తెలంగాణ విమోచన దినోత్సవం .. సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగింది

తెలంగాణ విమోచన దినోత్సవం ..   సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగింది

తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే కాదు. ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు ఈ గడ్డ మీది ప్రజలు. నిజాం కాలంలో భూస్వాముల దౌర్జన్యాల వల్ల పుట్టి పెరిగిన ఊళ్లోనే బానిసలుగా బతికారు. రైతులు జీతం లేని కూలీలయ్యారు. రజాకార్ల ఆగడాలతో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. వెట్టి చాకిరీ కొన్ని కుటుంబాలకు తరాల తరబడి శాపమైంది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముఖ్య కారణమైంది. ఇంతకీ హైదరాబాద్‌‌ స్టేట్​ ఇండియాలో కలిసిన సెప్టెంబర్‌‌‌‌ 17కి ముందు ఏం జరిగింది? అసలు మన తెలంగాణ చరిత్ర ఎప్పుడు మొదలైంది? 

ALSO READ : పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు 

తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు.. క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డమీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది. వేల ఏండ్ల చరిత్రలో ఎంతోమంది పాలించారు. చివరగా నిజాంల కాలం వచ్చేసరికి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛకు దూరమయ్యారు. కొంతమంది చేతిలోనే అధికారం ఉండేది. భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులను ఎదిరించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది.  ఆ పోరాటాల ఫలితమే తెలంగాణ ప్రజలకు దక్కిన స్వేచ్ఛ. 

బిజినెస్‌‌కు కేరాఫ్‌‌

15వ శతాబ్దంలో తెలంగాణ బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది. 1591లో మూసీ నది తీరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. తర్వాత నగరానికి కేంద్రంగా చార్మినార్, మక్కా మసీదు లాంటివి కట్టారు. కొన్నేండ్లకు వజ్రాలు, ముత్యాలు, ఆయుధాలు, ఉక్కు బిజినెస్‌‌కు హైదరాబాద్‌‌ కేరాఫ్‌‌గా మారిపోయింది. ఇదిలా ఉండగా.. మొఘల్ యువరాజు ఔరంగజేబు1687లో హైదరాబాద్‌‌ని చేజిక్కించుకున్నాడు. అప్పటి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా బందీగా మారాడు. దాంతో హైదరాబాద్‌‌ పరిస్థితి చాలా మారింది. వజ్రాల వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది.1714లో మొఘల్ చక్రవర్తి ఫరూఖ్‌‌ సియార్ దక్కన్‌‌ ప్రాంతానికి వైస్రాయ్‌‌గా మీర్ కమ్రుద్దీన్‌‌ సిద్ధిఖీని నియమించాడు. అతనికి ‘నిజాం ఉల్-ముల్క్’ అనే బిరుదు కూడా ఇచ్చాడు. అతనే 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు.

Also Raed :- ఎన్నికల శంకుస్థాపనలు.. ఎన్నికల వేళ ఎమ్మెల్యే వనమా రాజకీయం

అప్పటి నుంచి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ వంశీయులే పాలించారు. 1911లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు. అలీఖాన్‌‌ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇతని హయాంలోనే హైదరాబాద్‌‌ బాగా డెవలప్ అయింది. కానీ.. పేదల జీవితాలు మాత్రం దొరల చేతుల్లో నలిగిపోయాయి. భూస్వామ్య వ్యవస్థ బలపడింది.  


తిరుగుబాటు

1945 చివరలో తెలంగాణలో రైతుల తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీ, భగీలా, లెవీ విధానం, జాగీర్దార్లు.. ఇలాంటి అనేక వ్యవస్థలు తిరుగుబాటుకు కారణమయ్యాయి. ఈ తిరుగుబాటును ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ అని కూడా పిలుస్తారు. ఏడో నిజాం కాలంలో జమీందార్లు, దేశ్‌‌ముఖ్‌‌ల చేతిలో ఎక్కువ భూమి ఉండేది. వాళ్ల చేతిలోనే అధికారం కూడా ఉండేది. నిజాంకు వాళ్లు ఎంత చెప్తే అంత. ఆ అధికారంతో జమీందార్లు పేదలను చాలా హీనంగా చూసేవాళ్లు. కూలి ఇవ్వకుండా పనిచేయించుకునేవాళ్లు. అన్యాయంగా భూములు లాక్కునేవాళ్లు. దుక్కి దున్ని, సాగు చేసిన రైతు మూడు పూటలా తినడమే కష్టంగా మారింది. రైతులు పండించిన పంటను కూడా లాక్కునేవాళ్లు. ఈ పరిస్థితుల నుంచే సాయుధ పోరాటం పుట్టింది. భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం తర్వాత నిజాంకు కూడా వ్యతిరేకంగా మారింది. దాంతో భూస్వాములకు రజాకార్ల(ఖాసీం రజ్వీ తయారు చేసిన ప్రైవేట్ మిలటరీ) సపోర్ట్‌‌ దొరికింది. రజాకార్లు గ్రామాలను చుట్టుముట్టి ఉద్యమకారులను చంపేవాళ్లు. ఈ పోరాటంలో మొత్తం నాలుగువేల మంది చనిపోయారనేది ఒక అంచనా. 

