చర్చలు జరిపే ఇంట్రెస్ట్.. యుద్ధం ముగించే ఆలోచన లేదు: అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్

చర్చలు జరిపే ఇంట్రెస్ట్.. యుద్ధం ముగించే ఆలోచన లేదు: అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్

టెహ్రాన్: యుద్ధం ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను మరో ఆలోచన లేకుండా ఇరాన్ తిరస్కరించింది. అమెరికాతో చర్చలు జరిపే ఇంట్రెస్ట్.. యుద్ధం ముగించే ఆలోచన మాకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనను టెహ్రాన్ సమీక్షిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న అమెరికా శాంతి ప్రణాళికను తోసిపుచ్చారు. 

యుద్ధం ముగింపు గురించి అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళిక కూడా ఇరాన్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తులతో రాయబారం పంపుతోందని.. దీనిని అధికారిక శాంతి చర్చలుగా ఇరాన్ పరిగణించడం లేదని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపించుకోవడం అంటే అమెరికాతో చర్చలు జరపడం కాదన్నారు.

 ఈ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని పేర్కొన్నారు. త్వరిత విజయం, ఇరాన్ ప్రభుత్వ మార్పు వంటి అమెరికా యుద్ధ లక్ష్యాలు నేరవేరలేదని చెప్పారు. ఏ దేశం కూడా ఇరాన్ భద్రతకు ముప్పు కలిగించలేదని నిరూపించామన్నారు. ఇరాన్ పొరుగు దేశాలకు అమెరికాకు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపును కోరుకుంటోందని తమ వైఖరిని అరాఘ్చి స్పష్టం చేశారు. 

అమెరికా 15 షరతులు:

యుద్ధాన్ని ఆపాలంటే 15 షరతులకు అంగీకరించాలంటూ ఇరాన్‎కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ పంపారు. అణు బాంబుల తయారీని ఇరాన్ పక్కనపెట్టాలని, హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేయాలని.. హిజ్బుల్లా వంటి ప్రాక్సీ టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండిషన్లు పెట్టారు. శాంతి ఒప్పందంపై చర్చించేందుకు వీలుగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలనీ ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

ఇరాన్ రిటన్ కండీషన్స్:

ఇరాన్ కూడా ట్రంప్‎కు రిటర్న్ కండిషన్లు పెడుతూ ప్రపోజల్ పంపింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‎లను మూసేయాలని డిమాండ్ చేసింది. అలాగే, ఇరాన్‎పై ఆంక్షలను ఎత్తేయాలని కోరింది. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని.. హార్మూజ్‎లో నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించేందుకు అనుమతివ్వాలని షరతులు పెట్టింది.