విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నం

విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నం

కోల్​కతా: కొంతమంది విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విభజన రాజకీయాలను తను అడ్డుకుంటానని, ప్రాణంపోయినా దేశాన్ని ముక్కలు కానివ్వబోనని ఆమె తేల్చిచెప్పారు. రంజాన్ సందర్భంగా శనివారం కోల్​కతాలోని రెడ్ రోడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేషనల్  రిజిస్టర్  ఆఫ్  సిటిజన్స్(ఎన్ఆర్ సీ), సిటిజన్ షిప్  అమెండ్ మెంట్  యాక్ట్  (సీఏఏ) లను బెంగాల్​లో అనుమతించబోనని చెప్పారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని, ఈ సందర్భంగా అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ఈ మేరకు అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఫెయిలైతే, అంతా నాశనం అవుతుందని హెచ్చరించారు.

ముస్లిం ఓట్లను చీల్చలేరు

రాష్ట్రంలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని ముస్లిం ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీలు ఎంత ప్రయత్నించినా ముస్లిం ఓట్లను చీల్చలేవని అన్నారు. బిల్కిస్  బానో కేసుపైనా ఆమె స్పందించారు. ఆ కేసులో ప్రతి ఒక్కరినీ విడుదల చేశారని, ఆ విషయంలో తమ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. ఇక రామనవమి సందర్భంగా బెంగాల్​లోని పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై స్పందిస్తూ.. హుగ్లీ, హౌరా జిల్లాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశామని మమత తెలిపారు. మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తరా? రంజాన్ సందర్భంగా సీఎం మమత చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. మతపరమైన కార్యక్రమాన్ని కూడా సీఎం రాజకీయం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్  భట్టాచార్య విమర్శించారు.