దేశానికి స్వాతంత్ర్యం

ఒక వైపు రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడే 1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశం మొత్తం స్వతంత్ర సంబురాలు చేసుకుంటుంటే.. మనం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయాం. స్వతంత్ర ఇండియన్‌‌ యూనియన్‌‌లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు. బ్రిటిష్‌‌ వాళ్లు వెళ్లిపోతూ.. బ్రిటిష్‌‌ ఇండియాలో ఉన్న భూభాగాన్ని ఇండియన్స్‌‌కి అప్పగించారు. కానీ.. సంస్థానాలు ఇండియాలో కలవాలా? లేదా? అనేది వాటి నిర్ణయానికే వదిలేశారు. నిర్ణయం వారికే వదిలిన దరిమిలా సర్దార్‌‌ వల్లభబాయ్‌ పటేల్‌ చొరవ తీసుకుని జరిపిన సంప్రదింపులు, సయోధ్య యత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. దాంతో దాదాపు ఐదు వందలకు పైగా సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి. కానీ.. హైదరాబాద్‌‌, జునాగఢ్‌‌, కాశ్మీర్‌‌ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి. హైదరాబాద్‌‌ విషయానికి వస్తే.. ఇండియాలో బలవంతంగా కలుపుకోవాలా?  లేక స్వతంత్రంగా ఉండే అవకాశం ఇవ్వాలా? అనేదాని మీద కొంతకాలం చర్చ జరిగింది. అప్పుడు సర్దార్ వల్లభబాయ్‌ పటేల్‌ మాత్రం కచ్చితంగా భారతదేశంలో కలపాల్సిందే అన్నాడు. నిజాం తన పాలనలో ఉన్న తెలంగాణలోని అప్పటి ఎనిమిది జిల్లాలు నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌‌నగర్, నిజామాబాద్, ఆత్రఫ్​ బల్దా, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, పర్బనీ, బీడ్, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్‌‌‌‌ను కలిపి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశాడు.  సంస్థానంలోని ప్రజలకు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండేది. 

పాకిస్తాన్‌‌లో కలవడానికి 

వీలైతే హైదరాబాద్‌‌ను స్వతంత్ర దేశంగా మార్చాలి.. లేదంటే పాకిస్తాన్​లో కలపాలి అనుకున్నాడు నిజాం రాజు ఉస్మాన్‌‌ అలీ ఖాన్‌‌. దాంతో హైదరాబాద్‌‌కి స్వతంత్ర రాచరిక దేశ హోదా ఇవ్వాలని బ్రిటిష్‌‌ గవర్నమెంట్‌‌కి రిక్వెస్ట్‌‌ పెట్టుకున్నాడు. కానీ.. ఆ రిక్వెస్ట్‌‌ని ఇండియా చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ ఒప్పుకోలేదు. అయినా..అలీఖాన్‌‌ ప్రయత్నాలు ఆపలేదు. తెలంగాణను ప్రత్యేక దేశంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌‌ సంస్థానం ఇండియాలో కలిసే వరకు అనేక కుట్రలు చేశాడు. అప్పటి ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ చురుకుగా లేకపోతే.. పెద్ద అనర్థమే జరిగేది. యూరప్‌‌ దేశాల్లో తన ప్రతినిధులను నియమించేందుకు ప్రయత్నించాడు. హైదరాబాద్‌‌ రాజ్యానికి సముద్ర మార్గం ఉండాలనే ఉద్దేశంతో గోవాను లీజుకు తీసుకోవాలనుకున్నాడు. కుదిరితే కొనుక్కోవాలని ప్లాన్‌‌ చేశాడు. అందుకోసం పోర్చుగీసు వాళ్లతో చర్చలు కూడా జరిపాడు. ఇదిలా ఉండగా .. ఇండియన్ గవర్నమెంట్‌‌ నిజాం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో ‘స్టాండ్‌‌ స్టిల్’ ఒప్పందం చేసుకోవాలి అనుకున్నాడు. దీని ప్రకారం..  అప్పటిదాకా బ్రిటిష్‌‌ గవర్నమెంట్‌‌తో ఉన్నట్టే ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌తో కూడా హైదరాబాద్‌‌ సంస్థానం సంబంధాలు కొనసాగిస్తుంది. దీనివల్ల హైదరాబాద్‌‌లో ఇదివరకు బ్రిటిష్‌‌ మిలటరీ క్యాంపులు ఉన్నట్టే ఇండియన్‌‌ మిలటరీ కూడా ఉండడానికి వీలుంటుంది. కానీ.. దీనికి మజ్లిస్‌‌ ఎ ఇత్తెహాదుల్‌‌ ముస్లిమీన్‌‌, రజాకార్ల లీడర్ ఖాసిం రజ్వీ ఒప్పుకోలేదు. నిజాం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్  మిలటరీ హైదరాబాద్‌‌లో ఉండకూడదని పట్టుబట్టారు. దాంతో నిజాం రాజు హైదరాబాద్‌‌లో భారత సైన్యం ఉండకుండా షరతు పెట్టి, 1947 నవంబరు 29న భారత గవర్నర్‌‌ జనరల్‌‌ మౌంట్‌‌బాటన్‌‌తో స్టాండ్‌‌స్టిల్‌‌ ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం ఏడాది పాటు విదేశాంగ, రక్షణ, కమ్యూనికేషన్‌‌ విషయాల్లో తప్పిస్తే హైదరాబాద్‌‌పై ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌కి ఎలాంటి అధికారాలు ఉండవు. ఇండియన్‌‌ గవర్నమెంట్ కూడా ఎలాంటి సైనిక చర్య జరపబోమని హామీ ఇచ్చింది. 

