మండు వేసవిలో విధ్వంసకర వరదలు.. ఇంఫాల్ లో ఎందుకీ దుస్థితీ?

మండు వేసవిలో విధ్వంసకర వరదలు.. ఇంఫాల్ లో  ఎందుకీ దుస్థితీ?

ఇంఫాల్..మణిపూర్ రాజధాని.. ఇప్పుడీ నగరం వరదలతో ముంచెత్తబడింది. భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు ఇంఫాల్ ను నిండా ముంచాయి. వేలాది మం ది ప్రజలు నిలువ నీడ లేకుండా చేశాయి. కొంతమంది ప్రాణాలో కోల్పోయారు.. మరికొంత మంది గల్లంతయ్యారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంఫాల్  నది పొంగిపొర్లడంతో ఇండ్లు కొట్టుకుపోయి ఇంఫాల్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచు కోవాల్సిన పరిస్థితి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని 86 ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నంబుల్ నది ఒడ్డున ఉండటంతో ఈ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయ స్థితికి చేరింది. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది.. ఎందుకు మండు వేసవిలో కూడా ఇంఫాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి?

ప్రాణనష్టం

వరదల కారణంగా ఇంఫాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. వారి జీవనాధారం పోయింది. వరదల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంఫాల్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వరద నీటినుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 

తీరని ఆస్తినష్టం

వరదలతో ఇంఫాల్ నగరంలో చాలా నష్టం జరిగింది. వేలాది ఇళ్లు, ప్రభుత్వం, ప్రైవేట్ ఆఫీసులు నీటమునిగాయి. వరదలతో  నగరంలో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్డు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం మానవ జీవనమే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

రెమాల్ తుఫాన్

ఈ ఊహించని విపత్తు వెనక రెమాల్ తుఫాన్ ప్రధాన కారణం. ఈ తుఫాను ఫలితంగా అధిక వర్షపాతం.. ఇంఫాల్, నంబుల్ నదులలో నీటిమట్టాలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ నదులు పొంగి ప్రవహించడంతో ఇంఫాల్ నగరంలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. తీవ్ర నష్టాన్ని చూడాల్సి వచ్చింది. 

సహాయక చర్యలు 

ఇంఫాల్ లో విపత్తుపై సైన్యం, అస్సాం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)  భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. వరద బాధితులకు కావాల్సిన సాయం చేస్తున్నాయి. మరో వైపు ఇళ్లు కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు మణిపూర్ ప్రభుత్వం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. 

ఈ ఆకస్మిక వరదలు మొత్తం రెండు లక్షల మంది మణిపూర్ ప్రజలను నిరాశ్రయులను చేశాయని, కనీసం 25వేల ఇండ్లు దెబ్బతిన్నాయని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. నది ఒడ్డున ఉన్న కట్టలు తెగిపోవడంతో తీవ్రమైన వరదలు సంభవించాయని తెలిపింది. శుక్రవారం (మే31) అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది.