ఆర్ఎస్ఎస్చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల వ్యూహం ఏమిటి?

 ఆర్ఎస్ఎస్చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల వ్యూహం ఏమిటి?

ఏ దేశానికైనా జనాభా ఒకశక్తి,  అదే సమయంలో సవాలు కూడా. దాన్ని ఎలా అధిగమిస్తామో, ఎలా మలచుకుంటామో, ఏ దిశలో అవకాశాలు కల్పిస్తామో దానిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సహజమైన అంశాన్ని మతరంగులోకి లాగి, రాజకీయ అజెండాగా మలచడం ప్రమాదకరం. ఇటీవల ఆర్​ఎస్​ఎస్​  అధినేత  మోహన్ భగవత్ చేసిన 'ప్రతి జంట తప్పనిసరిగా ముగ్గురు పిల్లల్ని కనాలి' అనే వ్యాఖ్యలు ఈ ప్రమాదకర వ్యూహాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

 అసలు, ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది దంపతుల వ్యక్తిగత నిర్ణయం. అది మహిళ ఆరోగ్యం, కుటుంబ ఆర్థికస్థితి,  భవిష్యత్తు కలలతో ముడిపడి ఉంటుంది. కానీ, ఒక మతవాద సంస్థ అధినేత ఈ విషయంలో నియమాలు చెప్పడం వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే. ఇటువంటి సూచనలు పౌరుల హక్కులపై అనవసర జోక్యంగా పరిగణిస్తారు.  ఇది సమానత్వానికి విరుద్ధం. సమాజం ముందుకు సాగాలంటే మహిళల స్వతంత్ర నిర్ణయ హక్కే మూలం కావాలి. 

చారిత్రక నేపథ్యం

భారత్‌లో జనాభా చర్చ కొత్తది కాదు. 1950–- 60 దశకాల్లో  దేశ స్వాతంత్ర్యం తర్వాత  'జనాభా విస్ఫోటనం' పెద్ద సవాలుగా చర్చలోకొచ్చింది. అప్పటి నుంచే  కుటుంబ నియంత్రణ పథకాలు ప్రారంభమయ్యాయి. 1970లలో భారతదేశం జనాభా నియంత్రణ అంశాన్ని జాతీయ ప్రాధాన్యంగా తీసుకుంది.  ఆ కార్యక్రమం అత్యంత దారుణ రూపం దాల్చింది ఎమర్జెన్సీ (1975– 77) కాలంలో ఆ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పటికీ,  కుటుంబ నియంత్రణ పేరుతో బలవంతపు శస్త్రచికిత్సలు జరగడానికి ప్రధాన కారణం ఆమె కుమారుడు సంజయ్ గాంధీ.  అతని ఆధ్వర్యంలో లక్ష్యాలు విధించి, పోలీసు అధికారుల ఒత్తిడితో పేదలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు గురయ్యారు. ఈ చర్యల వలన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి చెలరేగి 1977 ఎన్నికల్లో ఘోర పరాభవానికి దారితీసింది. ఆ అనుభవం తర్వాత ప్రభుత్వం స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ దిశలో నడిచింది. ఈ క్రమంలో విద్యావకాశాలు, ఆరోగ్య చైతన్యం పెరగడం వల్ల జనాభా వృద్ధి సహజంగానే తగ్గడం ప్రారంభమైంది.

గణాంకాల వాస్తవం వేరు

ఆర్​ఎస్ఎస్​ తరహా సంస్థలు ఈ చర్చను ఎప్పుడూ మతపరమైన దృక్కోణంలోకి లాగుతుంటాయి. ముస్లిం సమాజంపై, 'వారు ఎక్కువ పిల్లలు 
కంటున్నారు, మెజారిటీని అధిగమిస్తున్నారు' అనే భయాన్ని రేకెత్తించే ప్రయత్నం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ గణాంకాలు చెబుతున్న వాస్తవం వేరే ఉంది. ముస్లిం సమాజంలో కూడా విద్య, నగరీకరణ పెరుగుతున్నకొద్దీ కుటుంబ పరిమాణం తగ్గుతూ వచ్చింది.  ఇటీవలి  ఉదయ్‌పూర్‌లో 55 ఏళ్ల రేఖా కాల్బేలియా అనే హిందూ మహిళ తన 17వ సంతానానికి జన్మనివ్వడం జాతీయ మాధ్యమాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ ఘటన స్పష్టంగా చూపుతున్నది ఏమిటంటే, జనాభా పెరుగుదలని ఎప్పుడూ ముస్లింలకే పరిమితం చేసి చూపించడం ఒక అజెండా తప్ప వాస్తవం కాదు. అధిక సంతానం అనేది ఒక మతానికి సంబంధించిన సమస్య కాదు.  పేదరికం, అక్షరాస్యత లోపం, 
వెనుకబాటు,  సామాజిక పరిస్థితులు, అవకాశాల కొరతలతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సమస్య.  భగవత్ తాజా వ్యాఖ్యలు ఆ పాత 
వ్యూహానికి కొత్త ముసుగు మాత్రమే.