ఒప్పందం తప్పింది

నిజాం గవర్నమెంట్​ కొన్ని రోజులు కూడా ఆ ఒప్పందంలోని రూల్స్‌‌ పాటించలేదు. ఇండియన్ గవర్నమెంట్​కి తెలియకుండా పాకిస్తాన్‌‌తో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. పాకిస్తాన్‌‌కు రహస్యంగా 15 మిలియన్ పౌండ్లు అప్పు ఇచ్చింది. అంతేకాదు.. ఒక పెద్ద సెమీ -ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటుచేసుకోవడం మొదలుపెట్టింది. భారతదేశంతో యుద్ధానికి రెడీ అయింది. అందుకోసం ముందస్తుగానే ఆయుధాలు సమకూర్చుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిజాం రాజు. విదేశాంగ వ్యవహారాలు భారతదేశం చేతిలోనే ఉన్నా విదేశాల నుంచి ఆయుధాలు కొనేందుకు ప్రయత్నించాడు. అందుకు పాకిస్తాన్‌‌ కూడా సపోర్ట్‌‌ చేసింది. 6లక్షల రైఫిళ్లు, రివాల్వర్లు, 3లక్షల లైట్‌‌ అండ్‌‌ హెవీ మెషిన్‌‌గన్స్​ ఫ్రాన్స్‌‌ నుంచి కొనేందుకు రెడీ అయ్యాడు. అయితే.. ఈ విషయం కామన్వెల్త్‌‌ రిలేషన్స్‌‌ ఆఫీస్ ద్వారా లండన్‌‌లోని భారతదేశ హైకమిషనర్‌‌‌‌కు తెలిసింది. దాంతో భారతదేశం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. వెంటనే.. నిజాం మరో మార్గం వెతుక్కున్నాడు. ఆస్ట్రేలియా ఏజెంట్‌‌ సిడ్నీకాటన్‌‌కు కొన్ని దేశాలతో సంబంధాలు ఉండేవి. దాంతో కాటన్‌‌కు వెపన్స్‌‌ ఆర్డర్ ఇచ్చాడు నిజాం. భారతదేశం ఎంత అడ్డుకున్నా1948 కల్లా కొన్ని ఆయుధాలు హైదరాబాద్‌‌కు చేరాయని అప్పట్లో చర్చ జరిగింది. 

తెలంగాణలో తిరుగుబాట్లు  

అప్పటికే నిజాం రాజు మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు 1948 నాటికి జమీందార్లు, దేశ్‌‌ముఖ్‌‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీళ్లతో పాటు చాలామంది ముఖ్యంగా హిందువులు ఇండియాలో చేరాలని కోరుకున్నారు. మరోవైపు, హిందువుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని భయపడి.. దాన్ని అణచివేసేందుకు ఒక సైన్యం ఉండాలనే ఉద్దేశంతో ఖాసీం రజ్వీకి ‘రజాకార్లు’ అనే ముస్లిం మిలటరీని ఏర్పాటు చేయడానికి పర్మిషన్‌‌ ఇచ్చాడు ఉస్మాన్‌‌ అలీఖాన్‌‌. రజాకార్లు రోజురోజుకూ బలపడ్డారు.1948 నాటికి దాదాపు రెండు లక్షల మంది రజాకార్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఈ రజాకార్లతో ఎప్పటికైనా ముప్పు ఉంటుందని చాలామంది హిందువులు భయపడ్డారు. అందుకే ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌లో కలవాలని పట్టుబట్టారు. అప్పటికే చాలా గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘాలు పట్టు సాధించాయి. టౌన్లలో రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి. దాంతో ‘ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటే సైనిక చర్య తప్పదని’ అనుకుంది ఇండియన్ గవర్నమెంట్‌‌. 

