గద్వాల మెడికల్ కాలేజీ ఏమాయె?

గద్వాల మెడికల్  కాలేజీ ఏమాయె?

గద్వాల, వెలుగు: జీవో లేదు.. ప్రభుత్వ సర్క్యులర్ లేదు.. అయినా జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్రు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హెల్త్ మినిస్టర్  హరీశ్​రావు జిల్లాకు మెడికల్  కాలేజీ ఇచ్చామంటూ ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 6న నాగర్ కర్నూల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ గద్వాలకు మెడికల్ కాలేజీ ఇచ్చామని చెప్పారు. దీంతో ఆల్​ పార్టీ లీడర్లు మెడికల్ కాలేజీ ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభించాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి, బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంలకు వినతి పత్రాలు ఇవ్వడం కలకలం రేపుతోంది.

మెడికల్  కాలేజీ కావాలని ధర్నాలు..

వనపర్తి జిల్లాకు మెడికల్  కాలేజీ ఇచ్చి గద్వాల జిల్లాకు ఇవ్వకపోవడంతో ఆల్​పార్టీ లీడర్లు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. కలెక్టరేట్  ముట్టడించి మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వం జిల్లాకు మెడికల్  కాలేజీ మంజూరు చేయలేదు. నర్సింగ్ కాలేజీని మంజూరు చేసి, ఆ తర్వాత మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పింది. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ఊసే లేదు. కానీ సీఎం, కేటీఆర్, హరీశ్​రావు మెడికల్  కాలేజీ ఇచ్చామని ప్రకటించడం జిల్లావాసులను అయోమయానికి గురి చేస్తోంది.

ఈ ఏడాది నుంచి క్లాసులు స్టార్ట్​ చేయాలి..

నాగర్ కర్నూల్ బహిరంగ సభలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చామని సీఎం చెప్పడంతో ఈ ఏడాది నుంచి క్లాసులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ వల్లూరు క్రాంతి, గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంలకు ఆల్​పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. గతంలో కూడా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చామని చెప్పినప్పటికీ గద్వాలకు మాత్రం ఇవ్వలేదని, ఆ తర్వాత ఏం మాట్లాడడం లేదని అంటున్నారు. సీఎం చెప్పిన మాటపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్  చేశారు.

జీవోలు ఏవి?

జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తే ఈ ఏడాది క్లాసులు మొదలుపెట్టాలి. మెడికల్ కాలేజీ కావాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పుడు స్పందించని ప్రభుత్వం, మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాలేజీ మంజూరు చేసినట్టు జీవోలు, సర్క్యులర్  ఎక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్  బిల్డింగ్​ అనువుగా ఉంటుంది. 

మధుసూదన్ బాబు, జేఏసీ రాష్ట్ర నాయకుడు