మేం హ్యాట్రిక్ సాధించడం పక్కా : హరీశ్ రావు

మేం హ్యాట్రిక్ సాధించడం పక్కా : హరీశ్ రావు
  • 16న వరంగల్ సభలో  కేసీఆర్ ప్రకటిస్తరు: హరీశ్ రావు
  • బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు
  • రేవంత్​ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్య

మక్తల్/ కోస్గి/వనపర్తి/ కొత్తకోట, వెలుగు: వరంగల్‌‌లో ఈనెల 16న జరిగే సభలో బీఆర్ఎస్ మేనిఫెస్టోని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి హరీశ్​రావు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మైండ్ బ్లాక్ అయ్యేలా తమ మేనిఫెస్టో ఉంటుందని అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని కోస్గిలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. మక్తల్‌‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలో ఓ మాట, తెలంగాణలో మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ బాగా పని చేస్తున్నారని మోదీ గతంలో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఢిల్లీకి కేసీఆర్ వస్తే నీళ్లు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతారని.. ఆంధ్రా లీడర్ కేసుల గురించి మాట్లాడతారని చెప్పిన మోదీ.. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు అబద్ధాలు చెప్పడం సరికాదు” అని హితవుపలికారు. బీఆర్ఎస్‌‌ను  కుటుంబ పార్టీ అన్న మోదీ.. కర్నాటకలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని ఎన్‌‌డీఏలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఎవరో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు కేసీఆర్ నామినేటెడ్​ పదవులు ఇవ్వలేదని, ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించారని చెప్పారు. కేసీఆర్​తమను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమన్నారని, పోరాటాలు చేసి జైలుకు పోయామని గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలన్నారు.

కాంగ్రెస్ ను నమ్ముకుంటే పాము నోట్లో పడ్డట్లే

‘ఓటుకు నోటు’ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి.. జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్​రావు అన్నారు. ఈ కేసులో విచారణ ఆపేయాలంటూ సుప్రీం కోర్టుకు రేవంత్ వెళ్లారని, కోర్టు మాత్రం విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసిందని తెలిపారు. తప్పు చేసిన ఆయనపై కచ్చితంగా విచారణ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా ఆయన జైలుకు వెళ్లడం పక్కా అని అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. రేవంత్‌‌ను కొడంగల్‌‌లో ఓడిస్తే మల్కాజ్ గిరి పోయారని, అక్కడా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. ఐదు హామీలతో కర్నాటక లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అక్కడ ఒక్కటి కూడా  అమలు చేయకుండా చతికిలపడిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్​లు జాకీ పెట్టి లేపినా లేవలేవని, రాష్ట్రంలో బీజేపీకి   క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు లీడర్ లేడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే పెద్ద పాము నోట్లో పడ్డట్లేనని ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయని, కేసీఆర్ హాట్రిక్ సీఎం కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని అన్నారు.

కేసీఆర్ చొరవ వల్లే కృష్ణా ట్రిబ్యునల్‌‌కు ఆమోదం

రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లా కోనసీమగా మారుతుందని హరీశ్ రావు అన్నారు. తొమ్మిదేండ్లుగా కృష్ణా ట్రిబ్యునల్‌‌ను ఏర్పాటు చేయకుండా, కృష్ణా జలాల వాటా తేల్చకుండా కేంద్రం సతాయిం చిందని, కేసీఆర్ చొరవతో కేంద్ర కేబినెట్ కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించిం దన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు అందుతాయని, పాలమూరు జిల్లాలో ప్రతి గుంటకు నీళ్లు పారించి రైతుల పాదాలు కడుగుతామ న్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా అన్నిరకాల వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నామని చెప్పారు.