ఆపరేషన్ పోలో.. 

నిజాం కూడా రోజురోజుకూ ఇండియన్ గవర్నమెంట్‌‌ను కవ్వించే ప్రయత్నం చేశాడు. ఇండియన్‌‌ కరెన్సీపై నిషేధం విధించాడు. కొన్ని రకాల ఎగుమతులు ఆపేశాడు. అంతేకాదు.. యునైటెడ్ నేషన్స్‌‌ సాయం కోరేందుకు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు. ఇక లాభం లేదని.. బలవంతంగా అయినా.. హైదరాబాద్‌‌ని ఇండియాలో విలీనం చేయాలని ఇండియన్ యూనియన్‌‌ ఫిక్సయింది. సర్దార్ వల్లభ్​ బాయ్ పటేల్‌‌ చెప్పడంతో ‘‘ఆపరేషన్ పోలో’’ పేరుతో 1948 సెప్టెంబర్‌‌‌‌ 13న సైనిక చర్య మొదలైంది. ఈ ఆపరేషన్‌‌తో హైదరాబాద్‌‌ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడమే ఇండియన్‌‌ యూనియన్‌‌ లక్ష్యంగా చేసుకుంది. 

అప్పటికే బలహీనుడు

ఇండియన్ గవర్నమెంట్‌‌తో పోలిస్తే... నిజాంకు  పెద్దగా సైనిక బలం లేదు. అతని మిలటరీలో 24,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్లలో 6,000 మంది మాత్రమే పూర్తి ట్రైనింగ్‌‌ తీసుకున్నవాళ్లు. మూడు సాయుధ రెజిమెంట్లు, అశ్వికదళ రెజిమెంట్,11 పదాతిదళ బెటాలియన్లు, ఫిరంగి దళాలు ఉన్నాయి. ఈ సైన్యానికి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ చీఫ్‌‌ ఆఫీసర్‌‌‌‌గా ఉన్నాడు. అయితే.. వీళ్లకు అండగా ఖాసీం రజ్వీ ట్రైనింగ్‌‌ ఇచ్చిన రజాకార్లు రెండు లక్షల మంది ఉన్నారు. వాళ్లలో నాలుగింట ఒక వంతు మంది దగ్గర ఆధునిక తుపాకులు ఉన్నాయి. మరికొందరి దగ్గర మజిల్‌‌ లోడర్స్‌‌ ఉన్నాయి. మిగిలినవాళ్ల దగ్గర కత్తులు ఉన్నాయి. 

భారత సైనిక సన్నాహాలు 

హైదరాబాద్‌‌ను స్వాధీనం చేసుకోవాలని డిసైడ్‌‌ కాగానే ఇండియన్‌‌ మిలటరీ ‘గొడ్దార్డ్ ప్లాన్‌‌’తో సైనిక చర్య మొదలుపెట్టింది. ఈ ప్లాన్‌‌ను సదరన్ కమాండ్‌‌కి కమాండర్‌‌‌‌ -ఇన్ -చీఫ్ లెఫ్టినెంట్ జనరల్​గా ఉన్న ఇ.ఎన్. గొడ్దార్డ్ ఇచ్చాడు. అందుకే ఆయన పేరుతో ‘గొడ్దార్డ్‌‌ ప్లాన్’ అని పిలుస్తుంటారు. ఈ ప్లాన్ ప్రకారం.. దాడికి రెండు మెయిన్ రూట్స్​ను ఎంచుకున్నారు. అవే విజయవాడ, షోలాపూర్. వీటితోపాటు ఔరంగాబాద్, కర్నూలు, ఆదిలాబాద్, రాయచూరు నుంచి కూడా ఒకేసారి ‘ఆపరేషన్ పోలో’ మెుదలైంది. షోలాపూర్ నుంచి మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌధురి నాయకత్వంలో దాడి జరిగింది. విజయవాడ నుంచి మేజర్ జనరల్ అజిత్ రుద్ర నాయకత్వంలో దాడి చేశారు. 

