ఖమ్మం బాధిత బాలికకు అండగా ఉంటాం.. బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు

ఖమ్మం బాధిత బాలికకు అండగా ఉంటాం.. బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురై నిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక్క, సురేఖ శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు. 

కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శ్రుతి ఓజా, సీపీఐ ఫ్లోర్ లీడర్ కునంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం వారి వెంట ఉన్నారు. 

నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్​కు తరలించినట్లు చెప్పారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు నిమ్స్‌లోనే అత్యుత్తమ చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. 

తక్షణ సాయంగా రూ. 5 లక్షలు.. 

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. సీతక్క ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.70 వేల తక్షణ సాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విష్ణు వందనను నిమ్స్‌లోనే అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

25 లక్షల పరిహారం ఇవ్వాలి: కూనంనేని

నిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని. తన వంతు సాయంగా బాలిక వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 వేల నగదును అందజేశారు.