉత్త‌మ్. త్వరలో అందరితో చర్చించి తామే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు. కేసీఆర్ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, తాను చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తాననడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. రైతుల న్యాయం కోసం తాము పోరాటం చేస్తామన్నారు.

దౌర్భాగ్యపు టిఆర్ఎస్ పాలన లో రైతులు దివాలా తీశార‌ని చెప్పారు ఉత్త‌మ్. ఇప్పటి వరకు రుణమాఫీ అమలు చేయకుండా ఇన్ని రోజులు తరువాత 25 వేల రూపాయలు మాఫీ చేశారని అన్నారు. క్రాప్ లోన్లు లో త‌మ పార్టీ వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింద‌ని, ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఇవేమీ జగరడం లేదని అన్నారు. ప్రకృతి విపత్తుల వలన నష్ట పోయిన వారికి వెంటనే పరిహారం ఇచ్చేవారని, కేసీఆర్ ఒక్క సారి కూడా ఇవ్వలేదన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ లేద‌ని, రైతు బందు పథకం ఇంకా 40 శాతం వరకు చేరలేదని ఉత్త‌మ్ అన్నారు.దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతి ధాన్య‌పు గింజా కొంటాన‌ని చెప్పిన కేసీఆర్ ..50 రోజులు దాటినా ఇంకా 50 శాతం కూడా సేక‌ర‌ణ జరగ‌లేదని, ఇంకెప్పుడు కొంటారని ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. వారం రోజుల‌ కింద .. రెండు మూడు రోజుల్లో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్నాయని చెప్పి.. ఇప్పుడు మళ్లీ నేను చెప్పిందే చేయాలంటూ రైతులను కేసీఆర్ తిక మక పెడుతున్నార‌ని అన్నారు. ఒక్కో సారి ఒక్కో పంట వేయాలని , మరొక వారం లో మరో పంట వేయాలని సీఎం కేసీఆర్ అంటార‌ని అన్నారు. తుగ్లక్ కూడా కేసీఆర్ ని చూసి త‌న‌ను మించిన వ్యక్తిగా భావిస్తాడ‌ని ఉత్త‌మ్ అన్నారు.

పత్తి పంట విషయంలో విత్తనం నుండి.. ధర వరకు ఏదీ కూడా కేసీఆర్ చేతుల్లో లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. పత్తి ని సర్కార్ క్వింటాకి 7 వేల రూపాయలకి కొంటామ‌ని ప్రకటన చేయాలన్నారు. వర్షాకాలంలో వేసే పంటే మొక్క‌జొన్న అని, కేసీఆర్ మాత్రం ఇప్పుడు వద్దు అంటున్నార‌ని అన్నారు. వరి పంట‌ విషయం లో పూర్తి నిర్లక్ష్యం వ‌‌హిస్తూ..‌ మీ చేతగాని తనం తో కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చే ధరను కూడా రాబట్టలెక పోయారని అన్నారు. వరి సాగు చేసిన రైతులకు 500 బోనస్ ఇవ్వాలని.. మహా రాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బోనస్ ఇస్తున్నార‌ని ఉత్త‌మ్ అన్నారు. మిర్చి, పసుపు రైతుల‌కి నమ్మకం ఇవ్వాల‌న్నారు. పాడి రైతులకు ప్రోత్సాహకం ఇవ్వాలని, లీటరు పాలకు 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పారు ఉత్త‌మ్.