13 సెప్టెంబర్: భారత బలగాలు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌‌లోకి వచ్చాయి. మొదట షోలాపూర్–సికింద్రాబాద్ హైవేపై ఉన్న నల్​దుర్గ్​ కోట దగ్గర దాడి జరిగింది. తర్వాత నల్​దుర్గ్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఎత్తయిన ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ కంట్రోల్‌‌కి తీసుకుంది. ఉదయమే సైన్యం 34 కిలోమీటర్లు చొచ్చుకొచ్చింది. కానీ.. హైదరాబాద్ మిలటరీతోపాటు 200 మంది రజాకార్లు రెండు గంటల పాటు పోరాడారు. తర్వాత లొంగిపోయారు. విజయవాడ వైపు నుంచి లెఫ్టినెంట్ జనరల్ రుద్ర మిలటరీతో హైదరాబాద్ స్టేట్ ఫోర్సెస్‌‌లోని రెండు అశ్వికదళ యూనిట్లు యుద్ధం చేశాయి. అయినా.. మధ్యాహ్నానికి మునగాల వరకు చేరుకుంది ఇండియన్ ఆర్మీ. 

14 సెప్టెంబర్: ఇండియన్​ ఆర్మీలోని ఒక దళం తూర్పున రాజేశ్వర్ పట్టణానికి చేరుకుంది. అక్కడ వైమానిక దాడులు చేసింది. విజయవాడ నుంచి వచ్చిన ఆర్మీని సూర్యాపేటకు 6 కి.మీ దూరంలో ఉన్న దురాజ్‌‌పల్లి దగ్గర రజాకార్లు, నిజాం సైనికులు చాలాసేపు ఆపారు. కానీ.. ఓడిపోయారు. నిజాం మిలటరీపై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌‌ ఆర్మీ. మరోవైపు మేజర్ జనరల్ డీఎస్‌‌ బ్రార్ నేతృత్వంలోని దళం ఔరంగాబాద్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో పడింది. 


15 సెప్టెంబర్: సూర్యాపేట వైపు నుంచి వస్తున్న దళాలను ఆపేందుకు హైదరాబాద్‌‌ ఆర్మీ మూసీ నది మీద ఉన్న బ్రిడ్జ్‌‌ని కూల్చేసింది. ఇండియన్‌‌ ఆర్మీ నార్కెట్‌‌పల్లి దగ్గర హైదరాబాద్‌‌ సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. 

16 సెప్టెంబర్: లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫోర్స్ తెల్లవారుజామున జహీరాబాద్ వైపు వచ్చింది. బీదర్‌‌ రోడ్డు జంక్షన్‌‌ దగ్గరకు రాగానే అనుకోకుండా హైదరాబాద్‌‌ ఆర్మీ దాడులు చేసింది. అయినా.. పొద్దుపోయే టైంకి జహీరాబాద్ దాటి 15 కిలోమీటర్లు ముందుకు చేరుకుంది ఇండియన్‌‌ ఆర్మీ. 

17 సెప్టెంబర్: భారత సైన్యం పటాన్‌‌చెరువు వరకు వచ్చింది. మరో వైపు నుంచి వస్తున్న ఆర్మీ హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలోని చిట్యాల పట్టణానికి చేరుకుంది. మరో దళం హింగోలి పట్టణాన్ని కంట్రోల్‌‌లోకి తీసుకుంది. అప్పటికే ఉస్మాన్ అలీఖాన్‌‌కు ఓటమి భయం పట్టుకుంది. మరికాసేపట్లో యుద్ధం ముగుస్తుందని అర్థమైపోయింది. అందుకే సెప్టెంబరు17 సాయంత్రం నిజాం కాల్పుల విరమణ ప్రకటించాడు. భారత సైన్యానికి హైదరాబాద్‌‌లోకి వెల్‌‌కమ్‌‌ చెప్పాడు. అప్పటికే భారత సైన్యం సికింద్రాబాద్‌‌కు చేరింది. 

ఆ తర్వాత.. 

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ప్రధాన మంత్రి మీర్ లాయక్‌‌ అలీని పిలిపించి తనతోపాటు మంత్రివర్గంతో రాజీనామా చేయించాడు. తర్వాత ఉస్మాన్ అలీఖాన్ మొదటిసారి రేడియో స్టేషన్‌‌కు వెళ్లి స్పీచ్‌‌ ఇచ్చాడు. తర్వాత జనరల్ చౌధురి టీంకి, మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ ఆర్మీ అధికారికంగా లొంగిపోయింది. స్వాతంత్ర్యం వచ్చేనాటికి తెలంగాణలో అనేక సామాజిక సమస్యలు ఉండేవి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. తెలంగాణలో రైతాంగ పోరాటాలు జరగడానికి ఇవి కూడా కారణమయ్యాయి. అప్పట్లో తెలంగాణలో ఉన్న కొన్ని సమస్యలు..

