358 ఓల్డ్ బిల్డింగుల సంగతేంది?..గ్రేటర్ హైదరాబాద్లో 685 పురాతన భవనాలు

358 ఓల్డ్ బిల్డింగుల సంగతేంది?..గ్రేటర్ హైదరాబాద్లో 685 పురాతన భవనాలు
  • 59 భవనాల కూల్చివేత 
  • 63 ఇండ్లకు రిపేర్లు చేసుకోవాలని నోటీసులు
  • 203 ఇండ్లు ఖాళీ చేయించిన ఆఫీసర్లు  
  • ఇప్పటికే బేగంబజార్ లో కూలిన భవనం
  • మిగిలిన వాటిపైనే భయమంతా..
  • కూలితే టౌన్​ ప్లానింగ్​దే బాధ్యత అన్న కమిషనర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో పురాతన భవనాల చుట్టుపక్కల ఉంటున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. గత గురువారం బేగంబజార్ లో ఓ పురాతన భవనం కూలగా, అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో నగరంలో ఎక్కడైనా ఓల్డ్​బిల్డింగులు కూలిప్రమాదాలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులే తీసుకోవాల్సి ఉంటుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. అయితే, నగరంలో 358 పురాతన భవనాల విషయంలో ఇంకా ఏ యాక్షన్​తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో సర్వే చేసిన టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు 685 పురాతన, శిథిల భవనాలను గుర్తించింది. ఇందులో ఈ ఏడాది 59 బిల్డింగులను కూల్చివేయగా, మరో 63  భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. 203 ఇండ్లలో ఉంటే ప్రమాదం జరుగుతుందని చెప్పి వాటిని ఖాళీ చేయించారు. రెండు ఇండ్లను సీజ్​చేశారు. మరో 358 ఇండ్లకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రకటన ఇచ్చింది. అయితే, ఈ ఇండ్ల యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, నోటీసులు ఇచ్చి యాక్షన్​తీసుకుంటామని మాత్రం చెప్తోంది.  

9 ఏండ్లలో 3 వేల బిల్డింగుల గుర్తింపు 

నగరంలో తొమ్మిదేండ్లలో 3 వేలకి పైగా పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు గుర్తించిన బల్దియా, ఇందులో కూలిపోయే స్థితిలో ఉన్న 500 బిల్డింగులను నేలమట్టం చేసింది. మూడేండ్లలో  1071 పాత బిల్డింగులు ఉన్నాయని తేల్చింది. వీటిల్లో రిపేర్లు సరిపోతాయనుకుంటే ఓనర్లకు చెప్తున్నారు. మరమ్మతులు చేసుకోకపోతే కూల్చివేత నోటీసులు ఇచ్చి యాక్షన్​లోకి దిగుతున్నారు. ప్రస్తుతం కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో ఓల్డ్​బిల్డింగుల విషయంలో బల్దియా సీరియస్​గానే ఉంది.  

ఫిర్యాదులు చేయండి

నగరంలో ప్రమాదకరంగా ఉన్న భవనాలపై ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.  040–21111111 నంబర్​కు కాల్​చేసి చెప్తే యాక్షన్​తీసుకుంటామని అంటున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అంటున్నారు. ఫోటో: సిటీ డేట్ లో ఉన్నాయి.

జోన్ల వారీగా ఇలా.. 

అత్యధికంగా చార్మినార్ జోన్ లో 180 పురాతన బిల్డింగులు ఉండగా, 9 భవనాలను కూల్చివేశారు. మరో  ఏడింటికి రిపేర్లు చేసుకోవాలని ఆదేశించారు. 72 ఇండ్లను ఖాళీ చేయించగా, ఓ ఇంటిని సీజ్ చేశారు.  మరో 91 భవనాలకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.  ఖైరతాబాద్ జో న్ లో 155  పురాతన భవనాలుండగా, 10 భవనాలు  కూల్చివేశారు. మరో 16  బిల్డింగులకు రిపేర్లు చేసుకోవాలని ఆదేశించారు. 26  ఇండ్లను ఖాళీ చేయించగా 103 బిల్డింగులకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సికింద్రాబాద్ జోన్ లో 135  పురాతన భవనాలుండగా, 5  భవనాలను కూల్చివేశారు. ఆరు భవనాలకు రిపేర్లు చేసుకోవాలని చెప్పి 23 ఇండ్లను ఖాళీ చేయించారు. మరో 101  భవనాలకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఎల్బీనగర్ జోన్ లో 87  పురాతన భవనాలుండగా, 15 బిల్డింగులు కూల్చివేశారు. మరో16  భవనాలకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. 27 ఇండ్లను ఖాళీ చేయించగా మరో 29  భవనాలకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కూకట్ పల్లి జోన్ లో  76  పురాతన భవనాల్లో 12 బిల్డింగులు కూల్చారు. పదింటికి రిపేర్లు చేసుకోవాలని చెప్పి మరో 31 ఇండ్లను ఖాళీ చేయించారు. 23 బిల్డింగులకు సంబంధించి యాక్షన్​తీసుకోవాల్సి ఉంది.  శేరిలింగంపల్లి లో  52  పురాతన భవనాల్లో 8 భవనాలు కూల్చివేశారు. మరో 8  భవనాలకు రిపేర్లు చేసుకోవాలని ఆదేశించారు.24 ఇండ్లను ఖాళీ చేయించగా మరో 11   భవనాలకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిఉంది.