
- బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బండి సదానందం ఫైర్
కోల్‌బెల్ట్, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఐదేండ్లలో తమ సమస్యలు పట్టించుకోలేదని, తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మంచిర్యాల జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్ బండి సదానందం అన్నారు. తమ సమస్యలు, ఇబ్బందులను వినేందుకు కూడా ఎమ్మెల్యే కనీసం టైమ్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మందమర్రిలో తన అనుచరులు, వివిధ కుల సంఘాల బాధ్యులతో సదానందం సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో కొనసాగాలో వద్దో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాల్క సుమన్‌కు అండగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని చెప్పారు. తమ కులస్తులకు అవసరమైన గొర్రెల యూనిట్లను కూడా ఎమ్మెల్యే పీఏ చెప్తేనే ఇస్తామని ఆఫీసర్లు చెప్పడం బాధించిందన్నారు. బీఆర్ఎస్పార్టీ కార్యక్రమాలకు సైతం తమను పిలవడం లేదన్నారు.
పార్టీపరంగా పదవి ఇవ్వకపోగా యాదవ సంఘంలో తనను దెబ్బతీసే ప్రయత్నం చేశారని వాపోయారు. రెండు, మూడు రోజుల్లో తమ భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నేతకాని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రాక్టర్ అసోసియేషన్ నాయకుడు దుర్గం ప్రభాకర్, కురుమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమ, రాష్ట్ర కార్యదర్శి బండి శంకర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేండ్ల రుక్మిణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.