వెట్టి

నిజాం కాలంలో ప్రజలంతా ‘బాంచెన్’లు అంటే బానిసలుగా ఉండేవాళ్లు. అప్పటి తెలంగాణ సమాజంలో ‘వెట్టి’ ఉండేది. ‘వెట్టి’ అంటే ‘వట్టిగా’ అని అర్థం. అంటే ఫ్రీగా పని చేయించుకోవడం. తెలంగాణలోని గ్రామాల్లో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తమ్మలి, హరిజన, బేగరి (గుర్రాల మాలీష్), నీరడి (నీరు తెచ్చేవాళ్లు) మొదలైన కులాలుండేవి. గ్రామాలకు రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులు వచ్చినప్పుడు ఈ కులాలవాళ్లు ఉచిత సేవ చేయాలి. చేయకపోతే కొట్టి బలవంతంగా పనులు చేయించుకునేవాళ్లు. అందుకే వీటిని ‘వెట్టి పనులు’ అంటారు. ఈ వెట్టిచాకిరీ నిజాం పరిపాలనా ప్రాంతమంతటా ఉండేది. భూస్వాములు తమ ఆధీనంలో ఉన్న పేద రైతులను తమ భూములు సాగు చేయడానికి, మిగతా కుటుంబ సభ్యులను వివిధ రకాల పనులు చేయడానికి ఉపయోగించుకునేవాళ్లు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలవడానికి ‘వెట్టి’ కూడా ముఖ్య కారణం. 

భగీలా

హైదరాబాద్​ సంస్థానం పరిధిలో అప్పట్లో ‘భగీలా’ వ్యవస్థ ఉండేది. దక్షిణ గుజరాత్‌‌లో హోలీ పండుగ జరుపుకునే ఒక వర్గం వాళ్లని ‘భగీలాలు’ అని పిలిచేవాళ్లు. భగీలాలు చాలావరకూ అంటరాని వర్గాలు, ఆదిమ కులాలకు చెందినవారై ఉంటారు. తమకు అప్పు ఇచ్చిన భూస్వాములకు సేవచేసి, రుణవిముక్తులు అవ్వడానికి భగీలాలు జీవితాంతం ‘వెట్టి’ చేయాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఇది కొన్ని తరాలపాటు కొనసాగేది. ఇలా తెలంగాణలో కూడా చాలామంది రైతులు, దళితులు నిజాం దగ్గర భగీలాలుగా ఉండేవాళ్లు. 

జాగీర్దారీ

అప్పటి తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ ఉండేది.  దేశ్‌‌ముఖ్‌‌లు, పటేల్, పట్వారీలు జాగీర్దార్‌‌‌‌లుగా ఉండేవాళ్లు. కింది వర్గాలపై వీళ్ల పెత్తనం ఎక్కువగా ఉండేది. వీళ్లు అప్పట్లో భూస్వాములుగా చెలామణీ అవుతూ ఉండేవాళ్లు. సంస్థానం మొత్తం భూమిలో 30 శాతం జాగీర్దారుల చేతిలో, 10 శాతం భూమి ‘సర్ఫేఖాస్’ రూపంలో, మిగతా 60 శాతం భూములు ‘ఖల్సా’ భూములుగా ఉండేవి. ఈ ఖల్సా భూములు దేశ్‌‌ముఖ్‌‌, సర్‌‌దేశ్‌‌ముఖ్‌‌, భూస్వాముల చేతిలో ఉండేవి. వీళ్ల హయాంలో రైత్వారీ, దివాన్, జాగీర్దారీ విధానాలు అమల్లో ఉండేవి. 
జాగీర్దారీ వ్యవస్థలో రైతులపై ఎక్కువ దోపిడీ జరిగేది. జాగీర్దార్‌‌‌‌ల అరాచకాలకు అడ్డూ అదుపు ఉండేది కాదు. జాగీర్ భూములపై సివిల్ న్యాయవ్యవస్థకు ఏవిధమైన అధికారం ఉండేది కాదు. దాంతో జాగీర్దార్‌‌‌‌లు ఎక్కువ పన్నులతో రైతులను దోపిడీ చేసేవాళ్లు. ఇది నల్లగొండ, మహబూబ్‌‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా కనిపించేది. అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈ జిల్లాలు కేంద్రాలుగా ఉండేవి.

