నాగర్ కర్నూల్​ రాజకీయాల్లో చిచ్చు రేపిన వాట్సాప్​ పోస్ట్​

నాగర్ కర్నూల్​ రాజకీయాల్లో చిచ్చు రేపిన వాట్సాప్​ పోస్ట్​
  • నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రిని దూషించాడని   ఎమ్మెల్సీ కూచుకుళ్ల అనుచరుడిపై కేసు 
  • స్టేషన్​లో ఎస్ఐ తిట్టి, కొట్టాడని ఆరోపణలు 

నాగర్​కర్నూల్, ​వెలుగు : నాగర్​కర్నూల్​జిల్లాలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాట్సాప్​ పోస్ట్​ చిచ్చురేపింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అనుచరులు పోస్ట్​ పెట్టగా, ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు నాగనూలు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఎమ్మెల్యే అనుచరుల కంప్లయింట్​తో కృష్ణారెడ్డిని స్టేషన్​కు పిలిపించి ఎస్సై చేయి చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై ఎమ్మెల్సీ అనుచరులు ఎస్సైపై సీఐకి కంప్లయింట్​ చేశారు.  

అసలేం జరిగిందంటే...

కూచుకుళ్ల దామోదర్​రెడ్డికి రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా పార్టీలో అవమానాల పాలయ్యాయని పదేపదే అనడం దేనికంటూ ఎమ్మెల్యే మర్రి అనుచరులు వాట్సాప్​లో పోస్ట్​ పెట్టారు. దీనిపై రియాక్ట్​ అయిన ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు కృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై అనుచిత కామెంట్స్​ చేశాడు. దీనిపై ఎమ్మెల్యే మర్రి అనుచరులు నాగర్​కర్నూల్​ పీఎస్​లో కంప్లయింట్​ చేశారు. దీంతో గురువారం ఉదయం నాగనూల్​లోని కృష్ణారెడ్డి ఇంటికి కానిస్టేబుల్​ను పంపించారు. తానే వస్తానని చెప్పడంతో కానిస్టేబుల్ ​వెళ్లిపోయాడు. తర్వాత స్వయంగా ఎస్ఐ విజయ్​కుమార్​అతడి ఇంటికి వెళ్లి పోలీస్ ​వెహికల్​లో తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా రాలేదు. తాను బైక్​పై వస్తానని చెప్పడంతో సరే అన్నాడు.  స్టేషన్​కు వచ్చిన తర్వాత కృష్ణారెడ్డిని ఎస్​ఐ బూతులు తిట్టి కొట్టాడని ఎమ్మెల్సీ అనుచరులు ఆరోపించారు. కృష్ణారెడ్డిని స్టేషన్​కు పిలిపించారన్న సమాచారం అందడంతో నాగనూల్ నుంచి ఎమ్మెల్సీ అనుచరులు పీఎస్​కు చేరుకున్నారు. తర్వాత కృష్ణారెడ్డిని స్టేషన్​ బెయిల్​పై వదిలేశారు. ఈ ఉదంతంపై తొలుత స్పందించాలని ఎమ్మెల్సీ వర్గీయులు భావించినా ఆయన వాడిన భాష ఇబ్బందికరంగా ఉండడంతో తర్వాత చూసుకుందాం అన్న ధోరణిలో సైలెంట్​అయనట్లు తెలిసింది.