లాంగ్ కోవిడ్ ఉంటే ఏం చేయాలె.!

లాంగ్ కోవిడ్ ఉంటే ఏం చేయాలె.!

‘వ్యాక్సిన్​ వేసుకున్నాం. ఇక కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అనే భరోసా లేదు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్నవాళ్లే కాకుండా వ్యాక్సిన్​ వేసుకున్న వాళ్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. ​చాలామందిలో ‘లాంగ్ కొవిడ్’ కాంప్లికేషన్స్​ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు న్యూరో సర్జన్ రంగనాధం.

కరోనా వచ్చి, తగ్గినంక మొత్తం మారిపోయింది. అడపాదడపా వచ్చే ఆరోగ్య సమస్యలు నెలలు, సంవత్సరం అయినా కూడా చాలామందిలో అలానే ఉంటున్నాయి. ఇలా ఉండడాన్నే ‘లాంగ్​ కొవిడ్​’ అంటున్నారు. మనదగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వెంటిలేటర్​​ ట్రీట్​మెంట్​ తీసుకున్నవాళ్లలోనే లాంగ్​ కొవిడ్​ సింప్టమ్స్​ ఉంటాయనేది అపోహ. అలాగే, వ్యాక్సిన్​ వేసుకున్నంత మాత్రాన కొవిడ్​ నుంచి పూర్తి రక్షణ ఉంటుంది అనుకోవడమూ పొరపాటే. ఎందుకంటే వ్యాక్సిన్​ అనేది కరోనాకి మెడిసిన్​ కాదు. 

ఈ లక్షణాలు కనిపిస్తాయి

లాంగ్​ కొవిడ్​లో ఊపిరితిత్తుల్లో ఉండే స్పాంజి లాంటి అల్యువిలోలై కండరాలు డ్యామేజి అవుతాయి. దాంతో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస సరిగ్గా జరగవు. దాంతో, తొందరగా ఆయాసం వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరైతే డిప్రెషన్​ బారిన పడతారు. కరోనా టైంలో ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. మొత్తంగా చూస్తే... కరోనా నుంచి కోలుకున్న కొందరిలో ‘పోస్ట్​ ట్రమాటిక్​ స్ట్రెస్​ సిండ్రోమ్​’ కనిపిస్తోంది. మరికొందరిలో నిద్ర లేమి, పని మీద ధ్యాస తగ్గడం, కండరాల నొప్పి వంటివి కొన్ని వారాలు, నెలల పాటు ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న  పదిశాతం మందిలో ఇప్పటికీ వాసన, రుచి తెలియడం లేదు. 

మెడిసిన్ లేదు

లాంగ్​ కొవిడ్​కి ఫలానా మెడిసిన్​ అంటూ లేదు. లాంగ్​ కొవిడ్​ లక్షణాలు నెమ్మదినెమ్మదిగా తగ్గిపోతాయి. కండరాల నొప్పి ఉంటే పారాసిటమాల్​ వేసుకోవాలి. అంతే తప్ప స్టిరాయిడ్స్​ పరిష్కారం కాదు. కొందరిలో ‘గిల్లెన్​ బ్యారీ సిండ్రోమ్’ వస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకి వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్​ ఇవ్వాల్సి వస్తుంది. పార్కిన్​సన్స్​, అల్జీమర్స్​ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. 

లాంగ్​ కొవిడ్​ సమస్యలు రాకుండా ఉండాలంటే...  హాస్పిటల్​ వాళ్లు రికవరీ అయిన పేషెంట్స్ అడ్రస్​ తీసుకోవాలి. ఎందుకంటే కరోనా రికవరీ పేషెంట్స్​​ ఫాలో–అప్​ అనేది చాలా ముఖ్యం. కానీ, చాలామంది మళ్లీ డాక్టర్​ని కలవడం లేదు.  

మళ్లీ రాకుండా..

కరోనా తగ్గిన తర్వాత కూడా కొందరిలో జలుబు లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్​ని కలవాలి. కానీ, ఎవ్వరూ అలా చేయడం లేదు. కళ్లు ఎర్రబడడం, చెంప ఎముక నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే డాక్టర్​ని కలుస్తున్నారు. అప్పటికే బ్లాక్​ఫంగస్ (మ్యూకార్​ మైకోసిస్) శరీరంలోని చాలా భాగాల్లో తిష్ట వేస్తోంది. ​ ఈ ఫంగల్​ స్పోర్లు ముక్కు ద్వారా ప్రవేశించి, తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఈ ఫంగస్​ ఎముకల్ని తినేస్తుంది. కన్ను, దవడ ఎముక... వంటి భాగాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా రక్తంలోకి చేరి, రక్తనాళాల్ని ముక్కలు చేస్తుంది. ఈ కారణంగానే హార్ట్​స్ట్రోక్​, లంగ్ డ్యామేజీ వంటి సమస్యలు వస్తాయి. 

 ఇమ్యూనిటీ పెరగడానికి

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఫుడ్​ని మించిన మెడిసిన్​ లేదు. అందుకే, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వంటివి ఎక్కువ తినాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.