కేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్

కేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్
  • కిషన్​రెడ్డి రండ మంత్రి, 
  • చేతగాని దద్దమ్మ, ఉన్మాది
  • సిగ్గు, లజ్జ ఉంటే కిషన్​రెడ్డి, పీయూష్​ గోయల్​ కండ్లు తెర్వాలె
  • రైతు హంతక పార్టీ బీజేపీ.. 
  • మేం రైతు బంధువులం
  • 80 లక్షల కోట్ల అప్పులు చేసిన 
  • బీజేపీ సర్కారును పారదోలాలె
  • వానాకాలం వడ్లు కొనకుంటే ప్రధాని ఆఫీసు ముందు పోస్తం
  • రాష్ట్ర రైతులు కోటీశ్వరులైన్రు
  • నేను లంగ మాటలు మాట్లాడ
  • మక్కలు, జొన్నల కొనుగోళ్ల వల్ల మేం 10 వేల కోట్లు నష్టపోయినం

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో వడ్ల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోమని, వడ్లు కొనబోమని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పారు. బాయిల్డ్​ రైస్​ను కేంద్రం కొనబోమంటోందని, యాసంగిలో వచ్చేదే బాయిల్డ్​ రైస్​ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినందున రాష్ట్రం ధాన్యం సేకరించదని స్పష్టం చేశారు.  వడ్ల కొనుగోళ్లపై కేబినెట్‌‌లో నాలుగు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రిస్క్​ చేయాలనుకునే రైతులు మాత్రం వరి పండించుకోవచ్చని చెప్పారు. సోమవారం ప్రగతిభవన్​లో కేబినెట్​ మీటింగ్​ తర్వాత సీఎం కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోడీకి పాలన చేతగాదని, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. ‘‘కిషన్​రెడ్డి రండ మంత్రి. చేతగాని దద్దమ్మ, ఉన్మాది. కేంద్ర మంత్రులు కిషన్‌‌ రెడ్డి, పీయూష్‌‌ గోయల్‌‌కు సిగ్గు, లజ్జ ఉంటే కండ్లు తెర్వాలె” అంటూ విరుచుకుపడ్డారు. 
పేగులు తెగే దాకా కొట్లాడిన 
‘‘వడ్ల కొనుగోళ్లపై పేగులు తెగేదాక కొట్లాడిన.. 15 సార్లు అధికారులు, ఆరు సార్లు మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి పోయిండ్రు.. ‘మీకు ఏం పనిలేదా గింత మంది వచ్చిన్రు’ అని కేంద్ర మంత్రి అంటున్నడు. ఢిల్లీకి తిరిగి విమానం ఖర్చులు దండుగైనయ్” అని కేసీఆర్​ అన్నారు. 
కేంద్రంలో ఉన్నది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని, సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘ధాన్యం ఎంత కొంటవురా బై అంటే హుజూరాబాదూ.. తోకబాదు.. దుబ్బాక అంటున్నరు. మేం మక్కలు, జొన్నలు కొని రూ.10 వేల కోట్ల పైచిలుకు నష్టపోయినం” అని చెప్పారు. ‘‘కిషన్‌‌‌‌ రెడ్డి బహిరంగ చర్చకు రా.. ఏ చౌరస్తాల్నైనా కూర్చుందాం.. లేకపోతే రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పు.. కేంద్రంతో మాట్లాడు.. ఎన్ని వడ్లు కొంటరో చెప్పాల్నని కేసీఆర్‌‌‌‌ షెంట్‌‌‌‌తుండు అని చెప్పు.. గిన్ని టన్నులు కొంటమని చెప్పు.. గదీ మొగతనం..’’ అంటూ కేసీఆర్​ దుయ్యబట్టారు.  ‘‘వరి వేయకండి అని మేం చెప్తే.. పనికి మాలిన, అవగాహన లేని మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ‘మెడలు వంచుతుం.. తొడలు గోస్తం.. ఎట్లా కొనరో చూస్తం’ అని అన్నడు. ఈ దుర్మార్గులు.. రాబందుల్లా రైతుల మీద పడుతున్నరు. ఇదే మాట కేంద్ర మంత్రికి చెప్తే ‘మావోడు బేకూఫ్‌‌‌‌ తప్పు చెప్పిండు.. అవగాహన రాహిత్యం మాట్లాడిండు’ అని నాకు, మా మంత్రులకు చెప్పిండు. రైతులను ముంచేది మీరు.. ఉల్టా మా మీద బద్నాం పెడ్తరా? బురిడీగాళ్లను రైతులు నమ్ముకుంటే శంకరగిరి మన్యాలే” అని అన్నారు. 
