అందమంటే ఏంటి?

అందమంటే ఏంటి?

అందంగా లేనా? హీరోయిన్‌‌ అంటే ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకి మొట్టమొదట దూసుకొచ్చే జవాబు.. అందంగా ఉండాలి అని. అందమంటే ఏంటి? స్లిమ్‌‌గా ఉండాలి.. తెల్లగా ఉండాలి.. చూడగానే వావ్ అనిపించాలి.. ఎవరి నిర్వచనాలు వారివి. ఇలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ అలానే ఉండాలి అని పట్టుబట్టడం తప్పు. అలా లేకపోతే నెగిటివ్ కామెంట్స్‌‌తో మనసుల్ని గాయపర్చడం అంతకంటే పెద్ద తప్పు. ఈ తప్పు పదే పదే జరుగుతోంది. రీసెంట్‌‌గా మరోసారి జరిగింది.  ‘శ్యామ్ సింగరాయ్‌‌’ సినిమాలో సాయిపల్లవి అందంగా లేదంటూ వచ్చిన ఓ నెగిటివ్‌‌ ఆర్టికల్ దుమారం రేపింది. సాక్షాత్తూ తెలంగాణ గవర్నర్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యేంతగా విషయం వైరల్ అయ్యింది. మనసుల్ని గాయపర్చే ఈ బాడీ షేమింగ్‌‌ గురించి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నటీమణులు  రియాక్టయ్యారు. ఇదిగో.. ఇలా తమ బాధను వెలిబుచ్చారు.

ఆ బాధ పడ్డవారికే తెలుసు
సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేయడం నన్ను చాలా బాధించింది. గతంలో నన్ను కూడా చాలా ట్రోల్ చేసేవారు. ఆ మాటలు పడ్డవారికే అందులోని బాధేంటో తెలుస్తుంది. నేనూ చాలా బాధపడ్డాను. కానీ నా టాలెంట్‌‌తో, కష్టంతో వాటిని ఎదుర్కొన్నాను. అయినా పొట్టిగా, నల్లగా ఉండటం తప్పు కాదు. వాటిలోనూ ఓ అందం ఉంటుంది. నల్లగా ఉందని కాకి తన బిడ్డను వదిలేస్తుందా? బంగారు పిల్లగా భావించి ప్రేమిస్తుంది కదా! ఆడవాళ్ల విషయంలోనే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. అదే మగవాళ్లని అంటే వాళ్లు తట్టుకోలేరు. యాభయ్యేళ్ల వయసులో ఉన్నవారిని కూడా యువకుల్లా చూస్తారు. కానీ మహిళల విషయంలో అలా జరగదు. ఇలా బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలను తగ్గించడానికే ప్రయత్నిస్తుంటారు.తమిళిసై

ఎవరికి వారే స్పెషల్
నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో లావుగా ఉన్నావంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అది నా కాన్ఫిడెన్స్‌‌ని దెబ్బ తీసింది. కుంగిపోయాను. నన్ను నేనే అసహ్యించుకున్నాను. ఎప్పటికో తేరుకుని ముందుకెళ్లాను. ఇంత సక్సెస్ అయ్యాక, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాక కూడా లావుగా ఉన్నానని, పొట్టిగా ఉన్నానని అనేవాళ్లు ఉన్నారు. కానీ నేను పట్టించుకోవట్లేదు. ఒకరి శరీరం మీద, కలర్ మీద కామెంట్స్ చేయకండి. అందరూ ఒకలా ఉండరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ఒకరిని మరొకరితో పోల్చకండి.  ఎందుకంటే ఎవరికి వారే స్పెషల్....విద్యాబాలన్

జడ్జ్ చేయకండి
ఎదుటివాళ్లు ఎలా ఉండాలి అనేది మీరు చాలా తేలికగా చెప్పేస్తారు. అలా చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓ బిడ్డకు తల్లయ్యాక శరీరం మారుతుంది. నాదీ మారింది. దాంతో ట్రోలింగ్ మొదలైంది. అమ్మ అయినందుకు బాడీ షేమింగ్ చేస్తారా ఎవరైనా! అలా ఉన్నావ్ ఇలా ఉన్నావ్ అంటూ జడ్జ్ చేయడం చాలా తప్పు. అసలు ఒకరెలా ఉండాలనేది మీరెలా ఊహించేసుకుంటారు? ఇంత నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తారు?
– ఐశ్వర్యారాయ్

