IPL 2024: స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏమిటి? లక్షల్లో జరిమానా ఎందుకు..?

IPL 2024: స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏమిటి? లక్షల్లో జరిమానా ఎందుకు..?

బీసీసీఐ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ.. ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. జట్లు 20 ఓవర్లు పూర్తి చేయడానికి 90 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నందున, మ్యాచ్‌లు అర్థరాత్రి వరకు జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికే బీసీసీఐ.. స్లో ఓవర్ రేట్ పెనాల్టీని తీసుకొచ్చింది.

ఇప్పటికే ఇద్దరు కెప్టెన్ల( శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్)పై బీసీసీఐ.. కొరడా ఝుళిపించింది. తొలిసారి కనుక రూ. 12 లక్షల చొప్పున జరిమానా విధించింది. దీంతో అభిమానులు.. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏమిటి? ఇంత పెద్ద మొత్తంలో జరిమానా ఎందుకు విధిస్తున్నారు..? అని శోధిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం, జట్లు తమ 20 ఓవర్లను 90 నిమిషాలలోపు రెండు వ్యూహాత్మక టైమ్-అవుట్‌లతో సహా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, DRS తీసుకున్న సమయం, గాయం, సడన్ డ్రింక్స్ బ్రేక్ సమయాన్ని ఈ గంటన్నర నుంచి మినహాయిస్తారు. అయినప్పటికీ, ఒక జట్టు తమ 20 ఓవర్లను నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేయకపోతే, అప్పుడు జరిమానా విధిస్తారు.

మొదటిసారి రూ.12 లక్షలు

జట్టు మొదటిసారి స్లో ఓవర్ రేట్ సమస్యను ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్ మాత్రమే రూ.12 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఆటగాళ్ళకు జరిమానా విధించరు. 

రెండోసారి రూ.24 లక్షలు

ఒక సీజన్‌లో ఒక జట్టు రెండోసారి స్లో ఓవర్ రేట్ రిపీట్ చేస్తే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ. 24 లక్షలు మరియు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షల చొప్పున జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది విధిస్తారు.

మూడోసారి రూ.30 లక్షలు, నిషేధం

ఒక సీజన్‌లో జట్టు మూడోసారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా సహా ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అదనంగా, జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 12 లక్షల చొప్పున జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 50%, ఏది తక్కువైతే అది విధిస్తారు.

ALSO READ :- IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ వాయిదా..కారణం ఏంటంటే..?