బీజేపీది వాట్సప్‌‌‌‌ యూనివర్సిటీ 
బీజేపీది వాట్సప్‌‌‌‌ యూనివర్సిటీ అని కేసీఆర్‌‌‌‌ విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్రంలో దేకెటోళ్లు కూడా లేరన్నారు. ‘‘రైతులేమన్నా బాయిల్డ్‌‌‌‌ వడ్లు పండిస్తరా అని అంటున్నరు. మీ మెదడు బాయిల్డ్‌‌‌‌ చేయాల్నా.. రైతులేనిది మిల్లర్‌‌‌‌ ఉంటడా.. మిల్లర్‌‌‌‌ లేనిది రైతు ఉంటడా.. మేం మిల్లర్లకు అనుకూలంగా ఉన్నమని దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నరు.. మేం ధైర్యంగా సాహసంగా చెప్తం.. మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడుగ అని చెప్పినం.. 24 గంటల కరెంట్‌‌‌‌ ఇస్తమన్నం.. ఇచ్చినం.. జానారెడ్డి గులాబీ కండువా కప్పుకుని తిరుగుతా అని మాట తప్పిండు..’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం హామీ ఇవ్వకపోయినా వానాకాలం వడ్లను తాము కొంటామని, వాటిని కేంద్రం తీసుకోకపోతే ప్రధాని ఆఫీసు ముందు, కిషన్​రెడ్డి ఇంట్ల, బీజేపీ ఆఫీసు ముందు, ఇండియా గేట్​ కాడ పోస్తమని ఆయన మండిపడ్డారు.  రా రైస్‌‌‌‌ ఎంత కొంటరో చెప్పమంటే కూడా కేంద్రం 
చెప్తలేదన్నారు. 
మోడీ ప్రభుత్వాన్ని పారదోలాలే
దేశం నుంచి మోడీ ప్రభుత్వాన్ని పారదోలాలని కేసీఆర్‌‌‌‌  అన్నారు. ఇందు కోసం యుద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. 750 మంది రైతుల చావులకు కారణమై వాళ్లకు రూపాయి పరిహారం ఇవ్వమంటే ఇస్తలేరని, ఏడేండ్లలో ఈ కేంద్ర ప్రభుత్వం రూ.80 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. వాటికి కూడా లెక్కలున్నాయని, రేపు ఎల్లుండి ఆ లెక్కలు ఇస్తామన్నారు. ‘‘నరేంద్రమోడీ ప్రభుత్వం ఏడేండ్లలో ఏం ప్రగతి సాధించిందో చెప్పండి. దేశానికి మత పిచ్చిలేపి విభజన రాజకీయాలు తెచ్చి దేశాన్ని రావణకాష్టం చేస్తరు. దుర్మార్గ బీజేపీని పారదోలాలే..’’ అని కేసీఆర్​ చెప్పారు.  క్రూడాయిల్‌‌‌‌ ధరలు తగ్గినా పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలు పెంచింది నరేంద్రమోడీ ప్రభుత్వమేనని కేసీఆర్​ దుయ్యబట్టారు. కేంద్రం ధరలు పెంచితే రాష్ట్రాలు వ్యాట్‌‌‌‌ తగ్గించాలని ధర్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు.  ‘‘మీకు సిగ్గు, ఇజ్జత్‌‌‌‌, మానం ఉందా.. ఇదేం దందా.. కేంద్ర మంత్రి, వాళ్ల పార్టీవాళ్లు చాలా దరిద్రంగా మాట్లాడుతున్నరు..  నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. కార్పొరేట్లు, అంబానీ, అదానీలకు కట్టబెట్టాలని అగ్రిచట్టాలు తెచ్చిన్రు. ఉత్తరప్రదేశ్‌‌‌‌, పంజాబ్‌‌‌‌లో ఓడిపోతమని వాటిని వెనక్కి తీసుకున్నరు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పినట్టే రేపు తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తది. పెద్ద నోరు పెట్టి అడ్డమైన మాటలన్నీ మాట్లాడంగనే నిజం అయిపోతయా” అని విమర్శించారు. ‘‘ఇంకో దుర్మార్గమైన కరెంట్‌‌‌‌ చట్టం తెస్తున్నరు.. ప్రతి బోరు కాడా మీటర్‌‌‌‌ పెట్టాలని అంటున్నరు’’ అని అన్నారు.  ‘ఎఫ్‌‌‌‌సీఐ సేకరించేది వడ్లు, గోధుమలే... దీనిలో రాద్ధాంతం పుట్టించి దేశ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నరు.. లక్షల కోట్ల బడ్జెట్‌‌‌‌ కలిగి ఉండి 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కేంద్రం చిల్లరకొట్టు షావుకారి లెక్క, వ్యాపారి లెక్క మాట్లాడొద్దు. ప్రజాపంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత సోషల్‌‌‌‌ రెస్పాన్సిబులిటీ. ఆహార నిల్వలు పెరిగితే దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించే శక్తి కేంద్రానికే ఉంటది.. లక్ష కోట్ల నష్టం వచ్చినా కేంద్రమే దాన్ని భరించాలి. ఇంత నీచమైన, దిగజారిన కేంద్రాన్ని ఇంతవరకు చూడలె’’ అని కేసీఆర్​ మండిపడ్డారు. 
పిసగాడిద కొడుకులు సిగ్గుపడాలె
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కోసం కేంద్రాన్ని వెంటాడుతామని కేసీఆర్‌‌‌‌ అన్నారు.  రైతు చట్టాల రద్దు కోసం చనిపోయిన 750 మంది రైతులకు రాష్ట్ర కేబినెట్‌‌‌‌ రూ.22.50 కోట్లు శాంక్షన్‌‌‌‌  చేసిందన్నారు. ‘‘ఇష్టమున్నట్లు మాట్లాడే పిసగాడిది కొడుకులు సిగ్గుపడాలె.. కొక్కిరాయిగాడు మాట్లాడితే దాన్ని మేం కేర్‌‌‌‌ చేయం.. గతంలో సైనికులకు చెప్పినం.. ఇప్పుడు రైతులకు చెప్పినం.. నేను, మా మంత్రులు పోయి రైతులకు డబ్బులు డిస్ట్రిబ్యూట్‌‌‌‌ చేస్తం.. రూ.25 లక్షలు రైతు కుటుంబాలకు ఇవ్వాలె.. కనీస మద్దతు ధర చట్టం కూడా ఇదే సెషన్‌‌‌‌లో తేవాలె.. చాలా ప్రెస్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌లు ఉంటయి.. అన్నీ ఒక్క రోజే చెప్పమంటే ఎట్లా..’’ అని అన్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 3 వేల కోట్లు రైతు బీమా ఇచ్చామని, ఇలాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు.
