హైదరాబాదీలు ఓటీటీలో ఏం చూస్తున్నరు?

హైదరాబాదీలు ఓటీటీలో ఏం చూస్తున్నరు?
  • హైదరాబాదీలు ఓటీటీలోఏం చూస్తున్నరు?
  • హిందీ కంటెంట్‌‌కే ఎక్కువ మంది ప్రయారిటీ
  • తర్వాతి స్థానాల్లో ఇంగ్లిష్, తెలుగు సినిమాలు, వెబ్‌‌ సిరీస్‌‌లు

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తున్నది. రోజుకో వెబ్‌‌ సిరీస్‌‌ వస్తున్నది. వారానికి డజన్ సినిమాలు స్ట్రీమింగ్ అయితున్నయ్. మరి ఇందులో హైదరాబాదీలు ఏవి ఎక్కువ చూస్తున్నరు? ఏ కంటెంట్‌‌ను ఇష్టపడుతున్నరు? ఎంత సేపు ఓటీటీల్లో గడుపుతున్నరు? ఈ విషయాలపై రెడ్‌‌ మ్యాటర్‌‌ టెక్నాలజీస్‌‌ (ఆర్‌‌ఎంటీ) అనే సంస్థ సర్వే చేసింది. ‘అండర్‌‌స్టాండింగ్‌‌ పెయిడ్‌‌ ఓటీటీ సబ్‌‌స్ర్కైబర్స్‌‌ ఆఫ్‌‌ హైదరాబాద్‌‌’ పేరుతో రిపోర్టును రిలీజ్ చేసింది. తెలుగు సినిమాలు బాలీవుడ్‌‌లో అదరగొడుతుంటే.. హైదరాబాదీలు మాత్రం హిందీ సినిమాలు మస్తు చూస్తున్నరని చెప్పుకొచ్చింది.
ఆ తరువాత ఇంగ్లీష్... మూడోప్లేస్​లో తెలుగు​ 

హైదరాబాద్‌, వెలుగు : సిటీ జనం తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. హిందీ సినిమాలపై, వెబ్​సిరీస్​లపై మక్కువ చూపుతున్నారు. ఇంగ్లీష్​ కంటెంట్​ను బాగా ఇష్టపడుతున్నారు. వీళ్ల ప్రయారిటీలో  తెలుగు కంటెంట్​ మూడోస్థానంలో ఉంది. మార్కెటింగ్‌ స్ట్రాటజీ కన్సల్టెన్సీ ఆర్‌ఎంటీ (రెడ్‌ మ్యాటర్‌ టెక్నాలజీస్‌)  ‘అండర్‌స్టాండింగ్‌ పెయిడ్‌ ఓటీటీ సబ్‌స్ర్కైబర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్​ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 52శాతం మంది హిందీ ఓటీటీ కంటెంట్‌ ఇష్టపడుతున్నారు. 28శాతం మంది ఇంగ్లీష్​​ ఓటీటీ కంటెంట్‌ ఎక్కువగా చూస్తున్నారు. 14శాతం మంది మాత్రమే తెలుగు కంటెంట్‌ను అభిమానిస్తున్నారు. 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఓటీటీని ఒంటరిగా చూడాలనుకుంటున్నారు. 36 ఏళ్లు దాటిన వారిలో 46శాతం మంది  కుటుంబంతో కలిసి ఓటీటీ కంటెంట్​ను టీవీలో చూడాలని కోరుకుంటున్నారు.  మహిళల్లో 60శాతం మంది హిందీ, 27 శాతం ఇంగ్లీష్‌ కంటెంట్‌ చూడటానికి ఇష్టపడుతున్నారు. తెలుగు చూసేవారి సంఖ్య ఆరు శాతాన్ని మించడం లేదు.  ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్​ లో ప్రైమ్‌ వీడియోను ఎక్కువ మంది వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70శాతం యూజర్లు  అమెజాన్​ ప్రైమ్​ యూజర్లు ఉన్నారు. రోజుకు కనీసం మూడు గంటలు ఓటీటీలపై గడుపుతున్నారు.

సగం మంది ఫోన్లల్లోనే..

వ్యూయర్లలో సగం మంది కంటెంట్​ను మొబైల్​ ఫోన్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. 51 శాతం మంది ఫోన్లలో, 32 శాతం మంది టీవీ స్క్రీన్లపై, 14 శాతం మంది కంప్యూటర్లలో కంటెంట్​ను చూస్తున్నారు. 36 ఏళ్లపైబడిన​ గ్రూపులో 43 శాతం మంది వ్యూయర్లు మొబైల్స్​లో కంటెంట్​ చూస్తున్నారు. ఓటీటీల సబ్​స్క్రిప్షన్​ రేట్లు ఎక్కువ ఉండటం తమకు నచ్చడం లేదని 31 శాతం మంది, ప్రకటనలు నచ్చడం లేదని 29 శాతం మంది, నెట్​కనెక్టివిటీ తప్పనిసరి కావడం ఇబ్బందిగా ఉందని 27 శాతం మంది చెప్పారు. మెజారిటీ యూజర్లు మంచి కంటెంట్​ను వెతుక్కోవడానికి సోషల్​ మీడియాపై ఆధారపడుతున్నట్టు చెప్పారు.  ఈ సర్వే కోసం 500 మంది ఓటీటీ యూజర్ల నుంచి వివరాలు సేకరించామని ఆర్‌ఎంటీ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్​ అమన్​ చెప్పారు. 

 రిపోర్టు హైలైట్స్​:

  • 36సంవత్సరాలు దాటిన వ్యక్తులలో 55శాతం మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీలు చూడాలనుకుంటున్నారు. యువత ఒంటరిగా చూడటానికి ఇష్టపడుతున్నారు.
  • హైదరాబాద్‌ ఓటీటీ సబ్​స్క్రయిబర్లలో 52శాతం మంది హిందీ ఓటీటీ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.  28శాతం మంది ఇంగ్లీష్​​ ఓటీటీ కంటెంట్‌కుప్రాధాన్యతనిస్తే, 14శాతం మంది మాత్రమే తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • హైదరాబాదీలను ఆకట్టుకోవడంలోప్రాంతీయ ఓటీటీ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి.నేషనల్​,ఇంటర్నేషనల్​ సంస్థల కంటెంట్​కే ఎక్కువ ఆదరణ ఉంది.