కవర్ స్టోరీ..జొరం మళ్లీ.. మళ్లీ

కవర్ స్టోరీ..జొరం మళ్లీ.. మళ్లీ

వర్షాకాలం మొదలైనప్పటి నుంచి దగ్గు, జలుబు, జ్వరం అంటూ ఇంటికొకరు ఇబ్బందిపడుతున్నారు. మామూలు రోజులతో పోలిస్తే ఇలాంటి కేసులు ఇప్పుడు వందశాతం కంటే ఎక్కువ పెరిగాయని డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా జ్వరాల బారిన పడుతుండడంతో ప్రజలు కూడా భయపడుతున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు, వయసుమీద పడిన వాళ్లు ఈ జ్వరాల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో వేలల్లో కేసులు నమోదయ్యాయి. వాటిలో హైదరాబాద్​లోనే ఎక్కువ కేసులు వచ్చాయి. ఇప్పుడైతే పలకరిస్తే ఫీవర్​ అన్న మాటే వినిపిస్తుంది.

సిటీలో ఒక అపార్ట్​మెంట్​లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు సునీల్​. ఒకరోజు ఉదయం లేవగానే జ్వరం, దగ్గుతో ముసుగుపెట్టి పడుకున్న ఫ్రెండ్​ని చూసి ‘‘వర్షాకాలం మొదలైందో లేదో జలుబు, దగ్గు, జ్వరాలు దండెత్తుతాయి. ప్రతి ఏడాది ఇదే గోల. అసలు ఇది వర్షాల సీజన్​ కాదు.. వ్యాధుల సీజన్’’​ అని గొణుక్కున్నాడు సునీల్​. ఆ తరువాత రోజు సునీల్​కి కూడా జ్వరం వచ్చింది. వెంటనే ల్యాబ్​కి వెళ్లి బ్లడ్​ టెస్ట్​కి ఇచ్చాడు. రిపోర్ట్​లో వైరల్​ ఫీవర్ కాదు అని వచ్చింది. అంతే.. అప్పటి నుంచి కనపడ్డ వాళ్లందరికీ ‘‘జ్వరం వస్తే వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోండి’’ అని సలహా ఇవ్వడం మొదలుపెట్టాడు. సరిగ్గా నాలుగు రోజుల తరువాత హాస్పిటల్​లో అడ్మిట్​ అవ్వాల్సి వచ్చింది సునీల్​కి. టెస్ట్​లు చేసి వైరల్ ఫీవర్ అని తేల్చారు డాక్టర్లు. అది విని షాకయ్యాడు సునీల్. ‘‘జ్వరం వచ్చిన మొదటి రోజే టెస్ట్​ చేయించుకుంటే నెగెటివ్​ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ ఎలా వచ్చింది డాక్టర్?’​’ అని అడిగాడు. ఈ మధ్య చాలామందికి ఇలాంటి డౌట్లే వస్తున్నాయి. ఒకసారి రిపోర్టు నెగెటివ్, మరోసారి పాజిటివ్​ ఎలా వచ్చింది? అసలు ఈ జ్వరాలేంటి? ఏ జ్వరానికి ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోవాలి? ఎప్పుడు ల్యాబ్​ టెస్ట్​ చేయించుకోవాలి? ఎలాంటి తిండి తినాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కలిపి ఈ వారం కవర్​స్టోరీ.

మామూలుగా శరీరానికి ఏదైనా హాని కలిగితే వెంటనే రియాక్ట్​ అవుతుంది. దాన్ని ‘ప్రొటెక్టివ్​ రిఫ్లెక్స్’ అంటాం. ఉదాహరణకు దగ్గునే తీసుకుంటే... గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు దగ్గు వస్తుంది. దగ్గడం వల్ల గొంతులో అడ్డుపడినది ఏదైనా బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా శరీరం లోపలికి కూడా హాని కలిగించే బ్యాక్టీరియా లేదా వైరస్ వెళ్లినప్పుడు వెంటనే బాడీ అలర్ట్​ అవుతుంది. శరీరంలో న్యూట్రిఫిల్స్​ అనేవి ఉంటాయి. అవి హానికారకాలను నాశనం చేయడానికి ట్రై చేస్తుంటాయి. బాడీ టెంపరేచర్​ నార్మల్​గా 37డిగ్రీ సెల్సియస్, 98 డిగ్రీ ఫారన్ హీట్​ ఉంటుంది. కానీ లోపలికి హాని కలిగించే వైరస్ లేదా బ్యాక్టీరియా ఏదైనా వెళ్లినప్పుడు టెంపరేచర్​ పెరుగుతుంది. ఆ టెంపరేచర్ ద్వారా హానికారక వైరస్​ లేదా బ్యాక్టీరియాలని చంపేస్తుంది. అయితే నార్మల్​ ఫీవర్ వస్తే కనుక ఒంట్లో టెంపరేచర్ మాత్రమే పెరుగుతుంది. అదే వైరల్ ఫీవర్ అయితే టెంపరేచర్​తోపాటు కీళ్ల నొప్పులు వస్తాయి. 

మల్టిపుల్ వైరస్​లు!

‘‘ఈ మధ్య మిక్స్​డ్ వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు వస్తున్నాయి. అలా వచ్చిన చాలాకేసుల్లో దగ్గు కామన్​గా ఉంటోంది. కొంతమందికి జ్వరంతో పాటు దగ్గు లేదా పొడి దగ్గు ఉంటుంది. రీసెంట్​గా ఒక70 ఏండ్ల పేషెంట్​కి శాంపిల్ తీస్తే కొవిడ్, ఎడినో, ఇన్​ఫ్లుయెంజా మూడు వైరస్​లు ఉన్నట్లు రిపోర్ట్​ వచ్చింది. ఇక్కడ విషయమేంటంటే.. ఆయన వయసు పెద్దది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. అదే యువత​లో అయితే సీజనల్ ఫీవర్స్​లా వస్తున్నాయి’’ అని ఈ మధ్య తనకి ఎదురైన ఎక్స్​పీరియెన్స్​ చెప్పారు డాక్టర్ రాజేంద్ర. ‘‘నిజానికి ఇలాంటి వైరల్ ఫీవర్స్​లో ట్రీట్​మెంట్​ చేయాల్సిన అవసరం పెద్దగా రాదు. కాకపోతే ఏదైనా వైరస్​ అనేది ఎటాక్ అయిందంటే ఒంట్లోని శక్తినంతా లాగేసుకుంటుంది. అప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది. దాంతో నీరసం, ఒళ్లు నొప్పులు, మత్తు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మరో వైరస్​ కూడా ఎటాక్​ చేసేందుకు వీలుంటుంది. కాబట్టి ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. ప్రతి నాలుగ్గంటలకు ఒకసారి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. వీటితోపాటు బెడ్ రెస్ట్​ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్” అని చెప్పారు​.

ప్లేట్​లెట్స్ ఎందుకు తగ్గుతాయి?

ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ప్లేట్​లెట్స్ తగ్గుతాయి. ఎందుకంటే వైరస్ అనేది ప్లేట్​లెట్స్​ని తినేస్తుంటుంది. ప్లేట్​లెట్స్ బాగా తగ్గితే ఇంటర్నల్​గా​ బ్లీడింగ్ జరుగుతుంది. శరీరానికి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ప్లేట్​లెట్స్ అనేవి రక్తం పోకుండా అడ్డుగోడలా ఉంటాయి. అదే ప్లేట్​లెట్స్ తక్కువైతే రక్తస్రావం మోతాదు తగ్గుతుంది. కానీ, ఎక్కువసేపు రక్తం పోతూనే ఉంటుంది. మామూలుగా లక్షకు పైగా ప్లేట్​లెట్స్ ఉంటే రెండు రోజులకు ఒకసారి ప్లేట్​లెట్ కౌంట్ చూడాలి. 50 వేల ప్లేట్​ లెట్స్ ఉంటే రోజూ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి 50 నుంచి 20 వేలకు ఒక్కసారిగా ప్లేట్​లెట్స్ తగ్గే ఛాన్స్​లు ఉంటాయి. ట్రీట్​మెంట్ చేస్తున్నప్పటికీ ప్లేట్​లెట్స్ ఒక్కోసారి తగ్గుతూనే ఉంటాయి. ప్లేట్​ లెట్ కౌంట్ తగ్గితే లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో పేషెంట్​ పరిస్థితి సీరియస్ అవుతుంది. అందుకని... డెంగీ లేదా ఇతర వైరల్​ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియల్, వైరల్​ ఇన్ఫెక్షన్స్ రెండిటినీ నాశనం చేయగల కెపాసిటీ ఉన్న మెడిసిన్. ఆ తర్వాత ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి. విశ్రాంతి చాలా అవసరం. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. ఐరన్ అందించే ఫుడ్​ తింటే ప్లేట్​లెట్స్ పెరుగుతాయి. 

ఈ టైంలో మందుల​తోపాటు ఫుడ్​ కూడా చాలా ముఖ్యం. అందుకే ఎంత పని ఉన్నా, జ్వరం వచ్చిందంటే శరీరానికి రెస్ట్ అవసరం. అలాకాకుండా మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటు. వైరల్ ఫీవర్స్​ వచ్చినప్పుడు మందులు, ద్రవపదార్థాల​తోపాటు రెండు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మూడో రోజు లేచి తిరుగుతారు. అలాకాకుండా వారం రోజులు పని చేస్తూనే ఉంటే అన్ని రోజులూ అలానే ఉంటుంది. జ్వరం తగ్గదు. దాని లక్షణాలు కూడా పోవు. 

సొంత వైద్యం వద్దు!

నార్మల్ ఫీవర్​లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వైరల్ ఫీవర్​లో వీక్​నెస్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు డెంగీలోనే చూస్తే... టాబ్లెట్​ వేసుకుని పడుకుంటే తగ్గిపోదు. ప్లేట్​లెట్స్ కౌంట్​ ఎంత ఉందనేది బ్లడ్​ టెస్ట్​ చేశాకే తెలుస్తుంది. అయితే జ్వరం వచ్చిన వెంటనే టెస్ట్​కి వెళ్లాల్సిన పనిలేదు. డెంగీ వస్తే జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పి, కళ్లు నొప్పులు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ట్యాబ్లెట్​​ వేసినా మూడు రోజులకు కూడా జ్వరం తగ్గకపోతే టెస్ట్ చేయించుకోవాలి. ఇమ్యూనిటీ తగ్గకుండా, నీరసించిపోకుండా చూసుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. 

లో ఫీవర్​ అంటే..

జ్వరం వస్తే టెంపరేచర్​ అనేది కచ్చితంగా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు టెంపరేచర్ లేకపోయినా లోపల ఫీవర్ ఉంటుంది. దానికి కారణం.. బ్రెయిన్​లో ఉండే హైపోథలామస్ అనే నిర్మాణం. అది టెంపరేచర్​ని పెరగకుండా, తగ్గకుండా కంట్రోల్​ చేస్తుంది. ఉదాహరణకు చలి ప్రదేశాలకు వెళ్లినప్పుడు లోపల టెంపరేచర్ నార్మల్​గా ఎలా ఉండగలుగుతుంది అంటే.. హైపో థలామస్​ పైరోజెన్స్​ని రిలీజ్ చేసి బాడీని నార్మల్​ టెంపరేచర్​లో ఉంచుతుంది. అలాగే బాడీ లోపల ఏవైనా హానికారకాలు ఉంటే వాటిని నాశనం చేసేందుకు టెంపరేచర్​ని పెంచుతుంది. అప్పుడు న్యూట్రోఫిల్స్ వెళ్లి హానికారకాలతో పోరాడతాయి. 

ఇవి చేయాలి

చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. వేడి వేడిగా తయారుచేసుకున్న ఫుడ్​ మాత్రమే తినాలి. బయటి ఫుడ్​ తినొద్దు. ఏ జ్వరం వచ్చినా డాక్టర్​ను కలవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే జ్వరం వంట్లో ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు బీపీ పెరుగుతుంది. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కించి జ్వరాన్ని కంట్రోల్ చేయాలి. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు విషమించి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

*   *   *

ఈ కాలంలోనే  ఎక్కువ

వర్షాకాలంలోనే వైరస్  స్ప్రెడ్​ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైరల్ ఇన్​ఫెక్షన్స్ వస్తాయి. వాటిల్లో ప్రమాదకరమైనది డెంగీ. అది కాకుండా ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాటిలో ఇన్​ఫ్లుయెంజా, వైరల్, రెస్పిరేటరీ  ఇన్ఫెక్షన్, హెచ్1ఎన్​1 వంటివి ఉంటాయి. ఇవన్నీ వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా వ్యాపిస్తాయి. మామూలుగా ఇమ్యూనిటీ ఉన్నవాళ్లకు జ్వరం, జలుబు, దగ్గు కూడా వస్తాయి. అదే ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్లు లేదా అప్పటికే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దానివల్ల ఆక్సిజన్ తగ్గుతుంది. హాస్పిటల్​లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వరకు వెళ్తుంది. ఈ రెస్పిరేటరీ లేదా ఫ్లూ ఇన్ఫెక్షన్స్​ అనేవి ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకు వస్తాయి. అలాగే ఆస్తమా, వయసు పైబడిన వాళ్లకు, ఊబకాయులకు, పొగ తాగేవాళ్లకు ఎక్కువగా వస్తుంటాయి. 

మొదటి రోజే టెస్ట్​లు అవసరమా?

బాడీ టెంపరేచర్​ వందకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం. కొంతమంది జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్​కి వెళ్తుంటారు. కానీ వాళ్లకు అప్పుడే బ్లడ్​ టెస్ట్​లు చేయాల్సిన అవసరం లేదు. మూడు రోజుల తర్వాత కూడా ఫీవర్ ఎక్కువగానే ఉందంటే.. అప్పుడు అవన్నీ చేయాలి. వైరల్​ ఫీవర్ అంటే జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, కీళ్ల నొప్పుల వంటివి ఉంటాయి. మూడు రోజుల తర్వాత ఆ టెంపరేచర్స్ అన్నీ తగ్గుతూ వస్తాయి.103 లేదా105 ఉన్న టెంపరేచర్100 లేదా90కి వచ్చేస్తుంది. మూడు నుంచి ఐదు రోజుల మధ్య ఇలా జరిగితే ఏ సమస్యా ఉండదు. కానీ, అంతకంటే ఎక్కువ రోజులు అయితే మాత్రం టైఫాయిడ్, మలేరియా వంటివి ఉన్నాయా? లేకపోతే వయసు మళ్లిన వాళ్లా? ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అనేది చూడాలి. అది కాకుండా కిడ్నీ సమస్య, ఆస్తమా, డయాబెటిస్, లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లకు మూడు రోజుల్లోపే టెస్ట్​లు చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాతే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా? వద్దా? అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. 

