
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి, ప్రత్యేక అధికారాలను ఇచ్చే 370 ఆర్టికల్ రద్దయి ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తితోపాటు 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రముఖ పార్టీల నేతలు జట్టు కట్టారు. దీని కోసం తాము పోరాడుతామని పేర్కొన్నారు. అయితే గుప్కర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా సదరు ఆరు పార్టీలు జట్టు కట్టడం వెనుక దాయాది పాకిస్తాన్ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు కూటమి నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. తాము ఎవరి కీలు బొమ్మలమూ కాదని ఫరూక్ స్పష్టం చేశారు.
‘జమ్మూ కాశ్మీర్‌లోని పార్టీలను పాకిస్తాన్ ఎప్పుడూ తిడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ దేశం మమ్మల్ని ఇష్టపడుతోంది. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా.. మేం ఎవరి కీలు బొమ్మలమూ కాదు. ఇటు న్యూఢిల్లీ లేదా అటు బోర్డర్‌కు వెలుపల ఉన్న ఇతరులకు.. ఎవరి కీలు బొమ్మలమూ కాదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రమే మేం జవాబుదారీ. వారి కోసమే మేం పని చేస్తున్నాం. కాశ్మీర్‌కు సాయుధులను పంపడాన్ని ఆపేయాల్సిందిగా పాకిస్తాన్‌ను నేను కోరుతున్నా. మా రాష్ట్రంలో రక్తపాతం ముగియాలని మేం భావిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పార్టీలు మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలని నిర్ణయించాం. గతేడాది ఆగస్టు 5న రాజ్యాంగానికి విరుద్ధంగా మా నుంచి దేన్నైతే తీసుకున్నారో దానిపై పోరు సలపుతాం’ అని ఫరూక్ పేర్కొన్నారు.