వాట్సాప్ ద్వారా వెదర్ అలర్ట్స్ ..కసరత్తు చేస్తున్న జీహెచ్ ఎంసీ

వాట్సాప్ ద్వారా వెదర్ అలర్ట్స్ ..కసరత్తు చేస్తున్న జీహెచ్ ఎంసీ
  • ప్రత్యేకంగా ముగ్గురు నిపుణుల నియామకం
  • సంగారెడ్డి ట్రిపుల్​ ఐటీ సహకారం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇక నుంచి నగరవాసులకు బల్దియా వెదర్ అలెర్ట్ మెసేజ్​లు పంపించాలని నిర్ణయించింది. వాట్సాప్ తో పాటు ఎస్ఎంఎస్ ద్వారా ముందస్తుగా సమాచారం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్షం ఎప్పుడు కురవనుంది ? ఏయే ప్రాంతాల్లో పడబోతోంది? భారీ వర్షమా.. సాధారణ వర్షమా?  లాంటి సమాచారాన్ని తెప్పించుకునేందుకు ముగ్గురు వాతావరణ నిపుణులను నియమించింది. 

వీరితో పాటు నగరవాసులకు రియల్ టైమ్ వెదర్ రిపోర్టు అందించేందుకు ఇప్పటికే ముంబై మహానగరానికి వాతావరణ హెచ్చరికల విషయంలో సహకరిస్తున్న సంగారెడ్డి ట్రిపుల్​ఐటీ సహకారాన్ని కోరింది. ముంబైకు సహరిస్తున్నట్టు తమకు కూడా సహకరించాలని వారిని కోరింది.  నగరంలో వరద ముంపు, విపత్తులు, ప్రక్రృతి వైపరీత్యాలు, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలను నూటికి నూరు శాతం అధిగమించేందుకు కచ్చితమైన రెయిన్ అలర్ట్ ను అందించేందుకు నిర్ణయం తీసుకుంది.