పిల్లల్లోనే ఎక్కువ

ఈ మధ్య డెంగీ జ్వరం పిల్లల్లో ఎక్కువగా వస్తోంది. పిల్లల్ని ఎక్కువగా కంట్రోల్ చేయలేం. పైగా వాళ్లకు ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. డెంగీ వస్తే జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులతోపాటు  చర్మంపై దద్దుర్లు వచ్చి ఎర్రగా మారడం, దురద పెట్టడం వంటివి ఉంటాయి. అదే ఫ్లూ ఇన్ఫెక్షన్​ అయితే జలుబు, ఆగకుండా దగ్గు రావడం, ఆయాసం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమంది పిల్లలకు తాగే నీళ్లు, తినే తిండి కూడా హాని చేస్తుంది. కలుషిత ఆహారం తినడం, నీళ్లు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. బయటి ఫుడ్ తిన్నా, ఇంట్లోనే కలుషిత నీళ్లు లేదా ఆహారం తీసుకున్నా వాంతులు, లూజ్ మోషన్స్​ అవుతాయి. దాంతో ఎక్కువగా డీహైడ్రేట్​ అవుతారు. బాగా బలహీన పడతారు. 

డెంగీ నెగెటివ్ వచ్చినా...

వైరల్​ ఫీవర్స్ ఏవైనా ప్లేట్​లెట్స్ తగ్గుతాయి. డెంగీ జ్వరం వస్తే మరీ ఎక్కువగా తగ్గుతాయి. అలాగే సివియర్ మలేరియాలో కూడా ప్లేట్​లెట్స్ తగ్గుతాయి. డెంగీ నెగెటివ్​ వచ్చినా కూడా ప్లేట్​లెట్స్ మాత్రం తగ్గుతూనే ఉంటాయి. ప్లేట్​లెట్స్ తగ్గుతున్నాయనగానే మొదట డెంగీ అనే అనుమానం వస్తుంది. టెస్ట్ చేశాక డెంగీ కాదని తెలిస్తే వేరే కారణాలు చూస్తారు. అలాగే కొన్నిసార్లు విపరీతమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్లేట్​లెట్స్ తగ్గుతాయి. ఏదేమైనప్పటికీ పేషెంట్​ మెడికల్ హిస్టరీని బట్టి టెస్ట్​లు చేసి, రోగనిర్ధారణ చేస్తారు. డెంగీ వైరస్ యాక్టివ్​గా ఉన్నంతసేపు ప్లేట్​లెట్స్ తగ్గుతాయి. నిజానికి ప్లేట్​లెట్స్ అనేవి వాటంతటవే పెరుగుతాయి. వాటికోసం సపరేట్​గా వేరే మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఫుడ్​ తీసుకోవడం వల్ల ప్లేట్​లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు కొందరు. కానీ, అది నిజం కాదు. అలాంటివి నమ్మి, వాటిని తీసుకోవడం  వల్ల సైడ్​ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వందమంది డెంగీ పేషెంట్స్​లో 50 మందికి మెడిసిన్ ఇచ్చి, మిగతా 50 మందికి ఇవ్వక పోయినా ప్లేట్​లెట్స్ పెరుగుతాయి. అవి ఇవ్వడం వల్ల వాంతులు, కడుపు ఉబ్బరం వంటివి ఎక్కువ అవుతాయి. అందుకే మెడిసిన్‌‌ ఇవ్వొద్దని చెప్తారు. డెంగీ వైరస్ ప్రభావం తగ్గుతున్నప్పుడు ప్లేట్​లెట్స్ వాటంతటవే పెరుగుతాయి. ప్లేట్​లెట్స్​20 వేల కంటే తక్కువ ఉన్నా, ఎక్స్​టర్నల్ బ్లీడింగ్​ జరిగితే అప్పుడు ప్లేట్​లెట్స్ ఎక్కిస్తారు. అంతే తప్ప ప్లేట్​లెట్స్ పెరగడం కోసం ప్రపంచంలో ఇంత వరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. 

యాంటీబయాటిక్స్ వద్దు! 

జ్వరం వస్తే పారసెటమాల్​ వేసుకుని రెస్ట్ తీసుకుంటే చాలు. యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఫుడ్​ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. జ్వరంతోపాటు జలుబు, దగ్గు ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా వేసుకోవచ్చు. అంతేకానీ యాంటీబయాటిక్స్ జోలికి వెళ్లకూడదు. కొందరు జలుబు చేయగానే యాంటీ బయాటిక్స్ వాడతారు. అలా వేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. యాంటీ బయాటిక్స్ అనేవి ఎలాగంటే అలా వాడితే శరీరానికి చేటు చేస్తాయి. అంతేకాకుండా అయినదానికి కానిదానికి ఎక్కువగా వాడడం వల్ల నిజంగా అవసరమైనప్పుడు యాంటీ బయాటిక్ వేసుకున్నా అది పనిచేయదు. యూరిన్​ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, దానివల్ల ఫీవర్ వచ్చినప్పుడు యాంటీ బయాటిక్స్ వాడాలి. అంతకుమించి వైరల్ ఫీవర్స్​కి యాంటీ బయాటిక్స్ పనిచేయవు.  

*   *   *

మళ్లీ మళ్లీ రావొచ్చు

కొంతమందికి డెంగీ, మలేరియా లేదా డెంగీ, టైఫాయిడ్ ఇలా రెండూ పాజిటివ్ ఉంటున్నాయి. ఇంతకుముందు కూడా కొవిడ్ టైంలో కరోనా, డెంగీ రెండూ పాజిటివ్ ఉన్న కేసులు వచ్చాయి. దాన్ని మిక్స్​డ్​ లేదా కో – ఇన్ఫెక్షన్ అంటారు. సాధారణంగా ఏదైనా వైరల్​ ఫీవర్ వారంలోగా తగ్గిపోతుంది. ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఫీవర్​ తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. డెంగీ వచ్చిన కేసుల్లో కూడా వారం లేదా పదిరోజుల్లో నయమవుతోంది. ఇప్పటికే డెంగీ వచ్చి తగ్గిన వాళ్లకు మరోసారి డెంగీ ఎటాక్ అవ్వచ్చు. ఎందుకంటే డెంగీలో నాలుగు రకాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఒకటి వస్తే, రెండోసారి మరో వేరియెంట్ రావొచ్చు. అందుకని వైరల్ ఫీవర్​ లేదా సీజనల్ డిసీజ్​ వచ్చినప్పుడు వెంటనే అలర్ట్​ కావాలి. సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో డెంగీ ఎక్కువగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. డెంగీ అనేది దోమ వల్లనే వస్తుంది. కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో రెపెల్లెంట్స్, దోమతెరలు వాడాలి. ఇంటిచుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త, మురుగు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పొడిగా ఉంచుకోవాలి. 

ప్లేట్​లెట్స్ టార్గెట్​ కాదు

 జ్వరమొస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో డెంగీలోనూ అవే ఉంటాయి. కాకపోతే తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి. అలాగని లక్షణాలు చూసి డెంగీ అని నిర్ధారించలేం. ఏ వైరల్​ ఫీవర్​ అయినా 90 శాతం త్వరగానే తగ్గిపోతుంది. ఒక పది శాతం మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు గాంధీ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభ. ప్లేట్​లెట్స్ తగ్గడం వల్ల మరణాలు సంభవించవు. డెంగీ షాక్​ సిండ్రోమ్​ వల్ల జరుగుతాయి. ఈ సిండ్రోమ్​లో రక్త నాళాల్లోని రక్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బీపీ తగ్గడం వల్ల ప్రాణానికి ప్రమాదం కలుగుతుంది. అందుకని ట్రీట్​మెంట్​లో ప్లేట్​లెట్స్ టార్గెట్​ కాదు... బీపీ తగ్గుతోందా? ఒళ్లు చల్లబడిపోతోందా? అనేది చూడాలి. ఫీవర్ వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వస్తుంది. నార్మల్​గానే ఉందని తర్వాత దాని గురించి పట్టించుకోరు. అది పొరపాటు. మూడు రోజుల వరకు సింప్టమాటిక్ ట్రీట్​మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత కూడా తగ్గకపోతే టెస్ట్​లు చేయాలి. మరొక విషయం ఏంటంటే.. షాక్ సిండ్రోమ్​ అనేది ఐదు రోజులు గడిచాక, ఫీవర్​ తగ్గాక వస్తుంది. అందుకని బ్లడ్​ టెస్ట్ రిపోర్ట్​లో ప్లేట్​లెట్ కౌంట్స్ మీద కంటే హిమటోక్రిట్​ అనేదానిపై దృష్టిపెట్టాలి. ఆ వాల్యూ పెరుగుతుంది అంటే బ్లడ్ చిక్కగా అవుతుందని అర్థం. అంటే బ్లడ్​లో వాల్యూమ్​ తగ్గిపోతుంది. అలాగే ప్లేట్​లెట్స్​ను శరీరం దానంతటదే ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ప్లేట్​లెట్స్ మరీ తగ్గితే రక్తస్రావం మొదలవుతుంది. అది ఒకసారి మొదలైతే ఆగదు. అలా జరగకుండా ఉండాలంటే.. మల విసర్జన నల్లగా ఉందేమో గమనించాలి. అలా వస్తుందంటే కడుపు భాగంలో రక్తం లీక్ అయిందని అర్థం. ఒంటిపై మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, కడుపులో నొప్పి, నీరసం, చల్లబడిపోవడం లాంటివి జరిగితే బీపీ తగ్గిందా లేదా లోపల బ్లీడింగ్ అవుతుందా అనేది చెక్ చేయాలి. ఇవన్నీ కూడా మొదటి మూడు రోజుల్లో కనిపించవు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యి ట్రీట్​మెంట్ తీసుకోవాలి. డెంగీ జ్వరం వచ్చిన వాళ్లలో సడెన్​గా మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

