పర్సనల్‌ లోన్‌ కట్టకుంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే..

పర్సనల్‌ లోన్‌ కట్టకుంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే..

న్యూఢిల్లీ: హోంలోన్‌‌‌‌ లేదా వెహికల్‌‌ లోన్‌‌ వంటి సెక్యూర్డ్‌‌ లోన్స్‌‌ను కస్టమర్‌‌ చెల్లించకుంటే బ్యాంకులు  కఠిన చర్యలు తీసుకుంటాయి. కొల్లటేరల్‌‌గా పెట్టిన వెహికల్‌‌ను/ఇల్లును  అమ్మి బకాయిలు వసూలు చేసుకుంటాయి.  మరి పర్సనల్‌‌ లోన్ వంటి అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్‌‌ కట్టకుంటే బ్యాంకులు ఏం చేస్తాయి ?  దీనికి ఫైనాన్షియల్‌‌ ఎక్స్‌‌పర్టులు జవాబు ఏంటంటే.. బ్యాంకులు సాధారణంగా కస్టమర్‌‌ (బారోవర్‌‌)  కస్టమర్‌‌ బకాయిపడ్డప్పటికీ, అతని ఆస్తిపాస్తులను వెంటనే జప్తు చేయవు.  ఇవి అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్లు కాబట్టి కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాయి.  లోన్‌‌ కాంట్రాక్టు  రూల్స్‌‌ ప్రకారం చర్యలు ఉంటాయి. కోర్టు పర్మిషన్​తో  ఆస్తులను టెంపరరీగా అటాచ్‌‌ చేస్తాయి.

మొదట ఏం చేస్తారంటే..
వరసగా మూడు నెలలు కిస్తీలు కట్టకపోతే.. ఆ లోన్‌‌ను బ్యాంకులు ‘మొండిబాకీ’గా చూస్తాయి. రెండు నెలల్లోపు బకాయిలు కట్టాలంటూ నోటీసు పంపుతాయి. కస్టమర్‌‌ ఈ లోపే బ్యాంకుతో రాజీ చేసుకోవచ్చు. లేకపోతే రెండు నెలలు చూసి బ్యాంకర్‌‌ తన లియన్‌‌ హక్కును ఉపయోగించుకోవచ్చు. బారోవర్‌‌ ఆస్తులు.. సెక్యూరిటీలు, షేర్లు, డిపాజిట్లు వంటి వాటిని తన అధీనంలోకి తీసుకోవచ్చు. 

బారోవర్‌‌‌‌కూ హక్కులుంటాయ్‌‌... 
అప్పు కట్టలేని బారోవర్‌‌ తన వాదనను బ్యాంకుకు వినిపించవచ్చు. అప్పు కట్టాల్సిందిగా బ్యాంకు అతడు/ఆమెకు తప్పకుండా నోటీసు పంపాలి.  అమర్యాదగా ప్రవర్తించకూడదు.  ఇబ్బందిపెడితే బారోవర్‌‌ .. బ్యాంకింగ్ అంబుడ్స్‌‌మన్‌‌కు కంప్లెయింట్‌‌ ఇవ్వొచ్చు. అయినా వేధింపులు ఆగకపోతే పోలీసుల దగ్గర వెళ్లొచ్చు లేదా సివిల్‌‌ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్‌‌ తెచ్చుకోవచ్చు. డీఆర్‌‌టీ ఎదుట తన వాదన వినిపించవచ్చు. బ్యాంకులు బారోవర్‌‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నా, అన్నింటినీ అమ్మవు. తమ బకాయిల విలువకు సమానమైన వాటినే అమ్మాలి.   ఈ రూల్‌‌ పాటించకున్నా, బారోవర్‌‌ తిరిగి డీఆర్‌‌టీకి ఫిర్యాదు ఇవ్వొచ్చు. బ్యాంకులు బారోవర్‌‌ లోన్‌‌ను మొండిబాకీగా గుర్తించి అప్పును మాఫీ చేసినా ఇబ్బందులు తప్పవు. బారోవర్‌‌ క్రెడిట్‌‌ హిస్టరీ దెబ్బతింటుంది కాబట్టి అప్పటి నుంచి లోన్లు పుట్టడం చాలా కష్టం. క్రెడిట్‌‌ హిస్టరీని మెరుగుపర్చుకోవాలంటే ఏళ్లు పడుతుంది. అంతేకాదు కొన్నిసార్లు బ్యాంకులు క్రిమినల్‌‌ కేసులు కూడా పెడతాయి. బారోవర్‌‌ నమ్మకం ద్రోహం చేశాడని ఆరోపిస్తాయి.

చివరికి కోర్టు కేసు...
బారోవర్​ డబ్బు కట్టే అవకాశం లేకుంటే మొదట జిల్లాకోర్టు లేదా హైకోర్టులో లాసూట్‌‌ వేస్తారు. బ్యాంకుకు అనుకూలంగా ఆదేశాలు వస్తే ఆస్తుల స్వాధీనానికి ప్రయత్నాలు మొదవుతాయి. ఈ సమయంలోనూ కస్టమర్ బ్యాంకు ఆఫీసర్లతో రాజీకి రావొచ్చు. కోర్టు డిక్రీ ప్రకారం.. అప్పు కట్టకుంటే బ్యాంకు అతని ఆస్తులను జప్తునకు ఆదేశాలు ఇస్తుంది. బకాయి విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉంటే వసూలు కోసం బ్యాంకు డెట్‌‌ రికవరీ ట్రైబ్యునల్‌‌కు వెళ్లాలి. అక్కడ జడ్జి ఇరు వర్గాల వాదనలు వింటారు. తాను ఎందుకు అప్పు కట్టలేకపోతున్నాననే విషయాన్ని బారోవర్‌‌ ఆయనకు వివరించవచ్చు. ఆ తరువాతే డీఆర్‌‌టీ నుంచి తుది తీర్పు వస్తుంది. ప్రొసీడింగ్స్‌‌ ముగిసిన తరువాత ట్రైబ్యునల్‌‌ అప్పులు వసూలు/ఆస్తుల స్వాధీనం కోసం రిసీవర్‌‌ను నియమిస్తుంది. బారోవర్‌‌ ఆస్తుల వివరాలను సేకరించేందుకు కమిషనర్‌‌నూ అపాయింట్‌‌ చేస్తుంది. ఆయా ఆస్తులను అటాచ్‌‌ చేసి అమ్ముతుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. అయితే బారోవర్‌‌ నుంచి అప్పుతోపాటు వడ్డీ, కోర్టు ఖర్చులు, లేట్‌‌ ఫీజు, పెనాల్టీలనూ వసూలు చేస్తారు.