వారి తల్లుల ద్వారానే మార్పుకు పిలుపునిచ్చాం : కేజేఎస్ ధిల్లాన్

వారి తల్లుల ద్వారానే మార్పుకు పిలుపునిచ్చాం : కేజేఎస్ ధిల్లాన్
  • ఈ ఆపరేషన్ లో 50 మంది యువతను వెనక్కి రప్పించాం
  • ‘కిత్ నే ఘాజీ ఆయే, కిత్ నే ఘాజీ గయే’ బుక్ లో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్

న్యూఢిల్లీ:  భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన ఓ టెర్రరిస్టు వద్ద దొరికిన లేఖనే.. ‘ఆపరేషన్ మా’కు శ్రీకారం చుట్టేలా ఐడియాను ఇచ్చిందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్(కేజేఎస్) ధిల్లాన్ వెల్లడించారు. పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి కాశ్మీరీ యువత మోసపోకుండా ఉండేందుకు తాను ఆర్మీలో ఉండగా ‘ఆపరేషన్ మా’ను చేపట్టామని, ఈ ఆపరేషన్ పుట్టుకకు టెర్రరిస్టు లేఖనే దోహదం చేసిందన్నారు. కాశ్మీరీ యువకులకు తండ్రుల కంటే తల్లులతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందని, వారు తల్లుల మాటే వింటారని తాను ఆ లేఖతో అర్థం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘కిత్ నే ఘాజీ ఆయే, కిత్ నే ఘాజీ గయే– మై లైఫ్ స్టోరీ’ అనే పేరుతో రాసిన పుస్తకంలో ధిల్లాన్ ఈ మేరకు తన సర్వీస్ లో జరిగిన అనేక విషయాలను వివరించారు. ‘‘కాశ్మీర్​లో టెర్రరిస్టుల ఏరివేత సందర్భంగా ఓసారి చనిపోయిన టెర్రరిస్ట్ వద్ద ఒక లెటర్ దొరికింది. అది అతను తన తల్లికి రాసిన లేఖగా గుర్తించాం. దీంతో కాశ్మీర్​లో సామాజిక, కుటుంబం సంబంధాలను నేను అర్థం చేసుకునేందుకు ఇది మార్గం చూపింది. ఆ తర్వాత టెర్రరిస్టుల జీవితాలను బాగా విశ్లేషించా. కాశ్మీరీ యువకులకు తల్లులతోనే అనుబంధం ఎక్కువని, వారు తల్లి మాటే వింటారని అర్థం చేసుకున్నా. ఈ ఆలోచనల్లోంచే ‘ఆపరేషన్ మా’ పుట్టింది” అని ధిల్లాన్ చెప్పారు. 

స్టోన్ పెల్టర్లే ఎక్కువ..

‘‘ఆపరేషన్ మా ద్వారా వచ్చిన ఫలితాలు నా కండ్లను తెరిపించాయి కూడా. కాశ్మీర్​లో తుపాకీ పడుతున్న యువతలో 7% మంది తొలి 10 రోజుల్లోనే ఎన్​కౌంటర్​లో హతమవుతున్నారు. 17% మంది 3 నెలల్లో, 36% మంది 6 నెలల్లో, మిగతా వాళ్లు ఏడాదిలోపే చనిపోతున్నారు. టెర్రరిస్టుల్లో చేరుతున్న వాళ్లలో 83% మంది స్టోన్ పెల్టర్లుగా పనిచేసిన వాళ్లే. దీంతో మేం స్టోన్ పెల్టర్ల తల్లులను కలిశాం. ఇయ్యాల్టి స్టోన్ పెల్టర్లే ముందుముందు టెర్రరిస్టుల్లో చేరుతున్నరని వివరించాం. టెర్రరిస్టుల్లో చేరినా.. శవాలుగా తిరిగి రావడానికి ముందే వెనక్కి రప్పించాలని మోటివేట్ చేశాం. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చాం. వారి ఐడెంటిటీని కూడా సీక్రెట్ గా ఉంచాం. దీంతో దాదాపు 50 మంది బాయ్స్ టెర్రరిజాన్ని వదిలేసి తిరిగి వచ్చారు. వారు సేఫ్​గా తిరిగి వచ్చేందుకు కొన్నిసార్లు యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్లను కూడా నిలిపేశాం” అని ధిల్లాన్ తన పుస్తకంలో వివరించారు. 

వాళ్ల ఐడెంటిటీ సీక్రెట్​గా ఉంచాం 

టెర్రరిజం వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన యువతను టార్గెట్ చేసుకుని దాడి చేసేందుకు బార్డర్ అవతల ఉన్న రాబందులు ప్రయత్నించాయని, కానీ తాము ఆ యువకుల ఐడెంటిటీని సీక్రెట్​గా ఉంచి కాపాడామని ధిల్లాన్ తెలిపారు. ‘‘ఇయ్యాల వారిలో ఎంతోమంది కాలేజీలకు వెళ్తున్నారు. పొలాల్లో తండ్రులకు సాయం చేస్తున్నారు. కొందరు ఏదో ఒక పని చేస్తూ కుటుంబాల కోసం సంపాదిస్తున్నారు. వారందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా” అని పేర్కొన్నారు. కాగా, కేజేఎస్ ధిల్లాన్ ఆర్మీకి చెందిన రాజ్ పుతానా రైఫిల్స్​లో 1983లో కెరీర్ ప్రారంభించారు. కెప్టెన్, మేజర్, కమాండింగ్ ఆఫీసర్, బ్రిగేడియర్​గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేసిన సమయంలో కాశ్మీర్​లోని 15వ కోర్​కు జనరల్ కమాండింగ్ ఆఫీసర్​గా ఉన్నారు. 2022, జనవరిలో ఆయన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్​గా ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు.