లెటర్‌‌లోని అంశాలు క్రూరంగా ఉన్నాయి: ఏకే ఆంటోనీ

లెటర్‌‌లోని అంశాలు క్రూరంగా ఉన్నాయి: ఏకే ఆంటోనీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి సవాల్ విసరడానికి కొత్త నాయకత్వం కావాలని 23 మంది సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీ బలహీన పడుతోందని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి నాయకత్వ మార్పు అవసమని సదరు లెటర్‌‌లో నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి రెస్పాన్స్‌గా పార్టీ కొత్త చీఫ్​ను సదరు నేతలే కనుగొనాలని, తాను చీఫ్‌ పదవి నుంచి తప్పుకోవడానకి సిద్ధంగా ఉన్నానని సోనియా చెప్పారని సమాచారం. ఇది కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. సోనియాకు లెటర్‌‌ పంపడంపై పలువురు సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

ఇది సరైన సమయమా?: రాహుల్
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ పోరాడుతున్న కీలక తరుణంలో లెటర్ పంపడమేంటని రాహుల్‌ సదరు నేతలపై ప్రశ్నించారని తెలిసింది. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తూ, త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని నాయకత్వం నుంచి తప్పుకోమనడం సబబు కాదని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కామెంట్ చేశారు.

ఆ లెటర్ దురదృష్టకరం: మన్మోహన్
సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్‌లో సోనియాతో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ సంభాషించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియానే కొనసాగాలని మన్మోహన్ కోరారని తెలిసింది. ‘లెటర్ పంపడం దురదృష్టకరం. హైకమాండ్‌ను బలహీనపరిస్తే కాంగ్రెస్‌ను బలహీనపర్చినట్లే’ అని ఆ మీటింగ్‌లో మన్మోహన్ పేర్కొన్నట్లు సమాచారం. ఆ లెటర్ కంటే కూడా అందులోని అంశాలు క్రూరంగా ఉన్నాయని సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ అన్నట్లు తెలిసింది. సోనియా త్యాగాలను గురించి కూడా చర్చించిన ఆంటోనీ.. పార్టీ బాధ్యతలను తీసుకోవాల్సిందిగా రాహుల్‌ను కోరారని విశ్వసనీయ సమాచారం.