ఆలస్యం అయ్యేది ఇందుకే

సొంత వైద్యం చేసుకోవడం వల్ల ట్రీట్​మెంట్​కి ఆలస్యం అవుతుంది. ఈ మధ్య చాలామంది డాక్టర్​ సలహా లేకుండానే ల్యాబ్​ల్లో ఫీవర్ ప్రొఫైల్​ టెస్ట్​లు చేయించుకుంటున్నారు. అందులో ఐజీఎం, ఐజీజీ అని రెండు రకాలు ఉంటాయి. ఐజీఎం అనేది ప్రస్తుత పరిస్థితిని చెప్తుంది. ఐజీజీ టెస్ట్​ పాజిటివ్ వస్తే అది ఇంతకుముందు జ్వరం వచ్చింది అనేదానికి సంకేతం. అందుకని ఇలా సొంతంగా ల్యాబ్​లకు వెళ్లి టెస్ట్​లు చేయించుకుని, మెడికల్ షాప్​లో మందులు కొనుక్కుని వాడడం సరైన పద్ధతి కాదు. ఏది ఉన్నా డాక్టర్​ని కన్సల్ట్​ చేయడం మంచిదని హెచ్చరించారు డాక్టర్ ప్రతిభ. 

*   *   *

వృథా ప్రయాస

ఈ మధ్య ప్యాకేజీలా టెస్ట్​లు చేస్తున్నారు. అంటే ఒకేసారి నాలుగైదు టెస్ట్​లు చేస్తారు. వాటివల్ల ఉపయోగం లేదు. డెంగీ కోసం ఎన్​ఎస్​1 ఒక్కటి చేస్తే చాలు. బ్లడ్ కౌంట్ కోసం ఐదు రోజుల తర్వాత చేస్తే బెటర్. ముందు చేయడం వల్ల లాభం లేదు. ఎన్​ఎస్​1 పాజిటివ్ ఉండి, ప్లేట్​లెట్స్ తక్కువ ఉంటే రోజు మార్చి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి టెస్ట్ చేస్తుండాలి. 

వీటికి దూరంగా...

డెంగీ జ్వరం ఉన్నప్పుడు నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గట్ పైప్స్ అన్నీ ఎర్ర​గా అయిపోతాయి. ఇటువంటి వాళ్లలో రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కొందరు ప్లేట్​లెట్స్ పెంచడానికి స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. అలాంటప్పుడు కూడా రిస్క్ ఎక్కువ. డెంగీ ఫీవర్​లో ఎక్కువ డీహైడ్రేషన్ ఉంటుంది. కాబట్టి నోటి ద్వారా తీసుకునే ఫ్లూయిడ్స్ సరిపోకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. జ్వరం కంట్రోల్​ అవ్వడానికి అడ్మిట్​ కావాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి సడెన్​గా ప్లేట్​లెట్ కౌంట్​ తగ్గితే అది హెచ్చరిక అన్నమాట. ఏ వైరల్ ఫీవర్ అయినా మళ్లీ మళ్లీ వస్తుంది. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఫ్లూయిడ్​ హైడ్రేషన్ బాగా మెయింటెయిన్ చేయాలి. ఒకవేళ పనికి బయటకి వెళ్లాల్సి వస్తే కూడా ఏకబిగిన పని చేయకుండా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఇలా ఒక నెల రోజులు ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని ఉండాలి. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా 20 రోజుల పాటు నీరసంగానే ఉంటుంది. అందుకని దాని గురించి కంగారు పడనక్కర్లేదు’’ అని డాక్టర్ స్వర్ణ దీపక్ చెప్పారు. 

జ్వరాలు – లక్షణాలు

మలేరియా అనేది పరాన్నజీవుల  నుంచి వస్తుంది. ఇది వస్తే ప్రతి రెండురోజులకు ఒకసారి జ్వరం వస్తుంది. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్​. ఇది వస్తే కొన్ని రోజుల తర్వాత పొత్తికడుపు దగ్గర గులాబీరంగులో మచ్చలు కనిపిస్తాయి. జ్వరం ఉంటుంది. లివర్​ సరిగా పనిచేయదు. డెంగీ వస్తే జ్వరం, కండరాల నొప్పి ఉంటాయి. ప్లేట్​లెట్ కౌంట్ తగ్గుతుంది. కళ్ల చుట్టూ ఉబ్బినట్టు ఉంటుంది. బాగా వీక్​ అవుతారు. 

ఫీవర్​కి రీజన్​ సీజన్ కాదు!

వర్షాకాలం వస్తే జ్వరాలు వస్తాయి అనుకుంటారు అంతా. కానీ, జ్వరం రావడానికి అసలైన కారణం సీజన్​ కాదు. ఈ సీజన్​లో కుట్టే దోమలు. సీజన్ స్టార్ట్ అయ్యి, ఒక వర్షం పడ్డాక నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ తర్వాత తెరిపి ఇచ్చి ఎండ వస్తుంది. ఆ టైంలో నిల్వ ఉన్న నీటి దగ్గర దోమలు గుడ్లు పెడతాయి. ఆ తర్వాత మళ్లీ వర్షం పడితే అప్పుడు దోమల వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ఆ దోమలు కుట్టడం వల్ల జ్వరాలు వస్తాయి. అలాగే ఇంట్లో పెంచుకునే కుండీల్లో నీళ్లు నిల్వ ఉన్నా దోమల ఉత్పత్తి పెరుగుతుంది. అయితే, ఏ దోమలు కుట్టినా వైరల్​ జ్వరం రాదు. వైరస్​ ఎటాక్​ అయిన దోమ కుడితేనే వైరల్​ ఫీవర్ వస్తుంది.  ఇప్పుడు డెంగీ కేసులు పెరగడానికి కూడా కారణం ఇదే. డెంగీ అనేది ఈడిస్ ఏజిప్ట్ అనే దోమ కుట్టడం ద్వారా వస్తుంది. పైగా డెంగీ 1,2,3,4 అని నాలుగు రకాలు ఉంటాయి. డెంగీ జ్వరం అనేది మొదటిసారి దోమ కుట్టగానే అంత తీవ్రం​గా రాదు. మొదటిసారి వచ్చేదాన్ని ప్రైమరీ డెంగీ ఇన్ఫెక్షన్ అంటారు. ఇన్ఫెక్ట్​ అయ్యాక రెండోసారి జ్వరం వస్తే చాలా సివియర్​గా ఉంటుంది. అది కూడా ఎక్కువగా పిల్లల్లో లేదా వృద్ధుల్లో కనిపిస్తుంది. డెంగీ లేదా ఇతర వైరల్​ ఫీవర్స్ ఏవైనా రాకుండా ఉండాలంటే దోమల్ని చంపేయడం ఒక్కటే మార్గం. 

మాస్క్ వాడాలి

మూడు రోజుల తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదు. నీరసంగా ఉంటోంది. కంటిన్యూగా వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. బెడ్​ మీద నుంచి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. దగ్గు, ఆయాసం రావడం, ప్లేట్​లెట్స్, బీపీ తగ్గడం వంటివి జరిగినప్పుడు హాస్పిటల్​లో చేర్చాలి. జ్వరం వచ్చినవాళ్లు బయటకు వెళ్లేటప్పుడు వాళ్లు మాస్క్​ పెట్టుకోవాలి.  ఇంట్లో పెద్దవాళ్లు, చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంట్లో కూడా మాస్క్ వాడాలి. దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్​ అడ్డుపెట్టుకోవాలి. బాగా సిక్ అయితే వెంటనే హాస్పిటల్​కి వెళ్లాలి. తాజా ఫుడ్ తినాలి. నీళ్లు బాగా తాగాలి. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉన్నా.. దోమలు వాలిన ఫుడ్ తిన్నా ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు.

డెంగీ షాక్ సిండ్రోమ్​

డెంగీ పేషెంట్లకు లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. డెంగీ బారిన పడిన చాలామంది పేషెంట్స్​ ప్లేట్​లెట్స్ ఎక్కించకుండానే కోలుకుంటారు. మరి డెంగీ మరణాలకు కారణాలు ఏంటి అంటే... జ్వరం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్​, రక్తం చిక్కబడడం వల్ల హైపో టెన్షన్​కి గురవుతారు. ఆ తర్వాత ప్లేట్​లెట్స్ పడిపోతాయి. దాంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోతారు. దీన్నే ‘డెంగీ షాక్ సిండ్రోమ్’​ అంటారు. అందుకే వృద్ధులు, పిల్లలు, గర్భిణీ లేదా క్రానిక్​ డిసీజ్​లైన బీపీ, షుగర్ వంటివి ఉన్నవాళ్లు డెంగీ బారిన పడితే వెంటనే హాస్పిటల్​లో అడ్మిట్​ కావాలి. వీళ్లకు ఎక్కువ ప్రమాదం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఉదయం పూట కుట్టే ఏడిస్ ఈజిప్ట్​ అనే దోమ వల్ల డెంగీ వస్తుంది. డెంగీకి ఇప్పటివరకు సరైన మందు లేకపోయినప్పటికీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్​తో నయం చేయొచ్చు. అలా నయమైన కేసులు చాలా ఉన్నాయి. డెంగీ వచ్చినప్పుడు పారసెటమాల్ వేసుకోవచ్చు. కానీ, కొందరు ఒళ్లు నొప్పులు ఉన్నాయని పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటారు. అందువల్ల బ్లీడింగ్​ ఎక్కువై ఒక్కోసారి డెంగీ షాక్​ సిండ్రోమ్​ బారినపడి చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే యాంటీ బయాటిక్స్ కూడా వాడకూడదు. కొందరు బ్రీతింగ్​ ప్రాబ్లమ్ ఉందని స్టెరాయిడ్స్ వాడుతుంటారు. ఇలాంటి తప్పులు చేయడం వల్ల పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉంది. సొంత వైద్యానికి కూడా ఒక హద్దనేది ఉంటుంది. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. అనవసరంగా ఎక్కువ యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. అలాగే వేరే జబ్బులేవైనా ఉన్న వ్యక్తికి డెంగీ వస్తే మనిషి నీరసించి డెంగీ షాక్ సిండ్రోమ్ బారిన పడతారు. ప్లేట్​లెట్స్ ఇరవై వేల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ప్లేట్​లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. లక్ష ప్లేట్​లెట్స్ ఉన్నా మళ్లీ ఎక్కిస్తే అది సమస్యకు దారి తీస్తుంది.

టెంపరేచర్ తగ్గేలా చేయాలి

జ్వరం వచ్చిన పిల్లల్లో టెంపరేచర్ పెరుగుతుంది. అప్పుడు పారసెటమాల్ వేయడం, శరీరాన్ని తడి గుడ్డతో తుడవడం వంటివి చేసి టెంపరేచర్ తగ్గించాలి తల్లిదండ్రులు. కొందరైతే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు ట్యాబ్లెట్​ వేస్తే టెంపరేచర్ విషయం సరిగా తెలియదని ట్యాబ్లెట్​ వేయకుండా తీసుకొస్తారు. ఇలా చేయడం చాలా తప్పు. ఫీవర్ వస్తే పిల్లలు తట్టుకోలేరు. జ్వరం ఎక్కువగా ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి టెంపరేచర్ తగ్గేలా చేయాలి. వాళ్లకు ఫ్లూయిడ్స్ ఇస్తుండాలి. పిల్లలకైనా, పెద్దలకైనా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. పిల్లలు యాక్టివ్​గా ఉంటే ఇబ్బందేం లేదు. కానీ, నీరసంగా ఉన్నా, ఎక్కువ నిద్రపోతున్నా వెంటనే డాక్టర్​ దగ్గరికి వెళ్లాలి.  పిల్లల్లో, వృద్ధుల్లో హైడ్రేషన్ మెయింటెయిన్ చేయడం కష్టం. కాబట్టి వాళ్లకు కొంచెం రిస్క్ ఎక్కువ​. డయాబెటిస్, గుండె, లివర్, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లకు, రెగ్యులర్​గా ఏదో ఒక మెడిసిన్ వాడుతున్న వాళ్లకు రిస్క్ ఎక్కువ. ఏ లక్షణాలు కనిపించకపోయినా రిస్కే. 

అది అపోహ

మామూలుగా అయితే వైరల్ ఫీవర్ ఏదైనా మూడు రోజుల్లో లేదా ఐదు రోజుల్లో తగ్గిపోతుంది. తగ్గకపోతే ఐదో రోజు బ్లడ్​లో ప్లేట్​లెట్ కౌంట్ ఎలా ఉందో చూస్తాం. ప్లేట్​ లెట్‌‌అనేది డెంగీ తీవ్రత తెలుసుకోవడానికి మాత్రమే. ప్లేట్​లెట్ కౌంట్​ తగ్గగానే పేషెంట్​ చనిపోతాడు అనేది అపోహ. ప్లేట్​లెట్స్ పది నుంచి ఇరవై వేల మధ్యలో ఉన్నా వాటిని బయటినుంచి ఎక్కించకుండా జబ్బు నయం చేయొచ్చు. ప్లేట్​లెట్స్ 30 లేదా 50వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లేట్​లెట్స్ ఎక్కిస్తే దానివల్ల యాంటీబాడీస్ ఎక్కువ జనరేట్ అవుతాయి. దాంతో ఉన్న యాంటీబాడీస్​ నాశనం అయ్యే అవకాశం.  జ్వరం వస్తే పారసెటమాల్ వేసుకోవచ్చు. ఆడవాళ్లయితే రోజుకు మూడు గ్రాములు, మగవాళ్లైతే నాలుగు గ్రాముల వరకు పారసెటమాల్ వేసుకోవచ్చు. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే ఆరుగంటలకు ఒకసారి కూడా వేసుకోవచ్చు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దాదాపు మూడున్నర లీటర్ల ఫ్లూయిడ్స్ బాడీలోకి వెళ్లాలి. అందుకు ఓఆర్ఎస్​ చాలా బెటర్ ఆప్షన్. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా జ్వరం తగ్గట్లేదు అంటే డాక్టర్​ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం.

డాక్టర్. కె. స్వర్ణ దీపక్
కన్సల్టెంట్ క్రిటికల్‌ కేర్‌‌ మెడిసిన్, అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్‌