ఫుల్ మెజార్టీ సాధిస్తం : వీ6 ఇంటర్వ్యూలో మల్లికార్జున ఖర్గే

ఫుల్ మెజార్టీ సాధిస్తం :   వీ6 ఇంటర్వ్యూలో మల్లికార్జున ఖర్గే

బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో ఫెయిల్‌‌
తొమ్మిదేండ్ల కేసీఆర్‌‌ పాలనలో ప్రజలు విసిగిపోయారు
మోదీ, కేసీఆర్‌‌ అన్నదమ్ములు.. వాళ్ల చిన్న తమ్ముడు ఇక్కడే ఉన్నడు
లిక్కర్ స్కామ్‌‌ కేసులో బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేస్తలే
భయపెట్టడానికి రెయిడ్స్ చేయిస్తున్నరు.. ప్రత్యర్థి పార్టీలతో పాటు ఈడీ, ఐటీ, సీబీఐతోనూ 
మేం పోరాడుతున్నం

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో ఫెయిల్‌‌ అయిందని, తొమ్మిదేండ్ల కేసీఆర్‌‌ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. మోదీ, కేసీఆర్‌‌ అన్నదమ్ములని, వాళ్ల చిన్న తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారని విమర్శించారు. సోమవారం ఈ మేరకు ‘వీ6’కు ఖర్గే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ  ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..

ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం పదేండ్లుగా ఏం చేయలేదని, అన్ని రంగాల్లో ఫెయిల్‌‌ అయిందని కాంగ్రెస్‌‌ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌‌బ్యాక్‌‌ వస్తున్నది? ప్రజలు ఏం కోరుకుంటున్నరు?
ఖర్గే: కాంగ్రెస్‌‌ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. గత ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్‌‌ వైపు చూడలేదు. తొమ్మిదేండ్ల కేసీఆర్‌‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇక్కడి సర్కారు అన్ని రంగాల్లో ఫెయిల్‌‌ కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే జనం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌‌కు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణను తామే అభివృద్ధి చేశామని, అందుకే ల్యాండ్‌ రేట్లు ఇంతగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్నది. దీనిపై మీరు ఏం అంటారు?

ఖర్గే: పేదల భూములను సర్కారు తక్కువ ధరలకు సేకరించి.. వాటిని బడాబాబులకు ఇచ్చింది. ఆ భూముల విలువను కోట్ల రూపాయలు పెంచుకునేలా చేసింది. అందుకే ధరలు పెరిగాయి. డబుల్‌ బెడ్రూం ఇండ్లు, 200 గజాల ఇండ్లు ఇస్తామని చెప్పి నమ్మించి.. ల్యాండ్‌ను బిజినెస్‌లా మార్చింది. ధనవంతులను మరింత ధనవంతులను చేసింది. బీఆర్‌ఎస్‌ సర్కారు ల్యాండ్‌, శాండ్‌ దందా చేసింది. పేదలను మరింత పేదలుగా మార్చింది. ల్యాండ్‌, ఇసుక రేట్లు పెంచి కనీసం పేద మధ్యతరగతి ప్రజలు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి తీసుకువచ్చింది. భూముల రేట్లు పెరిగితే పేదోడికి ఏం లాభం?

ప్రశ్న: అధికారంలోకి వస్తే ఏం చేస్తరు?

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేద పిల్లలకు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం జరిగేలా చూస్తాం. ఇండ్లు కట్టిస్తాం. పేద ప్రజల కడుపునింపే సంక్షేమ పథకాలు చేపడతాం.కర్నాటకలో ఎలా గెలిచారు? 5 గ్యారంటీలతోనా? బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతోనా? కర్నాటకలో బీజేపీ అవినీతి సర్కారు ఉండింది. ఆ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు కోర్టులకు వెళ్లారు. అక్కడ గవర్నర్‌ కూడా బాగాలేరు. 40 శాతం కమీషన్‌ సర్కారుపై ప్రజలకు అసంతృప్తి ఏర్పడింది. మేం ఎన్నో స్కీములను 2013 నుంచి2018 వరకు అమలు చేశాం. ప్రజలు వీటన్నింటినీ బేరీజు వేసుకుని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా అన్ని వర్గాలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చాయి. 

ప్రశ్న: కర్నాటక సీన్​ ఇక్కడ రిపీట్‌ అవుతుందా?

మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మోదీ, కేసీఆర్‌ అన్నదమ్ములు. వాళ్ల చిన్న తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నడు. వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటరు. సిటీలు, గ్రామాల్లో ఉన్న మైనార్టీలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. మాకు అధికారం వస్తుందని నమ్మకంగా ఉన్నాం. ‘తెలంగాణను మేమే ఇచ్చాం. ఇప్పుడు మాకు పవర్‌ ఇవ్వండి’ అని మీరు అంటే.. ‘తెలంగాణ తెచ్చినం’ అని బీఆర్‌ఎస్‌ అంటున్నది. దీనిపై ఏం చెప్తరు? ఇదంతా బోగస్‌ ప్రాపగండా. తెలంగాణను తీసుకురావడానికి వాళ్లకు మూడింట రెండు వంతుల మెజార్టీ ఉందా? అమెండ్‌మెంట్‌ చేయగల సత్తా ఉందా? సోనియాగాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైంది. ఇన్‌సల్ట్‌ చేయడం ఎవరికి అయినా వస్తుంది. ప్రజల హృదయాల్లో నిలవడం అందరి వల్లా కాదు. బీజేపీ ప్రభుత్వం ఎక్సైజ్‌ స్కామ్ కేసులో అందరినీ లోపల వేస్తున్నది. ఈడీ కేసుల్లో బీఆర్‌ఎస్‌ వాళ్ల కుటుంబ సభ్యులు ఉన్నా.. ఎందుకు వేయలేదు. బీజేపీ,  బీఆర్ఎస్ ఒక్కటే. రెండూ కలిసి ప్రజలను వెర్రివాళ్లనుచేస్తున్నాయి. వీళ్లంతా ఏ, బీ, సీ టీమ్‌లు.  ఆరు గ్యారంటీలతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. గ్యారంటీలకు నేను గ్యారంటీ అని రాహుల్‌ అంటున్నరు. కానీ 2014, 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లో చేరరని గ్యారంటీ  ఎవరిస్తరు?

మా ఐడియాలజీతో ఉన్న వారికి టికెట్లు ఇస్తాం. కొందరు ద్రోహం చేసి పార్టీ మారితే.. వారిని బయట పడేస్తాం. సోనియాను కలిసి, ఫొటో దిగి, కాంగ్రెస్‌తో కలిసి ఉంటానని చెప్పి కేసీఆర్‌ ద్రోహం చేశాడు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తం. సాధారణంగా డబ్బులున్న వారు పొలిటికల్‌ పవర్‌ కావాలనుకుంటారు. కొందరు డబ్బు, పవర్ రెండూ ఉన్న వారు.. అందరినీ ఖతం చేస్తారు. వీరు ఎవరికీ లాయల్‌గా ఉండరు. ఈ సారి చాలా వరకు మంచి వారికే టికెట్లు ఇచ్చాం. ఈసారి ఎవరూ పార్టీ మారరని భావిస్తున్నాం.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని సీట్లొస్తయ్​?

కాంగ్రెస్‌ తప్పక అధికారంలోకి వస్తుంది. సరిపోను మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తం.
కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరు? ఎంతోమంది సీఎం ఫిగర్‌లు ఉన్నారు? డిసైడ్‌ చేయడం పెద్ద సమస్యగా ఉందా?
హైకమాండ్‌ ఈ సమస్యలను పరిష్కరిస్తుంది. రాజస్థాన్, హిమాచల్‌లో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించుకున్నాం. అందరనీ సముదాయించి పరిష్కరిస్తాం. మా పార్టీలో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించం. అందరూ పనిచేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం.
కాంగ్రెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ మార్చారా? ఇప్పుడు అంతా ఇక్కడే కనిపిస్తున్నారు?
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అంతా కలిసి పోరాడుతున్నాం. కాంగ్రెస్‌ పార్టీ పేద ప్రజల కోసం పని చేస్తుంది.

కాంగ్రెస్‌ అభ్యర్థులపై ఐటీ, ఈడీ రెయిడ్స్​పై మీరేమంటారు?

ఈడీ, ఐటీ రెయిడ్స్‌ ఇక్కడే కాదు దేశమంతా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో, చత్తీస్‌గఢ్‌లో, మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ నేతలపై రెయిడ్స్ చేశారు. తెలంగాణలో అందరిపై దాడులు జరుగుతున్నాయి. భయపెట్టడానికి ఇలా చేయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో పాటు.. బీజేపీ చేతిలో ఉన్న ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలతోనూ మేం పోరాటం చేయాల్సి వస్తున్నది.

60, 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసింది? ఇప్పుడు ఎందుకు చాన్స్‌ ఇవ్వాలి?

ఇది ఫాల్స్‌ ప్రాపగండా. ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు ఇన్ని స్కూళ్లు కట్టింది ఎవరు? ఇంత పెద్ద ఎత్తున రైల్వే విస్తరణ చేసింది ఎవరు? మేం చేశాం. దేశంలో నాగార్జున సాగర్‌ సహా ఎన్నో ప్రాజెక్టులు కట్టాం. ఫలితంగానే నేడు అవసరానికి తగిన ఆహార ధాన్యాలు పండించుకోగలుగుతున్నాం. గతంలో తినడానికి లేక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. నేడు గోదాముల్లో నిల్వ చేసుకుని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే పరిస్థతి ఉంది. అది ఎవరి చేశారు? ఐటీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్‌, డీఆర్‌డీఓ, ఇస్రో ఇవన్నీ ఎవరి కాలంలో వచ్చాయి? మోదీ జమానాలో అయ్యాయా? యూనివర్సిటీలు, గ్రీన్‌ రివెల్యూషన్‌, మిల్క్‌ రెవెల్యూషన్‌  ఎవరు చేశారు? మా హయాంలో చేసిన వాటి ఫలితాలు నేడు అనుభవిస్తూ ‘మీరు ఏం చేశారు’ అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. ఈ తొమ్మిదేండ్లలో వాళ్లు ఏం చేశారో చెప్పమనండి. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు ఇలా అన్నీ కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేశాం. మేము గుర్తు చేయాల్సి వస్తున్నది.