70 ఏళ్ల తాత ,65 ఏళ్ల బామ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్రు

70 ఏళ్ల తాత ,65 ఏళ్ల బామ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్రు

ప్రేమకు వయసుతో పనిలేదు.. ప్రేమ ఉన్న దగ్గర పెండ్లికి వయసు అడ్డురాదు. ‘ప్రేమ అనేది అనుకుంటేనో, కావాలి అనుకుంటేనో పుట్టదు. రెండు హృదయాలు కలవాలి. శరీరాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే అనేలా ఉండాలి’ ఆ మాటలను నిజం చేసింది ఈ జంట. అందులో విశేషం ఏముంది? ప్రేమించుకున్న వాళ్లు ఎవరైనా అలానే ఉంటారు కదా! కానీ, ఈ జంట కొంచెం స్పెషల్‌‌. ఎందుకంటే ఈ తాత వయసు 70. బామ్మ వయసు 65. ప్రేమించి, పెండ్లి చేసుకున్న బెంగాల్‌‌ జంట గురించి మరిన్ని వివరాలు. 

మన దేశంలో పెండ్లికి కనీస వయసు అనేది ఉంటుంది. కానీ.. అది దాటాక ఫలానా వయసు వరకే పెండ్లి చేసుకోవాలనే రూల్‌‌ మాత్రం లేదు. ‘ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే... మనకు సరిజోడు అయినవాళ్లు కనెక్ట్ అయినపుడు. వాళ్లను చూసినపుడే అనిపిస్తుంది. ఆ తరువాత అన్నీ వాళ్లే’ అంటోన్న ఈ జంట కథ.
బెంగాల్‌‌, నదియా జిల్లాలోని లాల్‌‌పూర్‌‌‌‌లో స్టేట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేసి రిటైర్‌‌‌‌ అయ్యాడు సుబ్రతా సేన్‌‌గుప్తా. తన తల్లి, తమ్ముళ్ల ఫ్యామిలీతో కలిసి లాలాపూర్‌‌‌‌లోనే ఉండేవాడు. కొన్నాళ్లకు కుటుంబంతో గొడవలు వచ్చి, వాళ్లతో ఉండటం ఇష్టం లేక ఇంటినుండి బయటికి వచ్చేశాడు. తన చివరి రోజులను వృద్ధాశ్రమంలో గడపాలనుకున్నాడు. రానాఘట్‌‌, పూర్ణానగర్‌‌‌‌లోని మెమోరియల్‌‌ ఓల్డ్‌‌ ఏజ్‌‌ హోమ్‌‌లో చేరాడు. 

అక్కడే మొదలైంది...

అక్కడే పరిచయమైంది అపర్ణ చక్రవర్తి. అదే వృద్ధాశ్రమంలో ఐదేండ్లుగా ఉంటోంది. అపర్ణ ఈ ఆశ్రమానికి రాకముందు కోల్‌‌కతాలోని బెలేఘాటాలో ఒక ప్రొఫెసర్ ఇంట్లో దాదాపు 30 ఏండ్ల పాటు పనిమనిషిగా చేసింది. ఇలా వాళ్లిద్దరి పరిచయం ఆ ఆశ్రమంలో ఏర్పడింది. లవ్‌‌ ఎట్‌‌ ఫస్ట్‌‌ సైట్‌‌ లాగ అపర్ణను చూడగానే ప్రేమలో పడిపోయాడు సుబ్రత. విశేషం ఏంటంటే.. ఇద్దరికీ అప్పటివరకు ఇంకా పెండ్లి కాలేదు. ఆమె కూడా తనలాగే బ్రహ్మచారిణి అని తెలిసేసరికి సుబ్రత ఆనందం ఇంకా ఎక్కువైంది. కానీ ఏమంటుందో అన్న భయంతో కొన్నాళ్లు తన ప్రేమను బయటకు చెప్పలేకపోయాడు. ఆశ్రమంలో తన స్నేహితుడు గౌరహరి సర్కార్ ఇచ్చిన ధైర్యంతో ఒకరోజు అపర్ణతో ‘ నిన్ను ప్రేమిస్తున్నాను.. పెండ్లి చేసుకుంటాను’ అంటూ ప్రపోజ్ చేశాడు. 

ఆ ప్రపోజల్‌‌ను ఆమె ఒప్పుకోలేదు. పైగా ‘ఈ వయసులో ప్రేమేంటి’ అని తిట్టింది. కొన్ని రోజుల వరకు బాధపడిన సుబ్రత, తర్వాత తనను చూస్తూ ఉండలేక ఆశ్రమం నుండి బయటకు వచ్చి అదే కాలనీలోని ఇల్లు అద్దెకు తీసుకొని ఉండటం మొదలుపెట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని అపర్ణనే తలుచుకుంటూ రోజూ బాధ పడేవాడు. కొన్ని రోజులకు ఆ బెంగ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్‌‌ పాలయ్యాడు. గౌరహరి ద్వారా ఈ విషయం తెలుసుకున్న అపర్ణ, సుబ్రత ఇంటికి పరుగున వెళ్లింది. ఆప్యాయంగా పలకరించింది. ‘చిన్న పిల్లల్లా ఏంటిది? ఇలా అయిపోతారా ఎవరైనా. నీ ప్రేమను అర్థం చేసుకోడానికి ఇంత టైం పట్టినందుకు క్షమించు’ అని ఏడ్చింది. అతని ప్రేమను యాక్సెప్ట్‌‌ చేసింది. కొన్నాళ్ల పాటు ప్రేమను ఎంజాయ్‌‌ చేసిన ఈ లవ్‌‌ బర్డ్స్‌‌, ఈ మధ్యే చట్టబద్ధంగా పెండ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి 
ప్రేమ, పెళ్లి వ్యవహారం తెలిసిన ప్రతీ ఒక్కరు ప్రేమకు వయసుతో పనిలేదని నిరూపించారంటూ మెచ్చుకుంటున్నారు. వీళ్ల కథ, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.