24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు.. ఎక్కడంటే..

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు.. ఎక్కడంటే..

 పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను హైకోర్టు రద్దు చేసింది.

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కోల్‌కతాహైకోర్టు ఈరోజు  ( ఏప్రిల్​ 22) షాక్ ఇచ్చింది. అప్పట్లో  బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన టీచర్ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించి.. నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2016లో ప్రభుత్వపాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లలో 9, 10, 11, 12వ తరగతుల టీచర్ల పోస్టుల భర్తీకి బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసి.. పరీక్ష నిర్వహించింది. అప్పట్లో 24 వేల  650 పోస్టుల భర్తీకి గాను రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాశారు. కాగా, ప్రభుత్వం 25 వేల 753 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.

అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యర్థన మేరకు ప్రత్యేక డివిజన్ బెంచ్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బెంచ్ కేసును విచారించి.. 2016 నియామక ప్రక్రియలో భారీ కుంభకోణాలు జరిగినట్లు నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన 25 వేల 753 టీచర్ పోస్టుల భర్తీని హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా ఇప్పటి వరకూ వారు తీసుకున్న జీతాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పును వెల్లడించింది. వారి వద్ద నుంచి 6 వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా స్థాయి అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసా గేందుకు అనుమతి ఇచ్చింది. 

 కొత్త టీచర్ల నియామ కాల ప్రక్రియను 15 రోజుల్లో గా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్సు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన  కోల్​కత్త హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.

 అభ్యర్థుల ఎంపిక లో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశంతో  అప్పట్లో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో అప్పటి  విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్ లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అనుచరురాలైన అర్పితా ముఖర్జీ కి చెందిన కోల్ కతా నివాసాన్ని సీబీఐ తనికీ చేయగా రూ. 21 కోట్ల నగదు, రూ. కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ కేసులో సీబీఐ తమ దర్యా ప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు  ఆదేశిం చింది.. సీబీఐ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని కోల్​కత్తా హైకోర్టు ఈరోజు ( ఏప్రిల్​ 22) తీర్పు వెలువరించింది. . .