‘జాతీయ గీతం’ కేసులో జోక్యం చేసుకోలేం : బాంబే హైకోర్టు

‘జాతీయ గీతం’ కేసులో జోక్యం చేసుకోలేం : బాంబే హైకోర్టు

ముంబై : వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ముంబైలో జాతీయ గీతాన్ని అవమానించారంటూ మమతపై రిజిస్టరైన కేసును కొట్టేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ అమిత్ బోర్కర్ తో కూడిన సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని మమత అగౌరవపర్చారని, చర్యలు తీసుకోవాలని బీజేపీ ముంబై యూనిట్ ఆఫీస్ బేరర్ వివేకానంద్ గుప్తా మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మమత లేచి నిలబడలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు మమతకు సమన్లు జారీ చేసింది.  ఈ సమన్లను రద్దు చేసి కేసును మళ్లీ పరిశీలించాలని 2023లో సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మమత బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. సెషన్ కోర్టు సమన్లతో పాటు, మొత్తం కేసును రద్దు చేయాలని కోరారు. దీనిపై బుధవారం విచారించిన కోర్టు.. సెషన్ కోర్టు పాటించిన విధానం సరైందేనని, ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. 

కేంద్రం వైఖరికి నిరసనగా మమత ధర్నా

బెంగాల్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని, నిధులు రిలీజ్ చేయట్లేదంటూ మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. బుధవారం కోల్​కతా రెడ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆమె బైఠాయించారు. ఉపాధిహామీ, హౌసింగ్, రోడ్డు రవాణా, పలు పథకాలకు కేంద్రం నిధులు ఆపేసిందని మమత మండిపడ్డారు. గురువారం సాయంత్రం దాకా ధర్నా కొనసాగుతుందన్నారు. ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్​కు, ఓబీసీ స్టూడెంట్లకు స్కాలర్​షిప్​లు ఇవ్వట్లేదని, రోడ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించట్లేదని అన్నారు. ఉపాధి హామీ కింద రావాల్సిన రూ.7వేల కోట్లు రిలీజ్ చేయట్లేదన్నారు.ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని, అందుకే తాను ధర్నా చేస్తున్నానన్నారు.