సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నాం: కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నాం: కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు

( సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్న సందర్భంగా)

దశాబ్దాల పీడనకు స్వస్తి పలికి, స్వరాష్ట్ర పరిపాలనలో తెలంగాణ  వైభవంగా వెలుగొందుతున్న ఆశతో సకల విద్యార్థి,  యువత, మేధావులు గత ప్రభుత్వానికి తమ మద్దతునిచ్చారు. మేధావులకు నిలయమైన యూనివర్సిటీలపై కనీసపు పట్టింపులేని గత పాలకుల నిర్లక్ష్యపు నిరంకుశ పాలనను అర్థం చేసుకున్న యూనివర్సిటీ మేధావి వర్గం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు.

గత ప్రభుత్వ పాలనలో అనేక సందర్భాలలో ప్రతిపక్ష పాత్రను పోషించింది ఈ యూనివర్సిటీ మేధావులే.  అటువంటి యూనివర్సిటీలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతూ, యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలని, సమాజానికి మేధో సంపత్తిని,  గొప్ప నాయకత్వాన్ని అందించగలిగే  యూనివర్సిటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని భావించడం సీఎం రేవంత్​రెడ్డి దూరదృష్టికి నిదర్శనం.

గత పాలకుల అనాలోచిత విధానాల పర్యావసానమే నేటి యూనివర్సిటీల దుర్గతికి కారణం. యూనివర్సిటీలపై పట్టింపులేని గత పాలకులు మాయ మాటలతో తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కానీ,  ప్రస్తుత ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్’ అనే నూతన ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. 

తెలంగాణ చరిత్రలో తనకంటూ ఒక నూతన పేజీని లిఖించుకున్న రేవంత్ రెడ్డి  సాహసోపేతంగా ఉద్యమ రణక్షేత్రమైన ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా విద్యార్థి, మేధావి లోకంతో మాట్లాడబోవడం శుభపరిణామం. ఏ ముఖ్యమంత్రి చేయలేని ధైర్యాన్ని డిసెంబర్ 10న నిలబెట్టుకోబోతున్నారు.

వివక్షను ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు
యూనివర్సిటీ అభివృద్ధిలో బోధన, బోధనేతర సిబ్బంది కీలకమైన భాగస్వామ్యం. అహర్నిశలు ఉన్నతవిద్య అభివృద్ధికి  కృషి చేస్తున్న  ఈ వర్గాల వారికి శ్రమకు తగిన ఫలాలు అందడం లేదు. గత 10 నుంచి 25 ఏళ్లకు పైగా  పనిచేస్తున్న 1200 మంది యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లే  నిత్యం వివక్షను ఎదుర్కొంటూ, ఆత్మన్యూనతతో పనిచేస్తున్నారు. 

యూనివర్సిటీలను బతికించాలి
తెలంగాణలోని యూనివర్సిటీలను బతికించాలని, ఉన్నత విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆవేదనను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 యూనివర్సిటీల్లో  గత 14 ఏళ్లుగా  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయలేదు.  మరోవైపు ఆ ఖాళీల స్థానంలో అన్ని అర్హతలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను, వారి సర్వీసులను క్రమబద్ధీకరించలేదు.  ఫలితంగా కాంట్రాక్టు లెక్చరర్లంతా అభద్రతా భావంతో చాలీచాలని వేతనాలతో బతుకులను వెళ్లదీస్తున్నారు.

సీఎం స్పందించినా..
మా ఈ బాధలన్నిటిని గత ఏప్రిల్ 28వ తేదీన,  మే 14న సీఎంని  కలిసిన సందర్భంలో విన్నవించుకున్నాం. సీఎం రేవంత్​ రెడ్డి సానుకూలంగా స్పందించినా.. అధికార యంత్రాంగం సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది.

ఏళ్ల తరబడి యూనివర్సిటీల్లో తమ సర్వీసులను అందిస్తూ అనేకమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరిస్తేనే యూనివర్సిటీలు బతుకుతాయని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్.జి. హరగోపాల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి మేధావుల అభిప్రాయమన్న సంగతి సీఎంకు తెలిసిందే. 

