రైతుల మంచి కోసమే ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్నాం 

రైతుల మంచి కోసమే ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్నాం 
  • వరి కంటే ఎక్కువ లాభాలొచ్చే పంటలపై అధ్యయనం చేయించాం
  • అత్యంత నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చాం
  • ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఒకవైపు కేంద్రం మెలికలు పెడుతూ.. వరి కొనమని మొండికేస్తోందని.. ముందు జాగ్రత్తగా రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వరి సాగు కంటే ఎక్కువ లాభాలు వచ్చే పంటల గురించి శాస్త్రవేత్తలను, నిపుణులు పిలిపించి అధ్యయనం చేయించి నువ్వులు, ఆవాలు, వేరుశనగ తదితర 10 రకాల పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించామని, నాణ్యమైన విత్తనాలను తెప్పించి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులంతా చెడిపోయి.. గత్తర బిత్తర అయిపోయిన రైతులను ఏడేండ్లు కష్టపడి ఒక దారికి తెచ్చామని, గ్రామాల్లో సంతోషం ఉన్నది.. నీళ్లు వస్తున్నాయి.. పంటలు పండుతున్నాయని, రైతులు బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని వివరించారు. 
కేంద్రం ఆధీనంలోని ఎఫ్ఐసీ ధాన్యం కొనకుండా పోతే తామేం చేయగలమని.. నిల్వ చేసే అవకాశం.. సౌలభ్యం..  విదేశాలకు ఎగుమతి చేసే అధికారం  దేశంలో ఏ రాష్ట్రాలకు లేదని.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు.. కేంద్రం మధ్య కొట్లాడుకుంటూ కూర్చుంటే మధ్యలో రైతులు నష్టపోయే పరిస్థితి వద్దని తాము రైతులను వరి వేయొద్దు.. అంతకంటే ఎక్కువ లాభం వచ్చే పంటలు చాలా ఉన్నాయని చెబుతుంటే బీజేపీ నాయకులు మాత్రం బాధ్యతా రాహిత్యంగా.. నిర్లక్ష్యంగా.. రైతులు రోడ్డునపడే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 
మీరు వరి పంటనే పండించండి..రాష్ట్రం కొనకపోతే మెడలు వంచి మేం కొనిపిస్తామంటూ బీజేపీ వారు అహంకారంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ తప్పుపట్టారు. బీజేపీ వారు ఎవరి మెడ వంచుకుంటారు..? కేంద్రం మెడ వంచుకుంటారా..? ఏ పద్ధతిలో మాట్లాడతారు.. అడ్డదిడ్డం మాట్లాడి.. అనధికారికంగా మాట్లాడి.. రైతులు దెబ్బతింటే ఎవరిది బాథ్యత అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒకవైపు మేం కొనమని.. డబ్బలు ఇవ్వకుండా కేంద్రం సతాయిస్తుంది.. కేంద్రంలోని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. పైగా పార్లమెంటు సభ్యుడు.. బాధ్యతారాహితంగా ఏది పడితే అది మాట్లాడొచ్చు అనుకుంటున్నాడని.. ఏం పద్ధతి ఇది.. రైతులు పంట వేసి రోడ్డునపడితే నువ్వు ధర్నా చేస్తావా.. ? అంటూ బీజేపీ నాయకులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వారి సొల్లు కబుర్లు నమ్మి.. పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే దెబ్బతింటామని కేసీఆర్ హెచ్చరించారు. యాసంగిలో వరి పంట క్షేమదాయకం కాదని.. కేంద్రం మొదట్నుంచి రైతుకు వ్యతిరేకంగా ఉంది.. ఏడేండ్లు సహనంగా ఉన్నాం.. స్థాయిని మించి అహంకారంగా మాట్లాడినా ఊరుకున్నాం.. రైతులు రోడ్డునపడి నష్టపోయినా మాకేంటని బీజేపీ వారు చెప్పేది తప్పు అని కేసీఆర్ అన్నారు. ఏడేండ్ల నుంచి మిమ్మల్ని కాపాడుతోంది ఎవరో మీకు తెలుసు.. మీరు నష్టపోవద్దని.. మీరు మునిగిపోవద్దని.. కేంద్రం కొననటువంటి ధాన్యాన్ని వేస్తే నష్టపోతారని కేసీఆర్ హెచ్చరించారు.