- ఎమర్జెన్సీ సహా అన్ని రకాల సేవల బహిష్కరణ
కోల్‌కతా: డాక్టర్ రేప్, మర్డర్ కేసులో చేపట్టిన సమ్మెను విరమించి ఇటీవల డ్యూటీలో చేరిన జూనియర్ డాక్టర్లు మళ్లీ సమ్మెకు దిగారు. మంగళవారం నుంచే ఎమర్జెన్సీ సహా అన్ని రకాల సేవలకు బంద్ ప్రకటించారు. సీఎం మమతా బెనర్జీ హామీతో 42 రోజుల సమ్మె విరమించి జూ.డాక్టర్లు ఇటీవల విధుల్లో చేరారు. తాజాగా సాగర్ దత్తా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ఓ డాక్టర్ పై దాడి జరగడంతో మళ్లీ ఆందోళన బాటపట్టారు. ఆసుపత్రుల్లో భద్రతపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చే దిశలో సానుకూలంగా ఒక్క చర్య చేపట్టలేదని ఆరోపించారు.
ఇప్పటికీ తమకు ఆస్పత్రుల్లో రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. గతంలో చర్చల సందర్భంగా ఆసుపత్రులలో మహిళా డాక్టర్ల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆసుపత్రులలో భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, పోలీసులు సిబ్బంది, మహిళా పోలీసుల నియామకం తదితర ఏర్పాట్లు చేస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. దీంతో వారు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. దీంతో విధులను బహిష్కరించడం తప్ప తమకు మరో మార్గంలేకుండా పోయిందని చెప్పారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.