
యావత్ దేశ ప్రజలు దాదాపు 15 రోజులుగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక ప్రజలను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన టెర్రరిస్టు మూకలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న వాళ్ల కల నెరవేరింది. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ రివేంజ్ తీర్చుకుంది. 2025, మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించింది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ ఎటాక్‌లో లష్కరే తోయిబా, జైషీ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు ప్రభుత్వం హిందు సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సిందూర్ అనే పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడం వెనక బలమైన కారణాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే భారత్ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం టూరిస్ట్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయక టూరిస్టులను పాశవికంగా కాల్చి చంపారు. చంపడమే కాకుండా మతం అడిగి మరీ.. ఒక్క హిందు మతానికి చెందిన వారినే టార్గెట్‌గా కాల్చి చంపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారిలో నేవీ అధికారి వినయ్, శుభం ద్వివేది అనే నవ వరులు కూడా ఉన్నారు. దాడి సమయానికి నేవీ ఆఫీసర్ వినయ్ పెళ్లి జరిగి ఐదు రోజులే.
సరదాగా భార్యతో కలిసి ప్రకృతి అందాలకు నిలయమైన పహల్గాంకు వచ్చారు. అనుకోని విధంగా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు వినయ్. కాళ్ల పసుపు పారాణి కూడా ఆరాకముందే.. జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త విగతజీవిగా మారడంతో ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఈ ఫొటో చూసి యావత్ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగే ఈ టెర్రర్ అటాక్‌లో హిందూత్వాన్ని టార్గెట్ చేసి.. మతం అడిగి మరీ చంపారు. దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ టార్గెట్ హిందువులనే హత్య చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఉగ్రమూకలకు కూడా అదే విధంగా బదులివ్వాలని నిర్ణయించింది. నవ వధువుల నుదట సిందూర్ తుడిచేయడంతో పాటు హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో.. హిందు మహిళలు అత్యంత పవిత్రంగా భావించే సిందూర్ పేరుతో భారత్ ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే సిందూర్ పేరుతో దాడులు చేయడంతో ఉగ్రవాదుల వైఖరికి జవాబుగా హిందూత్వ ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు టాక్.
భారతదేశం ఈ ఆపరేషన్‌కు 'సిందూర్' అని పేరు పెట్టారని తెలియడంతో పహల్గాం టెర్రర్ ఎటాక్‌లో తన భర్త శుభం ద్వివేదిని కోల్పోయిన ఐశాన్య ద్వివేది బోరున విలపించింది. భారత ప్రభుత్వం మాతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉందని ఆమె అన్నారు. మొత్తానికి భారత దాడుల తర్వాత సిందూర్ వర్డ్ ట్రెండింగ్ లోకి రావడంతో దీని చరిత్ర, ప్రాముఖ్యతపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరీ హిందూ సంప్రదాయంలో సిందూర్ కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకుందాం.
సిందూర్ అనేది హిందీ పదం. సింధూరం.. హిందూ సంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. స్ర్కీ నుదుట దిద్దే ఈ సింధూరానికి.. వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా పరిగణింపబడుతుంది. వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన ఈ సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. జుట్టుకు, నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో సింధూర్ పూసే ఈ వేడుకను సింధూర్ డాన్ అని కూడా పిలుస్తారు.
ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మేష రాశికి అధిపతి అంగారకుడు. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదమని నమ్ముతారు. ఎర్రటి సిందూర్ నుదుటిపైన ధరించడానికి మరొక కారణమేమిటంటే.. స్త్రీ సౌభాగ్యంగా, శక్తితో ఉంటుందని.. వీటికి చిహ్నంగా పెడతారని శాస్త్రం వివరిస్తోంది.
పురణాల ప్రకారం
పురాణాల ప్రకారం, శివుని భార్య అయిన పార్వతి తన భర్త పట్ల తనకున్న భక్తి, వాత్సల్యానికి చిహ్నంగా నుదుటిపై సింధూరాన్ని ధరించేది. సింధూరం శివునికి ఇష్టమైనదని, నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు సుదీర్ఘమైన, ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారని ఆమె నమ్మేది. అంతే కాదు వధువు నుదుటిపై సింధూరం పెట్టడం కూడా పుణ్యఫలంగా పరిగణించబడుతుంది. ఇది జంటకు అదృష్టాన్ని, శ్రేయస్సును ఇస్తుందని, దుష్ట ఆత్మలను నివారించి, జంటను హాని నుండి కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు. అందువల్ల సిందూర్ ధరించడాన్ని ప్రేమ, భక్తికి చిహ్నంగా మాత్రమే కాకుండా నూతన వధూవరులకు భద్రత, ఆశీర్వాదాలను అందిస్తుందన్నమాట.
అందానికి..
చాలా మంది భారతీయ స్త్రీలు అందం కోసం సింధూరంను ధరిస్తూ ఉంటారు. వివాహితలు తమ భర్తల హృదయాలను గెలుచుకోవడానికి, అందంగా ఉండేందుకు కూడా ధరిస్తారని కొందరి అభిప్రాయం. అగ్ని, రక్తం.. లాంటివి ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి సింధూరాన్ని శక్తిగా పరిగణిస్తారు. దీని వల్ల ఆమెకు గౌరవం, శక్తి వస్తాయని పలు పురాణాలు వెల్లడిస్తున్నాయి.