వీడియో కాల్ తో అందాల ఎర.. ఆపై బెదిరింపుల పరంపర

వీడియో కాల్ తో అందాల ఎర..  ఆపై బెదిరింపుల పరంపర

అందమైన యువతి ఫొటోతో వాట్సప్ మెసేజ్, వీడియో కాల్ వచ్చిందా ? ఏ మాత్రం ఆలోచించకుండా రిసీవ్ చేస్తే.. బుక్ అయిపోవడం గ్యారంటీ. న్యూడ్ వీడియోస్ ను పంపించి... బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంటారు. డబ్బులు పంపాలి.. లేకపోతే.. వీడియోలు వైరల్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ తరహా ఘటనలతో ఆందోళన రేకెత్తుతోంది. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులను దండుకుంటున్నారు. ఎవరు ఊహించని విధంగా వాళ్లు చేస్తున్న దోపిడికి అమాయకులు బలై పోతున్నారు.

తెలియని ఫోన్ కాల్ నుంచి వచ్చే మెసేజ్, వాట్సప్ వీడియో కాల్ లకు రెస్పాండ్ ఇవ్వొద్దని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందమైన యువతుల ఫొటోలతో కూడిన వాట్సప్ మెసేజ్, వీడియో కాల్స్ వస్తున్నాయి. కాల్స్ లిఫ్ట్ చేయగానే.. న్యూడ్ వీడియోస్ దర్శనమిస్తున్నాయి. కాసేపటికే ఆ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. డబ్బులు పంపాలంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. లేదంటే వీడియో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో కొందరు నెటిజన్స్ భయపడిపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్పాండ్ అయ్యారు. గుర్తు తెలియని నంబర్స్ తో వాట్సప్ చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ చేయొద్దని సూచిస్తున్నారు.