పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

ధర్మపురి నియోజకవర్గానికి శాశ్వత సాగునీటి సమస్యలు తీర్చడానికి పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అర్హుడైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలురైతులకు రుణమాఫీ చేసిందని శ్రీధర్‌ బాబు అన్నారు. 18 వేల కోట్ల రూపాయలతో అర్హుడైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీతో లాభపడ్డారని ఆయన తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటే దానిని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారు. కుట్ర అంటూ రాజకీయాలు చేస్తున్నారు. సవాల్ చేసింది ఎవరు..? ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ప్రజలకు మంచి చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి వాటికి తెరలేపుతున్నారు.

ALSO READ | గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి

అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు లాంటివని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు. పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు తీరుస్తామని ఆయన మాటిచ్చారు.

కాగా, జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలో 1 టీఎంసీ అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో పత్తిపాక రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30 గ్రామాల తాగునీటి అవసరాలతో పాటు ధర్మారం, రామగాడు మండలాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీటి అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు.