కన్నెపల్లి కథ ఏమైంది? ..పంప్​హౌస్​లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి ఆరే

కన్నెపల్లి కథ ఏమైంది? ..పంప్​హౌస్​లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి ఆరే

 

  •     17 మోటర్లలో పనిచేస్తున్నవి ఆరే.. మిగిలిన 11 మోటార్ల పరిస్థితేంటో
  •     కొత్తయి బిగించారా? లేదా?
  • రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్​సంస్థా? సర్కారా? 
  •     అన్నీ అనుమానాలే 
  •     నేటికీ ప్రమాదంలోనే  కాళేశ్వరం పంప్​హౌస్​లు
  •     ఫోకస్​ పెట్టని కొత్త సర్కారు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి, అక్రమాలను బయటపెట్టిన రేవంత్​ సర్కారు అంతే కీలకమైన  కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ పై మాత్రం ఇంకా దృష్టిపెట్టలేదు. రెండేండ్ల కింద గోదావరి వరదలకు నీటమునిగిన ఈ పంప్​హౌస్​ తాజా పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలియడం లేదు. సర్కారు మారినప్పటికీ పంప్​హౌస్​ ముందు మేఘా కంపెనీ సెక్యురిటీ కొనసాగుతోంది. ఆ ప్రైవేట్​ సైన్యాన్ని దాటుకొని చీమ కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. వరదల్లో దెబ్బతిన్న 17 మోటార్లలో రిపేర్ల తర్వాత 6 మోటార్లు పనిచేస్తున్నట్లు అప్పట్లో చెప్పిన ఇంజినీర్లు, మిగతా 11 మోటార్ల పరిస్థితిపై నేటికీ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధానంగా ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ కూలి తుక్కుగా మారిన 6 మోటార్ల స్థానంలో ఆస్ట్రియా నుంచి కొత్త మోటర్లు తెప్పిస్తామని అప్పట్లో చెప్పిన ఆఫీసర్లు వాటిని తెప్పించి అమర్చారా? లేదా?  అన్నది తెలియదు. దీనిపై ఎవరిని ప్రశ్నించినా సమాధానం రావడం లేదు. ఇక పంప్​హౌస్​ మునగడం వల్ల  రిపేర్ల కోసం ఖర్చు చేసిన  సుమారు రూ.వెయ్యి కోట్లను భరించింది కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థనా? లేదంటే సర్కారా? అనే విషయాన్ని కూడా దాచిపెట్టారు. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌కు దిగువన పంప్‌‌‌‌హౌస్​, కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌ నిర్మించడం వల్లే నీటమునిగాయని ఎక్స్​పర్ట్స్​ తేల్చినందున ఇప్పుడున్న పంప్​హౌస్​లు ఎంతమాత్రం సురక్షితం కావని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​ల విషయంలో కొత్త సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. 

11 మోటార్ల పరిస్థితి చెప్పట్లే...

 జూలై 14, 2022న గోదావరి వరదల వల్ల అన్నారం, కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌హౌస్​లు నీటమునిగాయి. అన్నారంతో పోలిస్తే కన్నెపల్లిలో తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ మోటార్లకు రక్షణగా కట్టిన ప్రొటెక్షన్​ వాల్​ కూలి మోటార్లపై పడటంతో ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. కంట్రోల్‌‌‌‌ ప్యానెళ్లు, ఆటోమేటెడ్‌‌‌‌ అడ్వాన్సుడ్​ ఎయిర్​ ‌‌కండీషన్‌‌‌‌ సిస్టమ్స్​ దెబ్బతిన్నాయి. ‌‌పనులు చేపట్టిన మేఘా కంపెనీ ‌‌గోడను నాసిరకంగా నిర్మించడం వల్లే  కూలిపోయినట్లు ఇంజినీరింగ్‌‌‌‌ నిపుణులు తేల్చి చెప్పారు. ఏడాది ముందే హెడ్‌‌ ‌‌రెగ్యులరేటర్‌‌‌‌ దగ్గర గేట్ల లీకేజీలు , కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ వద్ద ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ స్ట్రాంగ్​గా లేదని హయ్యర్‌‌‌‌ అఫిషియల్స్‌‌‌‌ హెచ్చరించినా కాంట్రాక్ట్​ సంస్థగానీ, రాష్ట్ర సర్కారుగానీ పట్టించుకోలేదు.  ఫలితంగా భారీ నష్టం జరిగింది. ‌‌డీ వాటరింగ్​ తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలతో ప్రొటెక్షన్​ వాల్​ నిర్మించారు. వివిధ దేశాల నుంచి ఇంజినీర్లను పిలిపించి రిపేర్లు చేయించారనే వార్తలొచ్చాయి. ఆరు నెలల తర్వాత 2022 డిసెంబర్‌‌‌‌లో  6 మోటార్లతో ట్రయల్ ​రన్​ చేశారు. వారం పది రోజులు వాటర్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ చేసి బంద్‌‌‌‌ పెట్టారు.  మిగతా 11 మోటార్ల పరిస్థితి ఏమిటో ఇప్పటివరకు ఇరిగేషన్‌‌‌‌ ఇంజినీర్లు ప్రకటించలేదు. ఏడాది కాలంగా కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ ఒక్క మోటార్‌‌‌‌ కూడా నడిపించలేదు. 

 రిపేర్ల ఖర్చు భరించిందెవరు?

కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి కోట్ల దాకా ఖర్చు చేశారు. ఖరాబైన 17 మోటార్లలో 11 మోటార్లను రిపేర్‌‌‌‌ చేసి అమర్చినట్లు ఇంజినీర్లు ప్రకటించారు. ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ మీదపడి పనికిరాకుండా పోయిన 6 మోటర్ల కోసం కొత్తగా ఆర్డర్ ఇచ్చామని, ఆస్ట్రియా నుంచి రాగానే బిగిస్తామని చెప్పారు. ఇందుకోసం  రూ.400 కోట్ల వరకు వెచ్చించారు. కొత్త మోటార్ల కొనుగోలుతోపాటు రిపేర్‌‌ ‌‌ఖర్చులన్నింటినీ మేఘా కంపెనీయే భరిస్తుందని అప్పటి రాష్ట్ర సర్కారు ప్రకటించింది. కానీ, ఇది నాన్‌‌‌‌ ఈపీసీ వర్క్‌‌‌‌ కావడం, పంప్‌‌‌‌హౌస్​ ప్రారంభించి అప్పటికే రెండేండ్లు గడిచిపోవడంతో కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థకు బదులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చంతా  భరించిందని,  ఈ విషయంలో అప్పటి సర్కారు పెద్దలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని కొందరు ఇంజినీర్లు లీకులిచ్చారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. కానీ, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్​ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కన్నెపల్లి పంప్​హౌస్ ​రిపేర్లకు సంబంధించిన బిల్లులు సెక్రెటేరియట్​లో పెండింగ్​లో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు.

పంప్​హౌస్​లు ఇంకా ప్రమాదంలోనే.. 

ఎఫ్​ఆర్​ఎల్​(ఫుల్​ రిజర్వాయర్​ లెవెల్​) కంటే ఎక్కువ ఎత్తులో కట్టాల్సిన పంప్​హౌస్​లను తక్కువ ఎత్తులో కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు నీటమునిగాయని బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అన్నారం పంప్​హౌస్​ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో.. కన్నెపల్లి పంప్​హౌస్​ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే  120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీని వల్ల ఈ రెండు పంప్​హౌస్​లు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. గోదావరికి మళ్లీ భారీ వరదలు వస్తే మరోసారి నీటమునిగి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పంప్​హౌస్​లను ఇప్పుడున్న ప్లేస్​ నుంచి పైకి షిఫ్ట్​ చేయడమే మేలని ఇంజినీరింగ్​ ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్​ ఎంక్వైరీ చేయించిన కాంగ్రెస్​ సర్కారు, కన్నెపల్లి పంప్​హౌస్​పైనా ఎంక్వైరీ చేయించి, అవసరమైన చర్యలు చేపట్టాలని, అంతకన్నా ముందు పంప్​హౌస్​ తాజా పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించాలని కోరుతున్నారు.