
పాకిస్తాన్, ఇండియా యుద్ధాన్ని ఆపించానని ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నాడు. ఇరుదేశాల నాయకుల చెవుల్లో అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పాడో కానీ.. యుద్ధ సన్నివేశంలో ట్రంప్ కార్డుతో అర్ధంతరంగా కాల్పుల విరమణ పాటించడానికి ఒప్పుకున్నారు. ఈమేరకు ఇరుదేశాల సైనిక అధికారులు హాట్లైన్లో చర్చించి కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే, ఈ యుద్ధ విరమణ క్రమంలో ట్రంప్ ఇరువురి నాయకులతో ఎలా అదిరించి, బెదిరించి ఒప్పించగలిగాడో చెప్పుకున్నాడు. ఇప్పుడు దేశంలో అసలు అమెరికా అధ్యక్షుడు మన ప్రధానితో ఏం మాట్లాడాడు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశమైంది.
దేశంలో దీనిపై మేధావులు, రాజకీయ నాయకుల అనేక ప్రశ్నలు, అభిప్రాయాలు పెల్లుబుకడంతో.. మన ప్రధాని మోదీ ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మీద వివాదాలపైన ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని, జోక్యాన్ని అంగీకరించబోమని చెప్పాడు. ఇది కొంచెం గుడ్డిలో మెల్ల నయమన్నట్టు ప్రధాని అడుగులు వేస్తున్నాడు. కానీ, ప్రతిపక్ష నాయకులు, ఇతరులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. శత్రుదేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి యుద్ధం గురించి దీటుగా హమ్ కిసిసే కమ్ నహీ హై అన్నట్టు ప్రతిస్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకానేక ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తించి ప్రజలు చర్చించుకునేలా ఒక వాతావరణమైతే ఏర్పడింది.
అమెరికా డబుల్ గేమ్
ఒకవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ద్వారా వంద మిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్తాన్ కు ఇప్పించడంలో అమెరికా పరోక్షంగా సహాయం చేసింది. మరోవైపు ఇండియాకు తీవ్రవాదంపై పోరుకు సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలియజేసింది. ఇది ఇలా ఉండగా మధ్యలో అమెరికా ఛానల్ సిఎన్ఎన్ ద్వారా పాకిస్తాన్ ఇండియాకు చెందిన రాఫెల్ యుద్ద విమానాన్ని కూల్చివేసిందనే వార్తను టెలికాస్ట్ చేసింది. తత్ఫలితంగా ప్రాన్స్ దేశం వద్ద కొనుగోలు చేసిన రాఫెల్ విమానం తయారీ, నాణ్యతల పట్ల అనేక శంకలు రేకెత్తాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. దీనికి సమాంతరంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, విమానాలు లక్ష్యాలను ఛేదించకముందే నిర్వీర్యరింపరిచి మన దేశం పైచేయి సాధించింది. అంతేగాక పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశాయి. మన సైన్యం అత్యాధునిక యుద్ధ నైపుణ్య పరికరాలతో శత్రుదేశం ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని ఆయా ప్రాంతాలని విధ్వంసం చేసి పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పడమే కాకుండా తగిన మూల్యం చెల్లించుకునేలా చేసింది. తద్వారా చైనా పాకిస్తాన్‌కు సరఫరా చేసిన యుద్ధ సామగ్రి పట్ల కొంతమేరకు అనుమానాలు ఏర్పడ్డాయి.
