డాక్టర్‌పై గ్యాంగ్ రేప్​! పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

డాక్టర్‌పై గ్యాంగ్ రేప్​!  పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
  • హైకోర్టులో బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్
  • ముగ్గురు కలిసి తమ బిడ్డను చంపేశారని ఆరోపణ
  • దేశవ్యాప్తంగా అర్ధరాత్రి మహిళల కొవ్వొత్తుల ర్యాలీ

కోల్​కతా: వెస్ట్​బెంగాల్ క్యాపిటల్ కోల్‌‌కతాలోని ఆర్జీ కార్‌‌ మెడికల్ కాలేజ్, హాస్పిటల్​లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏండ్ల ట్రెయినీ డాక్టర్​పై గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం దొరికినట్టు పోస్టుమార్టం నివేదిక ద్వారా స్పష్టమైంది. కాగా, తన కూతురు గ్యాంగ్ రేప్​కు గురైందంటూ కోల్​కతా హైకోర్టులో ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. 

పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇదే చెప్తున్నదని తెలిపారు. అయినా, ఇప్పటి వరకు ఒకడిని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. ‘‘మా కూతుర్ని దారుణంగా చంపేశారు. శరీరంపై గాయాలు ఉన్నాయి. ముఖంపై దాడి చేశారు. పెదవులు చిట్లిపోయాయి. మెడపైన కొరికిన ఆనవాళ్లు ఉన్నాయి. కండ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌‌ అయింది. కడుపు, ఎడమ కాలు, కుడి చేయిని గాయపర్చారు’’ అని మృతురాలి పేరెంట్స్ తెలిపారు.

ముగ్గురు కలిసి చంపిన్రు

డాక్టర్లు కూడా గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారని మృతురాలి పేరెంట్స్ తెలిపారు. గ్యాంగ్ రేప్ దిశగా కేసు దర్యాప్తు జరగడంలేదని విమర్శించారు. తమ కూతురు చావుకు ఆర్జీ కార్‌‌ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ప్రిన్సిపాల్, మేనేజ్​మెంట్ కారణమని మండిపడ్డారు. ముగ్గురు 
కలిసి చంపినట్లు రికార్డులతో స్పష్టమవుతున్నదన్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటాప్సీ కూడా సరిగ్గా చేయలేదన్నారు. కొందరిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు.

సమ్మె విరమించిన ఫోర్డా

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది. తమ డిమాండ్లపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారని తెలిపింది. కాగా, ఆర్జీ కార్‌‌ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పీజీ స్టూడెంట్లు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సమ్మె కొనసాగిస్తున్నది. మరోవైపు, ట్రెయినీ డాక్టర్​పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ బుధవారం అర్ధరాత్రి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెద్ద సంఖ్యలో మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.