ఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని స్కూళ్లు ఓపెన్​ చేస్తా: కేజ్రీవాల్

ఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని స్కూళ్లు ఓపెన్​ చేస్తా: కేజ్రీవాల్


న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు ఇస్తే.. అన్ని పాఠశాలలను తెరుస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ అన్నారు. ఢిల్లీ లిక్కర్​ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్​కు ఇప్పటి వరకు ఐదు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను దేశంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్​గా భావిస్తున్నదని, అన్ని దర్యాప్తు ఏజెన్సీలను తనపైకి ఎగదోసిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 3లో మరో ప్రభుత్వ పాఠశాల భవనానికి కేజ్రీవాల్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ లక్ష్యాన్ని సాధించడానికే తమ ప్రభుత్వం ఢిల్లీలో ఒకదాని తర్వాత మరో పాఠశాలను ప్రారంభిస్తోందని చెప్పారు.