
సిరిసిల్ల టౌన్, వెలుగు: వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల కార్మికులకు, ఆసాములకు రావలసిన త్రిఫ్ట్ పథకం డబ్బులు వెంటనే జమ చేయాలని సోమవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్బంగా పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ లీడర్లు మూషం రమేశ్, కోడం రమణ మాట్లాడుతూ మూడేండ్లుగా త్రిఫ్ట్ పథకం నుంచి డబ్బులు రాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
స్కీం కాల పరిమితి అయిపోయిందని, ప్రభుత్వం కార్మికులకు అందించాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 900 మంది కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి10 శాతం యారన్ సబ్సిడీని కూడా ఇవ్వలేదని చెప్పారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు నక్క దేవాదాసు, శంకర్, సిరిమల్ల సత్యం, బెజగం సురేశ్ పాల్గొన్నారు.