
సిద్దిపేట రూరల్, వెలుగు : దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, దీన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దివ్యాంగులకు రూ.1000కి మించి పింఛన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో దివ్యాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని తెలిపారు. దివ్యాంగులలో సామర్థ్యం, పనితనం చూడాలే తప్ప వారిని చిన్నచూపు చూడొద్దన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, రాష్ట్ర వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
‘రుతుప్రేమ’ ఆరోగ్య సిద్దిపేటలో భాగమే..
రుతుప్రేమ కార్యక్రమం ఆరోగ్య సిద్దిపేటలో భాగమేనని, దీన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాత్రి పోలీస్ కన్వేన్షన్ లో పోలీసు కుటుంబాల ఆరోగ్య రక్షణ పై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. పోలీసు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం కోసం 20 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
హుస్నాబాద్ఆస్పత్రిలో బెటర్ ట్రీట్మెంట్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులతో కూడిన వైద్యం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్‌లో 100 పడకల హాస్పిటల్‌తో పాటు రూ.85 లక్షల నిధులతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోదాంగడ్డలో బస్తీ దవాఖానాను మంజూరు చేశామని, 20 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయన వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ ఎస్ఈ ఆఫీస్ తరలించొద్దు
మెదక్, వెలుగు: పంచాయతీ రాజ్ ఎస్ఈ ఆఫీస్ ను మెదక్ నుంచి తరలించొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పీఆర్ జిల్లా ఆఫీస్ లో మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ప్రజలకు శాపంగా మారారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో సుమారు 60 ఏండ్ల కింద నుంచి ఉన్న పంచాయతీరాజ్ ఎస్ ఈ ఆఫీస్‌ను సిద్దిపేటకు తరలించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. కార్యాలయ తరలింపును అడ్డుకునేందుకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, టౌన్ ప్రసాద ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
అయ్యప్పభక్తులతో నిండిపోయిన మైత్రి మైదానం
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహాపడి పూజ
పటాన్చెరు, వెలుగు : అయ్యప్ప భక్తులతో పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం నిండిపోయింది. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా మారింది. శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయం నుంచి వచ్చిన ప్రత్యేక పూజారులు స్వామి వారి పడి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ గాయకుడు జె.ఏసుదాసు కుమారుడు విజయ్ఏసుదాసు గీతాలాపన ఆకట్టుకుంది. కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, గద్దర్ నర్సన్న, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెట్టు కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బొందల గడ్డను కబ్జా చేస్తున్రు..
మెదక్ (కొల్చారం), వెలుగు: బొందల గడ్డను కబ్జా చేయడంపై కొల్చారం గ్రామ బీసీ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోట వద్ద తమ తాతల నాటి నుంచి ఉన్న తమ కుటుంబీకుల బొందలను తవ్వేస్తూ, చుట్టూ గోడ నిర్మిస్తున్నారని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సత్తయ్య, సిద్ధిరాములు, శాఖాయ్య, చంద్రమ్మ ఆరోపించారు. కాలనీలో ఎవరు చనిపోయినా కోట గడ్డ వెంట బొంద పెడతారని తెలిపారు. ఇప్పుడు అక్కడ గోడ కడితే ఎవరైనా చనిపోతే ఎక్కడ బొంద పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
జోగిపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సంగుపేట వద్ద జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల నాయకులు హైవే పై బైఠాయించి నినాదాలు చేశారు. సోమవారం అందోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిష జన్మదిన వేడుకలు నిర్వహించారు. జోగిపేట నుంచి సంగుపేటలోని లక్ష్మీదేవి గార్డెన్ వరకు కాంగ్రెస్ నాయకులు బైకు ర్యాలీ నిర్హించారు. ఇదే సమయంలో అందోల్మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన టీఆర్ఎస్కార్యకర్తలు నీరుడి దుర్గేశ్, నీరుడి మల్లేశం, లక్ష్మణ్ ఒకే బైకుపై వారికి ఎదురు వచ్చారు. ర్యాలీని చూసి వారు టీఆర్‌ఎస్ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముగ్గురిపై దాడి చేసి, వారి బైక్‌ను తగలబెట్టారు. ఈ ఘటనలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడు రాహుల్ కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాడికి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టాలని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంగుపేట ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి, వట్‌పల్లి, పుల్కల్, జోగిపేట మండలాలకు చెందిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అడ్డుకున్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని నాయకులకు నచ్చజెప్పారు. ఈ ఘటనతో స్థానికంగా రెండు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
నేలను కాపాడుకోవాలి
జహీరాబాద్/కొండాపూర్/కంది/పటాన్చెరు, వెలుగు : వ్యవసాయ భూములు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాణిక్ రావు సూచించారు. సోమవారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ రైతు వేదిక లో వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలకు మంచి నేల అందిచాలంటే ఇప్పటి నుంచే భూమి కలుషితం కాకుండా చూడాలన్నారు. కోర మండల్ న్యూట్రి క్లినిక్ ద్వారా నిర్వహించిన భూసార పరీక్ష ఫలితాల కార్డులను రైతులకు అందజేశారు. అంతకుముందు జాహీరాబాద్ వ్యవసాయ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొండపూర్ మండలం మల్కాపూర్ రైతు వేదికలో డీఎవో నరసింహారావు ఆధ్వర్యంలో సేంద్రీయ, రసాయన ఎరువులు, విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. అలాగే కంది రైతు వేదికలో పీజేటీఎస్ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, గుమ్మడిదల రైతువేదికలో రైతులు పంటలలో ఎరువుల వాడకం, సేంద్రియ ఎరువులు, మట్టి పరీక్షల గురించి అధికారులు అవగాహన కల్పించారు.
ధరణి సమస్యలపై కాంగ్రెస్ ధర్నా
సిద్దిపేట/సంగారెడ్డి టౌన్, వెలుగు : ధరణి సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్‌వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. సిద్దిపేటలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, సంగారెడ్డిలో జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పోడు భూముల్లోని సాగు రైతులకు, ఆదివాసీలకు అటవీ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
మెదక్/సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రమేశ్, రాజర్జి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ మెదక్‌లో 80, సంగారెడ్డిలో 47 వినతులు వచ్చాయి. మెదక్ జిల్లా ‘కౌడిపల్లి మండలం రాయిలాపూర్ తండాలోని సర్వే నంబరు 393, 394, 387, 388లో కొంత మంది రైతులకు మాత్రమే కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన భూములకు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఎన్నో ఏండ్లుగా భూమి సాగుచేస్తున్న నిరుపేదలకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు’ అని తండా రైతులు రాజు, భక్య తదితరులు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి నివేదిక అందాజేయాలని అడిషనల్కలెక్టర్ రమేశ్ నర్సాపూర్ ఆర్డీఓ కు సూచించారు. కొల్చారం మండలం చిన్న ఘనపూర్ లో ఉన్న ఐఎంఎఫ్ఎల్ డిపోలో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిపో హమాలీ ఉద్యమ కమిటీ విజ్ఞప్తి చేసింది.