V6 News

బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తం.. పార్టీ పేరు మార్చడం వల్ల నష్టపోయాం: కేటీఆర్

బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తం.. పార్టీ పేరు మార్చడం వల్ల నష్టపోయాం: కేటీఆర్
  • క్యాడర్‌‌‌‌కు మళ్లీ దగ్గరవుతం
  • టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్  విడదీయలేం
  • ప్రజాసమస్యలపై 2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్త
  • వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ
  • డీలిమిటేషన్‌‌‌‌తో సీట్లు పెరుగుతాయి
  • ఎక్కడి నుంచి పోటీకైనా రెడీ అని వెల్లడి
  • లక్ష్యం లేకుంటే మనుగడ ఉండదని కవిత పార్టీపై కామెంట్

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌ను టీఆర్ఎస్‌‌‌‌గా మార్చాలనే ప్రతిపాదన ఉందని, దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ పేరును మార్చడం వల్ల గత ఎన్నికల్లో నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్  పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిదని, ప్రజల్లో గులాబీ జెండా బలంగా నాటుకుపోయిందని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాలలో పర్యటించిన కేటీఆర్.. నస్​పూర్​లోని పార్టీ జిల్లా ఆఫీసులో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరయ్యారు. అనంతరం క్యాతనపల్లిలోని బాల్క సుమన్ నివాసంలో మీడియాతో చిట్ చాట్  చేశారు.  

ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందని, కానీ.. స్పష్టమైన లక్ష్యంలేని పార్టీలకు మనుగడ ఉండదని కవిత పార్టీపై పరోక్షంగా స్పందించారు. తల్లిదండ్రులను బాధపెట్టే విధంగా పిల్లలు ప్రవర్తించరాదన్నారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో పార్టీ క్యాడర్ కు, ప్రజలకు కొంత గ్యాప్  వచ్చిన మాట నిజమేనని, దీంతో ఎన్నికల్లో నష్టం జరిగిందన్నారు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మే, జూన్ లో  పార్టీ సభ్యత్వం పూర్తిచేసి కమిటీలు వేస్తామని, 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. 

డీ లిమిటేషన్ పై బదులిస్తూ... ‘‘ప్రస్తుతం పార్లమెంటులో సౌత్  ఇండియాకు 24 పర్సెంట్  ప్రాతినిధ్యం ఉంది. అదే రేషియోలో సీట్లు పెరిగితే డీలిమిటేషన్ ను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, అందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. 

గతంలో చెప్పిన వాటిలో కొన్నింటిని చేయలేకపోయాంమని, ఉదాహరణకు గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని చెప్పి చేయలేకపోయామని ఒప్పుకున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలో నష్టం జరిగిందన్నారు. టీబీజీకేఎస్ లో జరిగిన సంఘటనలను సీరియస్ గా తీసుకోకపోవడంతో సింగరేణి ఏరియాలోనూ నష్టపోయామని వివరించారు.

  • మెడికల్ బోర్డు పెట్టకుంటే సింగరేణి హెడ్ ఆఫీసును ముట్టడిస్తం

సింగరేణిలో వెంటనే మెడికల్  బోర్డు పెట్టి అన్ఫిట్ జాబ్స్  కల్పించాలని, లేదంటే ఆ సంస్థ హెడ్ ఆఫీసును ముట్టడిస్తామని కేటీఆర్  హెచ్చరించారు. కొంతమంది మెడికల్  బోర్డు గురించి ప్లకార్డులు ప్రదర్శించగా, సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ ను ఓడించి ఇప్పుడు తన ముందు ప్లకార్డులు పట్టుకుంటే ఏం లాభమని, కత్తి ఒకరికి ఇచ్చి ఇంకొకరిని యుద్ధం చేయమంటే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సమస్యలపై ఈ ప్రాంత కాంగ్రెస్  ఎమ్మెల్యేలను గల్లా పట్టి ప్రశ్నించాలని సూచించారు. 

  • నీ బామ్మర్ది అవినీతిపై విచారణ జరిపించు 

సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లో కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్లు దోచుకుంటున్నారని కేటీఆర్  ఆరోపించారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్  నిబంధన తీసుకొచ్చి టెండర్  వేసిన కాంట్రాక్టర్లను సైట్  విజిట్ కు రాకుండా సృజన్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన అక్రమాలను బయటపెడితే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దానిపై మాట్లాడడం లేదన్నారు.  

  • దోచుకో... దాచుకో పథకం 

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘దోచుకో... దాచుకో’ అన్న పథకాన్ని రాష్ర్టవ్యాప్తంగా అమలుచేస్తూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్  విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్  హామీ ఇచ్చారని, కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా సీఎంకు తెల్వదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో రూ.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ప్రాణహిత ప్రాజెక్టును ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తుందో చెప్పాలన్నారు. 

  • కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, అవినీతిలో ఒకరికొకరు వంతపాడుతున్నారని కేటీఆర్  విమర్శించారు. ‘‘కాంగ్రెస్  తెలంగాణలో ఆర్ఆర్  ట్యాక్స్  వసూలు చేస్తోందన్న పీఎం మోదీ.. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించిన అమిత్ షా ఎందుకు మౌనం వహిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2.0 స్కీమ్ లో సృజన్ రెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టులు దక్కాయి" అని ఆరోపించారు.