రాజకీయ వ్యూహం

భగవత్ వ్యాఖ్యల అసలు ఉద్దేశ్యం ఎన్నికల లెక్కలు. మతంరంగులో జనాభా చర్చను ప్రేరేపించడం ద్వారా మెజారిటీ వర్గాన్ని ఒకే రాజకీయ చట్రం చుట్టూ ఏకీకృతం చేయడమే లక్ష్యం. ఒకవైపు మైనారిటీలను నిందించడం, మరోవైపు మెజారిటీ వర్గాలను మరింతమంది పిల్లలు కనమని ప్రేరేపించడం  ద్వంద్వ వైఖరి. దీని ద్వారా సమాజంలో విభజన రేఖలను మరింత విస్తృతం చేయడం జరుగుతోంది.  ఇది  కేవలం సామాజిక నియమం సూచించడమే కాదు,  ఒక దీర్ఘకాలిక రాజకీయ లెక్క. ఎందుకంటే ఆర్​ఎస్​ఎస్​ ఎప్పటినుంచో 'హిందూ సమాజం సంఖ్యలో బలహీనపడుతోంది'  అనే భావనను వ్యాప్తి చేస్తూ వచ్చింది. ఈ వాదనను ఎన్నికల సమయంలో ఉపయోగించడం బీజేపీ, ఆర్ఎస్ఎస్  తరహా శక్తులకు లాభదాయకం అవుతోంది. 

అసలు సమస్యలను దాచడం

భారతదేశం ప్రస్తుతం నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, అసమానత వంటి తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. యువతలో నిరుద్యోగం చరిత్రలోనే  అత్యధిక స్థాయికి చేరింది. ఆరోగ్య రంగంలో లోపాలు,  విద్యలో అసమానతలు పెరుగుతున్నాయి.  ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపలేని ప్రభుత్వం, తన అనుబంధ సంస్థల ద్వారా ప్రజల దృష్టిని మరల్చడానికి 'జనాభా' అనే నినాదాన్ని  ముందుకు తెస్తోంది. కానీ, గణాంకాలు చెబుతున్నదేమిటంటే, భారతదేశంలో జనాభా వృద్ధిరేటు సహజంగానే తగ్గుతోంది. 1990లో ప్రతి మహిళకు సగటు 3.4 పిల్లలు ఉండగా, ఇప్పుడు అది 2.0 కంటే తక్కువకు పడిపోయింది. అంటే కుటుంబాలు స్వయంగా చిన్నవవుతున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి 'ముగ్గురు పిల్లలు తప్పనిసరి' అని చెప్పడం శాస్త్రీయ ఆధారం లేని వాదన. ఇది వాస్తవానికి పాత అజెండాకు కొత్త ముసుగు మాత్రమే.

దేశ ప్రయోజనం ఏమిటి?

జనాభా అంశాన్ని మతరంగులోకి లాగడం దేశ ప్రయోజనాలకు విరుద్ధం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అనుమానం పెంచుతాయి,  విభజనకు బలం చేకూరుస్తాయి, ఐక్యతను బలహీనపరుస్తాయి. నిజానికి దేశాన్ని ముందుకు నడిపించేది మతోన్మాదపు నినాదాలు కావు.   సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, మానవ విలువలే ఒక సమాజానికి పునాది.  ఇప్పుడు దేశానికి అవసరమైంది పిల్లల సంఖ్యపై రగడ కాదు. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించడం.  వారికి నాణ్యమైన విద్య,  మెరుగైన ఆరోగ్యం,  స్థిరమైన ఉపాధి అవకాశాలు అందించడం. అదే నిజమైన దేశభక్తి.

- యండి. 
ఉస్మాన్ ఖాన్, 
సీనియర్ జర్నలిస్ట్​