రాష్ట్రంలో రైతులు కోటీశ్వరులైన్రు
తెలంగాణ రాకముందు లక్షలు కూడా దిక్కులేని రైతులు ఇయ్యాల కోటీశ్వరులయ్యారని కేసీఆర్​ అన్నారు. ‘‘ఏడేండ్ల కింద రైతు బిచ్చగాడు.. అప్పుడు ఐదెకరాలున్న రైతు అయినా హైదరాబాద్‌‌‌‌ల కూలీ పనికి పోవాల్సిన పరిస్థితి.. ఇప్పుడు కోటీశ్వరులైన్రు. ఇయ్యాల రాష్ట్రంల ఏ మూలకు పోయిన రూ.20 లక్షలలోపు కూడా ఎకరం భూమి లేదు. ఇయ్యాల రాష్ట్రంలో కోటాను కోట్ల రూపాయలు పల్లెల్లో ఉంటున్నయ్​. గ్రామాల మొఖం ఎట్ల తెల్లబడ్డది.. దీనికి కారణం ఎవ్వలు.. పశు సంపద మెరుగైంది.. హయ్యెస్ట్‌‌‌‌ గొర్రెలు ఉన్నది తెలంగాణల్నేనని కేంద్రం కూడా చెప్పింది’’ అని ఆయన పేర్కొన్నారు.  యాసంగి సీజన్‌‌‌‌లోనూ రైతుబంధు ఇస్తామన్నారు. కల్తీ విత్తనాల మీద పీడీ యాక్టు తెచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. ‘‘కిషన్‌‌‌‌ రెడ్డి నకిలీ విత్తనాలు అంటున్నరు.. ఆయనకు మొఖం తెలుసు” అని కేసీఆర్​ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో కన్నా రాష్ట్రంలో కోటి రెట్లు మంచిగ ఉన్నమని చెప్పారు. ‘‘గ్లోబల్‌‌‌‌ హంగర్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లో 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101. కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు.. కిషన్​రెడ్డి, పీయూష్​ గోయల్​కు  సిగ్గు, లజ్జ ఉంటే కండ్లు తెరవాలే.. మీ పాలనలో దేశంలో ఆకలి కేకలు పెరిగినయి. అన్నపు రాసులు ఒకవైపు.. ఆకలి కేకలు ఒకవైపు.. అని అప్పట్ల ఓ విప్లవ కవి రాసిండు.. నిల్వలు ఉంటే పేదలకు పంచుండ్రి’’ అని అన్నారు. 

  • కిషన్‌‌‌‌ రెడ్డి రండ మంత్రి

కేంద్ర మంత్రులు కిషన్‌‌‌‌రెడ్డి, పీయూష్‌‌‌‌ గోయల్​పై కేసీఆర్‌‌‌‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ధాన్యం కొనబోమని చెప్పే రండ కేంద్ర మంత్రి, చాతగాని దద్దమ్మ కేంద్ర మంత్రి కావాల్నా తెలంగాణకు.. మేం కావాల్నా.. ఆయన ఉన్మాదిలా మాట్లాడుతున్నరు” అంటూ కిషన్​రెడ్డిపై ధ్వజమెత్తారు. ‘‘నీకు దమ్ముంటే బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కొనిపియ్యి .. అది నీకు చాతకాదు.. మీది రైతు హంతక ప్రభుత్వం.. మీ ప్రధాన మంత్రే రైతులకు క్షమాపణ చెప్పిండు.. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతక పార్టీ.. రాబందు పార్టీ.. కారుకూతలు కూస్తున్నరు.. మల్లా సిగ్గులేకుండా మాట్లాడుతున్నరు..మీకు తెలివి తేటలు లేక, నిర్వహణ సామర్థ్యం లేక అరాకిరి.. దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నరు.. తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌.. దానిపై ఉల్టా పల్టా మాట్లాడుతున్నరు. అందుకే మా ఎంపీలు పార్లమెంట్‌‌‌‌ల నిలదీస్తున్నరు’’ అని అన్నారు.  తాము   రైతు బంధువులమని,  నాశనం అయిపోయిన చెరువులను కాపాడామని చెప్పారు. ‘‘అగ్రికల్చర్‌‌‌‌ పాలసీ నీకు తోక ఎరుక.. పాలసీ నాకు తెల్వకనే 1.41 కోట్ల టన్నులు పండించినమా..’’ అని కిషన్‌‌‌‌రెడ్డిపై కేసీఆర్​ మండిపడ్డారు.