తినాలా వద్దా : 25 నుంచి 100 శాతం పెరిగిన కూరగాయల ఖర్చు

తినాలా వద్దా : 25 నుంచి 100 శాతం పెరిగిన కూరగాయల ఖర్చు

గత మూడు వారాలుగా కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. 100 రూపాయలు పెడితే ఒక కిలో కూరగాయలు కూడా రావడం లేదు. దీంతో సామాన్యులు ఒక పూట భోజనం కూరగాయలతో చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం, నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. 

 గత కొన్ని వారాల్లో కూరగాయలపై వారపు ఖర్చు 25-నుంచి100 శాతం పెరిగిందని స్థానిక సర్కిల్స్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కనీసం 64 శాతం మంది గృహ వినియోగదారులు టమోటాకు రూ. 50 కేజీ లేదా అంతకంటే ఎక్కువ, బంగాళాదుంపకు రూ. 30/కేజీ లేదా అంతకంటే ఎక్కువ, ఉల్లిపాయలకు రూ.30/కేజీ లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నట్లు తెలిపారు.  మొత్తం 21 శాతం మంది టమోటాకు కిలోకు రూ. 100కు పైగా చెల్లిస్తున్నట్లుగా వెల్లడించారు.  

గత నెలతో పోలిస్తే ప్రస్తుతం అన్ని కూరగాయల ధరలు అమాంతం 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. టమాట అయితే రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఈ నెల 18, 19 వరకు కిలో రూ. 70 పలికిన టమాట 20వ తేదీ నుంచి రూ. 100కు చేరుకుంది. మే నెలలో పచ్చిమిర్చి (సన్న రకం) క్వాలిటీ ఆధారంగా రూ.70 ఉండగా ఇప్పుడు రూ.120 నుంచి 130 అయింది. బీరకాయ, దేశీ చిక్కుడు, కాకరకాయ, క్యాప్సికం ధరలు 25 రోజుల క్రితం కిలో రూ.60 ఉండగా బుధవారం రూ.120 పలికాయి. కాకర, వంకాయ, గోరుచిక్కుడు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. రూ.15 నుంచి రూ. 20 పలికే సోరకాయ ప్రస్తుతం రూ.50 చెబుతున్నారు. క్యారెట్‍రూ.80 పలుకుతుండగా, అల్లం రూ.250, ఎల్లిగడ్డ కిలో రూ.330తో చుక్కలు చూపుతున్నాయి.