
- ప్రోగ్రెస్ రిపోర్టులో ఏం చెప్దాం?
- నిధులు రాకపాయె.. పనులు కాకపాయె
- పరేషాన్ అయితున్న ఎమ్మెల్యేలు
- చెప్పినన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టలే.. కట్టినయ్ ఇయ్యలే
- నామ్‌కే వాస్తేగా ‘మన ఊరు–మన బడి’.. మున్సిపాలిటీల్లో నత్తనడకన రోడ్ల విస్తరణ
- కాళేశ్వరం తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలకు..!
- అవతరణ ఉత్సవాల్లో ప్రగతి నివేదికలు చదవాలన్న సీఎం పెండింగ్ పనులు
- తలచుకొని తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు
వెలుగు, నెట్వర్క్: గడిచిన 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని ఈ తొమ్మిదేండ్లలో చేశామంటున్న సీఎం కేసీఆర్.. ఇదే విషయాన్ని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గొప్పగా చెప్పుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇటీవల సూచించారు. మే 25న కలెక్టర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగులోనూ ఇదే చెప్పి, నియోజకవర్గాల వారీగా ప్రగతి నివేదికపై పుస్తకాలు ప్రింట్ చేసి జనానికి పంచాలని ఆదేశించారు. అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందించి, ఊరూరా ప్రదర్శించాలన్నారు. సీఎం ఆదేశించడంతో తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనుల లెక్కతీద్దామని బయలుదేరిన ఎమ్మెల్యేలకు దిమ్మతిరుగుతున్నది. ఎంత ఆలోచించినా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి వ్యక్తిగత సంక్షేమ పథకాలే తప్ప నియోజకవర్గాల్లో తాము చేశామని చెప్పుకునేందుకు కనీసం నాలుగైదు అభివృద్ధి పనులు కూడా లేకపోవడంతో ప్రోగ్రెస్ రిపోర్టులో ఏం చెప్పుకోవాల్నో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ తొమ్మిదేండ్లలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తోపాటు కొందరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తప్ప తమ సెగ్మెంట్లలో ఎక్కడా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. జిల్లాకేంద్రాల్లో కట్టిన కొత్త కలెక్టరేట్లు తప్ప మరేమీ కనిపించట్లేదని, కనీసం మొదటి విడత శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తిచేయలేకపోయామని గుర్తుచేసుకుంటున్నారు. సర్కారు నుంచి ఫండ్స్ రాక నియోజకవర్గాల్లో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ పనులు, మండలాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, మన ఊరు – మన బడి కింద స్కూళ్ల డెవలప్మెంట్పనులు, గురుకులాలకు సొంత భవనాలు, పంచాయతీ బిల్డింగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెండింగ్పనుల లిస్టు చాంతాడంత ఉందని అంటున్నారు. ఈ పెండింగ్‌పనులను చేసినట్లుగా ప్రగతి నివేదికలో పెడ్తే జనం నిలదీస్తారని, పెట్టకపోతే సీఎం నుంచి చీవాట్లు పడ్తాయని సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు.
బడులు అట్ల.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇట్ల..
జనానికి కీలకమైనవి ఇండ్లు, బడులు, ఆసుపత్రులు. కానీ ఈ మూడింటినీ తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కొందరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నిజానికి ఇండ్లు లేని పేదలందరికీ సొం తంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్సర్కారు.. ఆ హామీ నిలబెట్టుకోలేకపోయింది. ఎనిమిదేండ్లలో కేవలం 2 లక్షల 92 వేల57 ఇండ్లను శాంక్షన్ చేసి.. ఈ ఏడాది ఏప్రిల్30 నాటికి 1,41,464 ఇండ్లను మాత్రమే నిర్మిం చింది. ఒక అంచనా ప్రకారం మన రాష్ట్రంలో ఇండ్లు లేని ఫ్యామిలీలు10 లక్షల దాకా ఉండగా.. సర్కారు ఇప్పటికి 20వేల ఇండ్లు కూడా పంచలేదు. హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్లాంటి జిల్లాల్లో ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇక మారుమూల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికి పూర్తయిన ఇండ్లు ఎనిమిది మాత్రమే. తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ కూడా వెయ్యి ఇండ్లన్నా కట్టలేదంటే రాష్ట్రంలో డబుల్బెడ్రూం ఇండ్ల స్కీం పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘మన ఊరు – మనబడి’ కింద స్కూళ్ల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 26,040 సర్కారు స్కూళ్లు ఉండగా.. రూ.7,290 కోట్లతో మూడు విడతల్లో అన్ని బడులను డెవలప్‌చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రూ.3,497 కోట్లతో 9,123 బడులను డెవలప్ చేస్తామని ఏడాది కింద ప్రకటించిన సర్కారు.. ఇప్పటికీ మండలానికి రెండు స్కూళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1200 స్కూళ్లలో మాత్రమే మౌలికవసతులు కల్పించింది. ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే గురుకులాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. స్టేట్‌వైడ్‌గా 281 బీసీ , 192 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. 180 ఎస్టీ గురుకులాల్లో 30.. 268 ఎస్సీ గురుకులాల్లో 150 కూడా అద్దె భవనాల్లోనే నడు స్తున్నాయి. తెలంగాణ వచ్చాక అప్‌గ్రేడ్ చేసిన ఆసుపత్రులు కూడా ఇప్పటికీ కొత్త బిల్డిం గులకు నోచుకోక శిథిలమైన పాత బిల్డింగుల్లోనే నడుస్తున్నాయి. ఇక సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో వివిధ స్కీముల కింద మున్సిపాలిటీల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే జనం నిలదీసే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు టెన్షన్పడ్తున్నారు.
స్మార్ట్ సిటీల్లోనూ యాడి యాడనే
హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సిటీగా చెప్పుకునే గ్రేటర్ వరంగల్ 2016 లో స్మార్ట్ సిటీ గా ఎంపికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డెవలప్మెంట్ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు మ్యాచింగ్గ్రాంట్ఇవ్వని రాష్ట్ర సర్కారు.. కనీసం కేంద్రం ఇచ్చిన ఫండ్స్ కు లెక్కలు కూడా చెప్పడం లేదు. దీంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. రూ.1200 కోట్లతో చేపడతామన్న మెట్రో రైలు ప్రాజెక్టు రాలేదు. సీఎం కేసీఆర్ ఏటా రూ. 100 కోట్ల స్పెషల్ ఫండ్స్ ఇస్తామని చెప్పినా.. నేటికీ పైసా కేటాయించలేదు. 2017లో ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో ఒకటి రెండు చిన్న కంపెనీలు తప్ప పెద్ద ఫ్యాక్టరీలేవీ రాలేదు. మమునూర్ ఎయిర్ పోర్ట్, కొత్త సెంట్రల్ జైల్ ఊసేలేదు. కాళోజీ కళాక్షేత్రం పనులు ఆగిపోయాయి. శిల్పారామానికి స్థలమే ఇవ్వలేదు. మూడేండ్ల కింద వచ్చిన వరదలకు వరంగల్ నీటమునగగా, శాశ్వత వరద నివారణ చర్యలకు రూ. 250 కోట్లు ఇస్తామన్న సర్కారు.. ఇప్పటికి పైసా ఇవ్వకపోవడంతో నాలాల విస్తరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో గ్రేటర్ వరంగల్ సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు తమ ప్రగతినివేదికలో ఏ డెవలప్మెంట్పనులు పెట్టాల్నో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు మరో స్మార్ట్‌సిటీ కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట రూ. 410 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికీ రిటైనింగ్‌వాల్ దశ దాటలేదు. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ సెంటర్ ఏర్పాటుకు రూ.5 కోట్లు రిలీజ్‌కాలేదు. మరో రూ.50 కోట్లు వస్తే తప్ప రోడ్ల విస్తరణ పనులు పూర్తికావు. వనపర్తికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరైనా బిల్డింగ్ కట్టలేని పరిస్థితి.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు మూలకు
లక్ష కోట్లతో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీటి రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్న రాష్ట్ర సర్కారు.. జిల్లాల్లో ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లు తప్ప కెనాల్స్నిర్మించకపోవడంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేందుకు 2015 లో చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తికాలేదు. కల్వకుర్తి , నెట్టెంపాడు, బీమా లిఫ్టు స్కీంలకు మెయిన్ కెనాల్స్ తప్ప బ్రాంచ్, మైనర్స్ నిర్మాణం లేక ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. నల్గొండ జిల్లాలోని ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, నాగార్జునసాగర్ పరిధిలోని లిఫ్ట్ స్కీములు పెండింగ్‌లో పడ్డాయి. ఈ పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,495 కోట్లు కావాలని ప్రపోజల్ పెట్టగా అతీగతి లేదు. మరో కీలకమైన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాకపోవడంతో తో సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. దీని కింద సుమారు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేలు రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్‌గంగా పై చనాక కొరాట బ్యారేజీ పనులు 8 ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కుమ్రంభీం ప్రాజెక్ట్ నిర్మించి 15 ఏండ్లయినా కెనాల్ పనులు పూర్తికాలేదు. భద్రాద్రి జిల్లాలో రూ. 13,057.98 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ మూడేండ్ల కిందే పూర్తి కావాల్సి ఉన్నా.. నిధులు సరిపడా రాక పెండింగ్‌లో పడింది. వీటితోపాటు మధ్య, చిన్న తరహా అనేక ప్రాజెక్టుల పనులు ఫండ్స్ లేక ముందుకు సాగడం లేదు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నిర్మించిన శ్రీరాంసాగర్, నాగర్జునసాగర్లాంటి ప్రాజెక్టుల నుంచే తప్ప తాము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇస్తున్నామని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ఇవన్నీ ప్రగతి నివేదికలో ఎలా రాసుకోగలమని ఎమ్మెల్యేలు అంటున్నారు.
వర్దన్నపేటలో ఇట్ల..!
వర్ధన్నపేట నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసినట్లు చెప్పుకునేందుకు, ప్రస్తుతం ప్రగతి నివేదికలో రాసుకునేందుకు పెద్దగా అభివృద్ధి పనులు కనిపిస్తలేవు. రూ. 13.62 కోట్లతో చేపట్టిన కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతు పనులు ఫండ్స్ లేక మూడేండ్లుగా మూలుగుతున్నాయి. వర్ధన్నపేట మండలంలో ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదు. ఈ మున్సిపాలిటీలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో రూ. 9.24 కోట్లతో చేపట్టిన మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు కూడా నిధులు లేక నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది కింద ఇక్కడే రూ. 2 కోట్లతో శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్మార్కెట్ పనులు ముందరపడ్తలేవు. వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి.