విమెన్ ఎంట్రాప్రెన్యూర్స్కు ‘ర్యాంప్’... వీహబ్ ద్వారా బిజినెస్లకు ప్రోత్సాహం

విమెన్ ఎంట్రాప్రెన్యూర్స్కు ‘ర్యాంప్’... వీహబ్ ద్వారా బిజినెస్లకు ప్రోత్సాహం
  • బ్రాండ్​ పబ్లిసిటీ, మార్కెటింగ్​ సపోర్ట్
  • ఎస్​హెచ్​జీలకు బ్యాంకు లింకేజీ లోన్లు 
  • రాష్ట్రవ్యాప్తంగా అవేర్నెస్​ ప్రోగ్రామ్స్​
  • 140 వ్యాపార సంస్థలకు చేయూత  

మంచిర్యాల, వెలుగు: ‘ మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండల కేంద్రానికి చెందిన పద్మ వ్యాపారంలో రాణించాలనే పట్టుదలతో బేకరీ ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా బట్టీ పెట్టి వివిధ రకాల ఐటమ్స్​ తయారు చేసి విక్రయించేవారు. కానీ, సరైన మార్కెటింగ్​ నైపుణ్యాలు లేకపోవడం వల్ల బిజినెస్​ ఆశించిన స్థాయిలో నడవలేదు. దీనికితోడు తన కొడుకు యాక్సిడెంట్​లో గాయపడి కొన్ని నెలల పాటు మంచంలో ఉన్నాడు. దీంతో వ్యాపారం బంద్​ చేయాల్సి వచ్చింది.

’ ఇలా అనేక మంది మహిళలు బిజినెస్​లో అభివృద్ధి సాధించాలనే తపన ఉన్నా సరైన గైడెన్స్​ లేకపోవడంతో డీలా పడుతున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం అమలు చేస్తున్న రైజింగ్​ అండ్​ యాక్సిలరేటింగ్​ ఎంఎస్ఎంఈ ఫర్ఫార్మెన్స్(ర్యాంప్) స్కీమ్​లో భాగంగా విమెన్​ ఎంట్రాప్రెన్యూర్స్​ హబ్(వీహబ్) ద్వారా అవసరమైన సపోర్ట్​ అందిస్తోంది.

వ్యాపారాభివృద్ధికి చేయూత..

ఫుడ్​ ప్రాసెసింగ్, మాన్యుఫ్రాక్చరింగ్, ఎఫ్ఎంసీజీ, చేనేత, వస్ర్త పరిశ్రమ, హస్తకళలు వంటి వ్యాపారాల నిర్వహణకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. కానీ, వ్యాపారంలో సక్సెస్​ కావాలంటే ఆధునిక మెషినరీ, టెక్నాలజీ, బ్రాండ్​ పబ్లిసిటీ, మార్కెటింగ్​ స్కిల్స్​ ఉంటేనే సాధ్యం. విమెన్​ ఎంట్రాప్రెన్యూర్స్​లో ఈ లోపాలను గుర్తించిన ప్రభుత్వం విమెన్​ యాక్సిలరేషన్​ ప్రోగ్రాం ద్వారా వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది.

టైర్​ 2, 3 ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఎక్కువ కెపాసిటీ కలిగిన ఎంఎస్ఎంఈలను గుర్తించి వారికి అవసరమైన సపోర్ట్​ అందిస్తోంది. ఒక ప్రొడక్ట్​ను ఎలా తయారుచేయాలి? దానిని బ్రాండింగ్​ ఎలా చేయాలి? ప్రజలకు చేరువయ్యేందుకు ఎలా పబ్లిసిటీ చేయాలి? మార్కెటింగ్​ విస్తరణ కోసం ఏమేం చేయాలి? వంటి అంశాలపై వీహబ్​ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. టెక్నాలజీ అప్​గ్రేడేషన్​ కోసం ఎస్​హెచ్​జీ సభ్యులకు డీఆర్డీఏ ద్వారా బ్యాంక్​ లింకేజీ లోన్లు కూడా ఇప్పిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 140 సంస్థల ఎంపిక.. 

రాష్ట్రవ్యాప్తంగా 300 మంది మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈల్లో 140 సంస్థలను వీహబ్​ ద్వారా ఎంపిక చేసి వ్యాపారాభివృద్ది నైపుణ్యాలను అందిస్తున్నారు. వారిని విమెన్​ ఎంట్రాప్రెన్యూర్స్​గా తీర్చిదిద్దుతున్నారు. దీని కోసం జిల్లాల వారీగా అవేర్నెస్​ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో 120 మంది మహిళా వ్యాపారవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

చాలామంది ఫ్లోర్​మిల్స్, పికిల్స్, స్వీట్స్, బేకరీ, ఎంబ్రాయిడరీ, గానుగ నూనె, హోమ్​ ఫుడ్స్, మిల్క్, డెయిరీ ప్రొడక్ట్స్, పుట్టగొడుగుల పెంపకం వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిలో వ్యాపార విస్తరణపై ఆసక్తి ఉన్నవారిని సెలెక్ట్​ చేసి వీహబ్​ ద్వారా తగిన ప్రోత్సాహం అందించనున్నట్టు అధికారులు తెలిపారు. వీహబ్​ సపోర్ట్​ కోసం శ్రీకర్​ 8125508355 నంబర్​లో సంప్రదించవచ్చు.

ప్రోత్సాహం అందిస్తే వ్యాపారాభివృద్ధి

నేను ఏదైనా బిజినెస్​ చేయాలనే పట్టుదలతో 2022లో మల్లికార్జున ఫ్లోర్స్​ మిల్స్​ ఏర్పాటు చేశాను. జొన్నపిండి, గట్క, మక్క గట్క, గోధుమ పిండి, మల్టీగ్రెయిన్​ పిండి, కారం, పసుపు గిర్నీ పట్టి కిలో, అర కిలో ప్యాకింగ్​ చేసి అమ్ముతున్నాను. వీటికి అవసరమైన ముడిసరుకులను మంచిర్యాల, చెన్నూర్, మహారాష్ట్రలో కొనుగోలు చేస్తున్నా. మార్కెట్​లో లభించే వాటి కంటే క్వాలిటీగా, అంతకంటే తక్కువ ధరకే అమ్ముతున్నాను.

ప్రస్తుతం ఖర్చులు పోగా నెలకు రూ.8 వేల దాకా మిగులుతున్నయ్. రానున్న రోజుల్లో కందిపప్పు, పెసరపప్పు తయారు చేయాలనుకుంటున్నా. వీహబ్​ ద్వారా బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్​ సపోర్టు అందిస్తే నా వ్యాపారాన్ని విస్తరించి మరో నలుగురికి ఉపాధి కల్పిస్తా.– రేణుక, రామారావుపేట, జైపూర్  మండలం