అప్పుడు లేని అభ్యంతరాలు..ఇప్పుడెందుకు..?

అప్పుడు లేని అభ్యంతరాలు..ఇప్పుడెందుకు..?

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తెలిపారు. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని.. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఆంక్షలు పెట్టినా అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి తెలిపారు. 

కాగా బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామ యాత్ర కన్వీనర్ మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్ లకు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ధర్మ దీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాతయాత్రను నిలిపివేస్తూ నోటీసులిచ్చామన్న పోలీసులు... పాదయాత్రను నిలిపివేయకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.