అమెరికా జోక్యంపై చర్చోపచర్చలు
అమెరికా వార్తా సంస్థ సిఎన్ఎన్ ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ విమానాల తయారీపైనా, మరోవైపు చైనా సరఫరా చేసే యుద్ధ పరికరాలపైన శంకలు కలిగేలా ఒక అననుకూల వాతావరణం ఏర్పడడానికి ఈ యుద్ధాన్ని ఆసరా చేసుకుని అమెరికా ద్వంద్వ ప్రమాణాలతో దౌత్యం విజయవంతంగా నెరపింది. మొత్తానికి తెర వెనుక ఏ గూఢచారి వ్యవస్థ ఏ వార్తని అగ్రరాజ్యానికి చేరవేసిందో కానీ అమెరికా అధ్యక్షుడు తన ట్విట్టర్ ద్వారా ముందే చెప్పినట్టు, ఆ తర్వాత ఆయన యంత్రాంగం వివరించినట్టు.. ఇరుదేశాల అగ్ర నాయకుల చెవులలో ఏం రహస్యం చెప్పినారో కానీ తమ తమ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఎలాంటి షరతులు విధించకుండా అంగీకరించారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది. మన దేశప్రధాని పైకి గంభీరంగా మూడో దేశం మధ్యవర్తిత్వం లేదంటూ చెప్తూనే అమెరికా జోక్యంతో యుద్ధంలో కాల్పుల విరమణ జరిగేలా చూశారు. ఏర్పడిన పరిస్థితులపైన దేశ ప్రజలు అనేక ప్రశ్నలు, అభిప్రాయాలను తమకు అందుబాటులో ఉన్న వేదికల ద్వారా చర్చించుకునేలా చేశారు. మోదీ దేశ ప్రజలకు పలు అనుమానాలు నివృత్తి అయ్యేలా మాటలు ద్వారా చేతల ద్వారా తెలియజేస్తున్నాడు. అమెరికా ఈ దేశాలతో తాము నెరిపే వ్యాపార లావాదేవీలను ఆపివేస్తామని హెచ్చరించి కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించేలా చేశామని చెప్పుకుంటుంది.
అల్ఫ్రెడ్ నోబెల్‌నే మోసగించిన అమెరికా
ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ అణు బెదిరింపులకు భయపడేది లేదని, ఇకముందు ఉగ్రవాదులు చేసే ప్రతి సంఘటనలను యుద్ధచర్యగా భావిస్తామని దేశవాసులకు, శత్రుదేశానికి తగు రీతిన సమాధానం హెచ్చరిక రూపంలో చెప్పాడు. అయినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా వైఖరి గురించి జరిగిన ఒక సంఘటనను ఇక్కడ ఈ సందర్భంలో మీతో పంచుకోవాలి. జర్మనీ వద్ద అణుబాంబు ఉందనే నెపంతో అమెరికాలో అణుతయారీకి తగు సాంకేతిక సహాయం చేశాడు అల్ఫ్రెడ్ నోబెల్. అనంతరం జర్మనీ వద్ద అటువంటి మారణాయుధం ఏదీ లేదని తెలిసిపోయింది. ఆ పిదపనే ఆయన అమెరికాను అణుబాంబు ఉత్పత్తి ఆపివేయాలని కోరాడు. కానీ అమెరికా అప్పటికే అణుబాంబులు తయారుచేసి జపాన్ పైన వేసి కనీవినీ ఎరుగని మానవ వినాశనానికి కారణమైనది.
అప్పుడు నోబెల్.. అమెరికా నాయకులతో ఈ విషయం ప్రస్తావిస్తే, ఆయనకు మేం అణుబాంబులు ఉత్పత్తి చేయగలగడమే కాదు, యుద్ధాలను కూడా ఉత్పత్తి చేయగలం అని చెప్పారు. అనంతరం తన జీవితకాలంలోనే మానవాళి మేలుకోసం కనుగొన్న డైనమైట్ మూల సాంకేతిక పరిజ్ఞానం పక్కదారి పట్టి మానవ హననానికి ఉపయోగపడడం వలన చాలా మదనపడ్డాడు.
అమెరికా అప్పుడూ ఇప్పుడూ ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ప్రతి సంక్షోభం, సంఘటనను ఇదే డబుల్ స్టాండర్డ్ రాజకీయ నిర్ణయాలు ముఖ్యంగా తన వ్యాపార ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యతగా ఉపయోగించుకోవడం పరిపాటిగా జరుగుతున్నది. అందువలన, ఆయుధ బేహారీ ట్రంప్ రెండు దేశాల అధినేతల చెవులలో చెప్పిన దేవ రహస్యం ఏమిటో ఓ మహాత్మా! ఓ మహర్షీ! నీకే తెలియాలి. ఈ అనుమానాలను నువ్వైనా నివృత్తి చేయి తండ్రీ!
- జూకంటి జగన్నాథం, కవి, రచయిత–