లెవీ

నిజాం పాలనలో రైతులకు ‘లెవీ’ విధానం అమలులో ఉండేది.  రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆహార కొరతను నివారించేందుకు నిజాం ప్రభుత్వం ‘లెవీ’ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో రెండు రకాలుండేవి. ‘గల్లా లెవీ’, ‘ఖుషి గల్లా’.  గల్లా లెవీ- విధానంలో రైతు ఒక ఎకరానికి 20 షేర్ల ధాన్యాన్ని పన్ను రూపంలో చెల్లించాలి. ఖుషి గల్లా విధానం ప్రకారం- రైతు తన ఇష్ట ప్రకారం ప్రభుత్వానికి ఎంతైనా ధాన్యం చెల్లించొచ్చు. వీటితో పాటు ఈ లెవీ విధానం ప్రకారం ధాన్యాన్ని నిల్వ చేసుకోకూడదు. రైతులు వాణిజ్య పంటలు పండించకూడదు. లెవీ విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులు తమ ఉత్పత్తులు అమ్మాలి. అప్పట్లో ఈ లెవీ విధానానికి వ్యతిరేకంగా పలు నిరసన ఉద్యమాలు జరిగాయి. సాయుధ పోరాటంలో రైతులు పాల్గొనడానికి లెవీ విధానం కూడా ఒక కారణం.

నాగువడ్డీ

నిజాం కాలంలో వడ్డీ వ్యాపారం ‘నాగువడ్డీ’ అనే లెక్క ప్రకారం జరిగేది. నాగువడ్డీ ప్రకారం తీసుకున్న అప్పు ఒక సంవత్సరంలో రెట్టింపు అవుతుంది.  రైతుల అవసరాలు, బలహీనతలను సాకుగా చేసుకొని అప్పటి భూస్వాములు ఇలా ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇచ్చేవాళ్లు. అప్పు తీర్చలేనప్పుడు బలవంతంగా వాళ్ల ఆస్తులు, భూములు జప్తు చేసుకునేవాళ్లు.ఈ అప్పు కేవలం డబ్బు రూపంలోనే కాదు, ధాన్యం రూపంలో కూడా ఉండేది. ఒక బస్తా ధాన్యాన్ని నాగు కింద తీసుకుపోతే, సంవత్సరం నాటికి మరో బస్తా అదనంగా కలిపి రెండు బస్తాల ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఈ రెండు బస్తాల ధాన్యానికి  మళ్లీ వడ్డీ కలిసేది. సగం ఇస్తే సగంనాగు అనేవాళ్లు. అసలుతో కలిపి అంతా ఇస్తే సరినాగు అనేవాళ్లు. ఈ విధానం ద్వారా  భూస్వాములు బాగా సంపాదించారు.  అప్పట్లో తిండి అవసరాల కోసం గతి లేక రైతులు నాగుపై ధాన్యాన్ని తీసుకెళ్లేవాళ్లు. పెరిగిన అప్పులు తీర్చలేక రైతులు ఉన్నవన్నీ అమ్ముకుని రోడ్డున పడేవాళ్లు. తర్వాతి కాలంలో  నాగువడ్డీని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ పోరాటంవైపు మొగ్గుచూపారు.

జోగిని

అప్పటి హైదరాబాద్​ స్టేట్​లో దళిత స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పల్లెల్లో చాలారకాల మూఢాచారాలు అమలులో ఉండేవి.  జోగిని, మాతంగి ఆచారాల పేరుతో అభం శుభం తెలియని అట్టడుగు వర్గాల అమ్మాయిల జీవితాలను పాడుచేసేవాళ్లు. దేవుడి పేరుతో అమ్మాయిలను ఆలయాలకు అప్పగించేవాళ్లు. కరువు కాటకాలు, మహమ్మారుల నుంచి రక్షించే దేవతలను ప్రసన్నం చేయడం కోసమంటూ మూఢనమ్మకాలతో బాలికల బతుకులను బలి చేసేవాళ్లు. నిస్సహాయులైన ఆ అమ్మాయిలు కఠిన నియమాల మధ్య కాలం గడిపేవాళ్లు.  పెండ్లి, కుటుంబం  లాంటివి ఉండేవి కావు. మహిళలను పరోక్షంగా వ్యభిచార వృత్తిలోకి దించే ఈ సంప్రదాయాలకు వ్యతిరేకంగా అప్పట్లో జరిగిన ఉద్యమాలు కూడా సాయుధ పోరాటానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

గస్తీ నిషాన్‌‌

నిజాం ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో  చైతన్యం కలిగించడానికి అప్పటి సమాజంలోని కొందరు కమ్యూనిస్టు నాయకులు స్కూళ్లు ఏర్పాటుచేశారు. వాటిల్లో రాజకీయాలు, సిద్ధాంతాలు బోధించేవాళ్లు. అయితే నిజాం ప్రభుత్వం ‘గస్తీ నిషాన్‌‌-53’ విధించి ప్రజల వాక్‌‌స్వాతంత్య్రాన్ని, పత్రికా స్వాతంత్య్రాన్ని అణగదొక్కింది. నారాయణగూడలోని ఆంధ్ర బాలికోన్నత పాఠశాలలో తెలుగు మీడియం ప్రారంభించినందుకు నిజాం ప్రభుత్వం ఆ పాఠశాలను నిషేధించింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు బోధిస్తున్నందుకు  యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసింది.

