మాది సెక్యులర్ పార్టీ: సిటిజన్‌షిప్ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్

మాది సెక్యులర్ పార్టీ: సిటిజన్‌షిప్ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్

సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లును టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. సోమవారం లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ సెక్యులర్ పాలసీని అనుసరిస్తోందన్నారు నామా. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తాము బలంగా నమ్ముతామని, ఈ బిల్లు అందుకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు.

పాక్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేలా 1955 నాటి సిటిజన్‌షిప్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధమని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ స్వాతంత్ర్యం సమయంలో దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించినందు వల్లే ఇప్పుడు ఈ బిల్లు అవసరమైందని చెప్పారు అమిత్ షా. ఇందులో ఏ పొలిటికల్ ఎజెండా లేదన్నారు.