నేనేమైనా బొమ్మనా!
నీ ముక్కు బాలేదంటారు. నవ్వితే నీ లిప్స్ బాలేదంటారు. నీ ముఖం అలా ఉంటే బాగుంటుంది, నీ పెదవులు ఇలా ఉంటే బాగుంటాయి అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తారు. సర్జరీలు చేయించుకోమని సలహాలు ఇచ్చినవాళ్లు కూడా ఉన్నారు. నేనిలాగే పుట్టాను. ఇలాగే ఉంటాను. మార్చుకుంటూ పోవడానికి నేనేం  బొమ్మని కాదు. 
- కృతీసనన్​


లైట్ తీసుకోండి
బరువు ఎందుకు పెరిగిందని ఎవరూ ఆలోచించరు. కామెంట్స్ మాత్రం చేసేస్తారు. హెల్త్ బాగుండకపోవచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. అవన్నీ వారికి అనవసరం. అందుకే వాళ్లేం అనుకుంటారనేది నాకు అనవసరం. నేను ఏవీ పట్టించుకోను. ఎలా కనిపిస్తున్నాననే దానికంటే నేనేం చేస్తున్నాను అనేదే నాకు ముఖ్యం. నేను మాట్లాడాలనుకోను. నా పని మాట్లాడితే చాలనుకుంటాను. నేనే కాదు.. ఎవరైనా సరే.. ఇలాంటి వాటిని లైట్ తీస్కోండి.
– నిత్యామీనన్

ఇందులో గెలవాలంటే..
అందంగా ఉన్నావంటారు. నువ్వు నాకు నచ్చావని చెబుతారు. అంతలోనే నీ ముఖం చాలా మామూలుగా ఉంది అంటూ తీసి పారేస్తారు. అలాంటివాళ్ల కామెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఎవరేమనుకున్నా నేను ముందుకే అడుగులేశాను. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే చాలు. వేరొకరు ప్రేమించక్కర్లేదు. ఎవరికో మనం నచ్చాల్సిన పనీ లేదు. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోగలిగితే ఈ యుద్ధంలో సగం గెలిచినట్టే. 
- రకుల్ ప్రీత్ సింగ్

ఎందుకీ మాటలు!
ఓ సమయంలో నా బరువు అరవై అయిదు కిలోలకు పెరగడంతో వయసుకు మించి కనిపించాను. దాంతో కొందరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. చూడు ఎంత లావుగా ఉన్నావో, ఎంత పెద్దగా కనిపిస్తున్నావో అన్నారు. ఇప్పుడేమో ఎందుకింత సన్నగా అయ్యావు, లావుగా ఉన్నప్పుడే బాగున్నావు అంటున్నారు. నేను మారడం కాదు.. ముందు మీ మనసుల్ని , ఆలోచనల్ని మార్చుకోండి. లావుగానో సన్నగానో ఉండడాన్ని బట్టి, పెద్దగానో చిన్నగానో కనిపించడాన్ని బట్టి నన్ను ఇష్టపడతారా? ఎందుకిలాంటి మాటలు? 
– ప్రియమణి 

ఇది అందరి సమస్య
సోషల్‌‌ మీడియాలో ఫొటోలు పెట్టిన ప్రతిసారీ అందంగా లేనని, రంగు తక్కువ ఉన్నానని నెగిటివ్ కామెంట్స్ విసురుతూనే ఉంటారు. ఇది అందరూ అనుకునేంత చిన్న సమస్య కాదు. నా ఒక్కదాని సమస్య కూడా కాదు. ప్రతి ఆడపిల్ల సమస్య. ఇలాంటి మాటల వల్ల ఇన్‌‌ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. డిప్రెషన్‌‌కి గురయ్యే పరిస్థితి వస్తుంది. అందం రంగులోను, హైట్‌‌లోను ఉండదు. వాటిలో ఉంటుందని మీరంతా ఫీలవ్వడానికి మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమే కారణమేమో. నేనిలా ఉన్నందుకు ఆనందంగానే ఉన్నాను. మీరు కూడా అనవసరంగా బాధపడకండి.
– సుహానా, షారుఖ్ ఖాన్ కూతురు

ఇక ఆపండి
ఆడవాళ్ల కలర్‌‌‌‌ మీద, బాడీ మీద జోక్స్ వేస్తారు. నవ్వుతారు. నిజం చెప్పండి.. అది జోక్ చేయాల్సిన విషయమా? దేనిమీద జోక్స్ వేయాలో మీకు తెలియదా? తెల్లగా ఉన్నవారి మీద అలా జోక్స్ వేస్తారా? ఎందుకు వేయరు? నలుపైతే ఏంటి.. తెలుపైతే ఏంటి? ఇది కుసంస్కారం. ప్రతిదానికీ ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పటికైనా దీన్ని ఆపండి. 
– రాధికా ఆప్టే