వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తం : కూనంనేని

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తం : కూనంనేని

యాదగిరిగుట్ట, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ​పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలోని సీపీఐ ఆఫీస్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ సీరియస్ గా పోరాడుతున్నారని, అందుకే టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సీపీఐకి ఉన్నంత క్యాడర్ కూడా బీజేపీకి లేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రైవేట్ పరం చేస్తున్నాడని, శ్రీలంక పరిస్థితులు మన దేశంలో ఎప్పుడో వచ్చాయని చెప్పారు.

హిందుత్వం పేరుతో యువతను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డబ్బులకు లొంగకపోతే ఈడీ, ఐటీ, సీబీఐలతో దాడులు జరిపించి భయపెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బొలగాని సత్యనారాయణ, బండి జంగమ్మ, జిల్లా జానకిరాములు, బబ్బూరి శ్రీధర్, పేరబోయిన మహేందర్ తదితరులు ఉన్నారు.