వివక్ష

వివక్షకు, అరాచకాలకు నిజాం పాలన పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా నిజాం పాలన చివరి దశలో రజాకారుల అరాచకాలకు అంతులేకుండా పోయింది.  రైతులు పండించిన  పంటలను వాళ్లకి దక్కనిచ్చేవాళ్లు కాదు.  మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్లు. ఉద్యమకారులను చిత్రహింసలు పెట్టేవాళ్లు. గోళ్ల కింద గుండుసూదులు గుచ్చేవాళ్లు. బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవాళ్లు. సిగరెట్లతో కాల్చేవాళ్లు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవాళ్లు. చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడం, కాగే నూనెలో వేళ్లు ముంచడం,  చెట్లకు కట్టేసి మంటలు పెట్టడం, వరసగా నిలబెట్టి తుపాకులతో కాల్చడం లాంటి శిక్షలు వేసేవాళ్లు. 

రైతుల నుంచి ధాన్యాన్ని బలవంతంగా లాక్కొనేవాళ్లు. ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే  పట్టించుకొనేవాళ్లు కాదు.  ప్రజలపై 90 రకాల పన్నులు విధించారు.  పన్నులు కట్టకపోతే ఊరి మీద పడి, రైతులు దాచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్లేవాళ్లు. ఈ దోపిడీని ఎదిరించినందుకు బైరాన్‌‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు. నిర్మల్‌‌లో వెయ్యిమందిని ఉరితీశారు.  నిజాం కాలంలో ఇలాంటి ఘోర సంఘటనలు లెక్కలేనన్ని. ఈ అక్రమ పాలనే.. తర్వాతి రోజుల్లో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. తెలంగాణ సమాజాన్ని సాయుధ పోరాటం వైపు నడిచేలా చేసింది.  

మన చరిత్ర

రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతంలో మనుషులు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. అప్పట్లో వేములపల్లి, ఏటూరు నాగారం, బాసర, బోథ్, హాలియా ప్రాంతాల్లో రాతియుగం ఆనవాళ్లు దొరికాయి. మన దేశం పదహారు మహాజనపదాలుగా ఉన్నప్పుడు సౌత్‌‌ ఇండియాలో ఉన్న ఏకైక జనపదం ‘అశ్మక’. ఇందులోనే తెలంగాణ కూడా ఉంది. పోదన్‌‌ (ఇప్పటి బోధన్‌‌) కేంద్రంగా అశ్మక పాలన సాగేది. ఆ తర్వాత మగధ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఆ తర్వాత అనేకమంది రాజులు పాలించారు. శాతవాహన, కాకతీయ, ముసునూరి నాయకులు, గోల్కొండ సుల్తానులు.. ఇలా అనేక మంది పాలన తర్వాత చివరకు నిజాం పాలనలోకి వచ్చాం. 1724లో నిజాం ఉల్-ముల్క్ హైదరాబాద్‌‌ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అతని వారసులు 1948 వరకు హైదరాబాద్‌‌ని పాలించారు.

పోలో పేరు ఎందుకంటే..

అప్పటి హైదరాబాద్‌‌లో దేశంలో ఎక్కడా లేనన్ని  పోలో గ్రౌండ్స్ ఉండేవి. అందుకే ఈ ఆపరేషన్‌‌కు ‘ఆపరేషన్ పోలో’ అని పేరు పెట్టారు. తర్వాతి కాలంలో ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్‌‌’‌‌గా మారింది. అయితే భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోని పోలో గ్రౌండ్స్‌‌ను ముందుగా తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల దానికి ‘ఆపరేషన్ పోలో’ అనే పేరు వచ్చిందన్న వాదన కూడా ఉంది. అయితే ఈ రెండు పేర్ల కంటే ‘హైదరాబాద్ పోలీస్ యాక్షన్’ పేరుతోనే ఈ ఆపరేషన్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కావాలనే ఈ ఆపరేషన్‌ను ‘పోలీస్‌ యాక్షన్‌’ అని ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా అధికారిక పత్రాల్లోనూ పేర్కొన్నారు. ‘సైనిక చర్య’ అంటే అంతర్జాతీయంగా దౌత్య సమస్యలు వస్తాయని, పోలీస్‌ చర్య అంటే పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారంగా భావిస్తారని వ్యూహాత్మకంగా అలా చేశారు.