ఆశ్రమాల అభివృద్ధికి సహకరిస్తాం : జి. రవి నాయక్

ఆశ్రమాల అభివృద్ధికి సహకరిస్తాం : జి. రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  రెడ్ క్రాస్  ఆధ్వర్యంలో ఏనుగొండలో నిర్వహిస్తున్న శాంతి వనం, సన్నిధి ఆశ్రమాల డెవలప్​మెంట్​ కోసం సహకారం అందిస్తానని కలెక్టర్  జి. రవి నాయక్  తెలిపారు. న్యూ ఇయర్​ సందర్భంగా సోమవారం ఆయన సన్నిధి,శాంతివనం అనాథాశ్రమాలను సందర్శించి చిన్నారులతో కేక్  కట్  చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వారికి పండ్లు,  స్వీట్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అనాథ ఆశ్రమాన్ని డెవలప్​ చేసేందుకు చేయూత ఇవ్వడం సంతోషకరమన్నారు. పేరెంట్స్​ లేని చిన్నారులతో పాటు కంటి చూపు లేని వారు, చెవిటి, మూగ వారు చదువుకునేందుకు సహకరిస్తున్న దాతలు, నిర్వాహకులు, టీచర్లను అభినందించారు. 

జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వైకల్యం అడ్డు కాదనే విషయాన్ని గుర్తించి పట్టుదలతో చదివి ఇష్టమైన రంగంలో రాణించాలని చిన్నారులకు సూచించారు. కలెక్టర్  సతీమణి కునందిని, రెడ్  క్రాస్  సొసైటీ చైర్మన్  లయన్  నటరాజ్, వైస్  చైర్మన్  డాక్టర్  శామ్యూల్, ట్రెజరర్  జగపతిరావు, అశ్విని చంద్రశేఖర్, భీమిరెడ్డి ,రమణయ్య పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్.. 

జిల్లా ప్రజలకు కలెక్టర్ జి.రవినాయక్  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ ఏడాది జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీసులో కలెక్టర్​ను కలిసి విషెస్​​ తెలిపారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు కలెక్టర్ ను కలిసి బొకేలు అందజేశారు.

కలను సాకారం  చేసుకోవాలి

వనపర్తి :  ఇష్టంతో చదివి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకోవాలని కలెక్టర్  తేజస్ నంద్​లాల్ పవార్ అన్నారు.  న్యూ ఇయర్  సందర్భంగా వనపర్తి పట్టణంలోని చిల్డ్రన్స్ హోమ్, ట్రైబల్​ వెల్ఫేర్​ స్కూల్​లో న్యూ ఇయర్​ వేడుకలను స్టూడెంట్స్​తో కలిసి జరుపుకున్నారు. 

కేక్  కట్  చేసి స్టూడెంట్స్​కు తినిపించి న్యూ ఇయర్​ విషెస్​​ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జీవితంలో ఎదగడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పేరెంట్స్​ కలలను సాకారం చేయాలని, అందు కోసం ఇష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీడబ్ల్యూవో రామ మహేశ్వర రెడ్డి, ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొన్నారు.