
కోహెడ, వెలుగు: ఖజానా ఖాళీ అయినా సంక్షేమం ఆగడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కవచాలు, మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు. మంత్రి మాట్లడుతూ రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 26వేల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.
ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని వీటిని వినియోగించుకొని వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తే ఆ గ్రామాలకు 5 మంచి పనులు చేస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్నిర్మల, వైస్ చైర్మన్తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మయ్య, జయరాజ్, సుధాకర్, బాలకిషన్, రవి, శ్రీశైలం, కుమార్ ఉన్నారు.