యూజీసీ నిబంధనల ప్రకారం మాకు అన్ని రకాల విద్యార్హతలు,  అనుభవం ఉన్నప్పటికీ శ్రమకు తగిన గుర్తింపు లేదు.  వివిధ రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు అనేకం కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, యూజీసీ వేతనాలను అమలు చేయాలని చెబుతున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. 

సమాన పనికి సమాన వేతనం
సమాన పనికి  సమాన వేతనం ముమ్మాటికి ఆత్మగౌరవ నినాదమే.  యూనివర్సిటీల్లో  పనిచేస్తున్న కాంట్రాక్ట్  అసిస్టెంట్ ప్రొఫెసర్లను వన్ టైం సెటిల్మెంట్ కింద రెగ్యులరైజ్ చేయడం ద్వారా యూనివర్సిటీ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరుతున్నాం. 

ఈ ప్రక్రియ ముగిసే గడువులోగా యూజీసీ పే స్కేల్స్ తోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.‌‌‌‌ వివిధ వర్సిటీల్లో నెలనెలా రెగ్యులర్  ప్రొఫెసర్లు రిటైర్మెంట్ తో వారి సంఖ్య తగ్గుతుండడంతో యూనివర్సిటీల్లో విద్యా బోధన కుంటుపడకుండా  విద్యా ప్రమాణాలను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసరులే కాపాడుతున్నారు.

కాంట్రాక్ట్ ​అధ్యాపకులను రెగ్యులరైజ్​ చేస్తే.. పరిశోధనల ప్రాజెక్టులొస్తాయి
న్యాక్ గుర్తింపు నుంచి ఎన్ఐఆర్ఎఫ్  ర్యాంక్ వరకు యూనివర్సిటీలను గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టడానికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లే ప్రధాన కారణం.  పైగా  వర్సిటీలకు రావాల్సిన లక్షలాది రూపాయల ప్రాజెక్టులు,  వివిధ సంస్థల ద్వారా రావాల్సిన నిధులు కేవలం కాంట్రాక్ట్ అధ్యాపకులు అనే కారణంతో రాకుండా పోతున్నాయి. ఈ కాంట్రాక్ట్  అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను  రెగ్యులర్ చేస్తే పరిశోధనల కోసం లక్షలాది రూపాయల ప్రాజెక్టులు యూనివర్సిటీలకు రావడమేగాక యూనివర్సిటీలు తమ ఆర్థికభారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విద్యారంగాన్ని  కాపాడుకోవడం కోసం   చిత్తశుద్ధితో యూనివర్సిటీల పరిరక్షణకి నడుం బిగించి  స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి రావడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం.  గత ఆరు నెలల క్రితం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు  సీఎంగా ఇచ్చిన హామీని నెరవేర్చుతారని ఆశతో, తలంపుతో  మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతూ.. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం.

తెలంగాణ రాష్ట్ర 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్  జేఏసీ ప్రతినిధులు 
డాక్టర్ ఈ. ఉపేందర్, డా. సాదు రాజేష్, డా. వేల్పుల కుమార్, డా. సి హెచ్. వెంకటేష్, డా. మహేశ్వర్ రెడ్డి, డా. రేష్మారెడ్డి,  డా. తాళ్లపల్లి వెంకటేష్. డా.మాదాసి కనకయ్య,  డా. చిర్ర రాజు, డా. గంగా కిషన్, డా. శ్రీధర్ రెడ్డి, డా. సోమేశ్, డా. రాధాకృష్ణ, డా. జోషప్, డా.రాజు,  డా. బి. ఉపేందర్,  డా. గిరి,  డా. బి. సతీష్, డా. చంద్రశేఖర్, రాజేశ్వరి,  డా. జోష్ణ, డా. నారాయణ గుప్తా, డా. నవీన్ కుమార్, డా. రామలింగం, డా. శ్రీనివాస్ రెడ్డి, డా. కృష్ణవేణి, డా. స్వప్న.